Share News

85% జగన్‌ హామీలు ఫెయిల్‌ 730లో 109 మాత్రమే అమలు

ABN , Publish Date - Dec 29 , 2023 | 03:33 AM

సీఎం జగన్‌ తెచ్చిన నవరత్నాలు, మేనిఫెస్టో, పాదయాత్ర హామీలు 15 శాతం కూడా అమలు కాలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

85% జగన్‌ హామీలు ఫెయిల్‌ 730లో 109 మాత్రమే అమలు

ఇంత అబద్ధాలకోరు సీఎంను చూడలేదు

త్వరలో నియోజకవర్గాల వారీగా సభలు

జగన్‌ వంచనను వివరిస్తాం: అచ్చెన్న

‘85 శాతం ఫెయిల్‌’ పుస్తకావిష్కరణ

అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ తెచ్చిన నవరత్నాలు, మేనిఫెస్టో, పాదయాత్ర హామీలు 15 శాతం కూడా అమలు కాలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. నవరత్నాలు నవమోసాలయ్యాయని విమర్శించారు. గురువారమిక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో..‘నవరత్నాలు, మేనిఫెస్టో, జగన్‌రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో.. ‘85 శాతం ఫెయిల్‌’ పేరుతో 150 పేజీల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘పచ్చి అబద్ధాలకోరు జగన్‌ ప్రజలకు ఇచ్చిన 730 హామీల్లో కేవలం 109 మాత్రమే అమలు చేశారు. అంటే 15 శాతమే. కానీ ప్రతి సభలో 99.5 శాతం హామీలు అమలు చేశామని చెప్పుకోవడం.. పచ్చి అబద్ధాలు, నిలువెత్తు మోసాలకు ప్రతిరూపమైన జగన్‌కే చెల్లింది. ఆయన ఎంత మోసగాడో, ఎంత పచ్చి అబద్ధాలకోరో ప్రజలకు తెలియజేయడానికే ఈ పుస్తకం తీసుకొచ్చాం. ఆయన మోసాలను ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి తెలియజేస్తాం. త్వరలోనే పార్లమెంటు నియోజకవర్గాలవారీగా భారీ బహిరంగ సభలు నిర్వహించి జగన్‌రెడ్డి వంచనను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తాం’ అని వెల్లడించారు. తన మేనిఫెస్టోను బైబిల్‌తో సమానమని చెప్పుకొన్న జగన్‌.. మాటమీద నిలబడకుంటే పదవికి రాజీనామా చేయాలని గతంలో ప్రగల్భాలు పలికిన జగన్‌.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు లెంపలేసుకుని తప్పు ఒప్పుకుని తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ సర్కారు రూ.10 లక్షల కోట్లు అప్పు చేసిందని.. నాలుగున్నరేళ్లలో పేదల రక్తం పీల్చి వివిధరూపాల్లో రూ.2 లక్షల కోట్లు వసూలుచేశారని.. మొత్తంగా రూ.12 లక్షల కోట్లలో జగన్‌ బటన్‌ నొక్కుడు ద్వారా ప్రజలకు అందించిన సొమ్ము రూ.2.40 లక్షల కోట్లు మాత్రమేనని చెప్పారు. మిగిలిన సొమ్ము ఎటు పోయిందని ప్రశ్నించారు. తన పాలనలో జగన్‌ ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మించి ఒక్క ఎకరాకు నీరివ్వలేదన్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. అధికారం కోసం అవాస్తవాలు చెప్పడం, గద్దెనెక్కాక కక్ష సాధింపులు, దోపిడీలకు పాల్పడడం జగన్‌ నైజమన్నారు.

వైఫల్యాలివిగో.. ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన హామీల్లో 85 శాతం అసలు అమలే కాలేదని టీడీపీ తన పుస్తకంలో వెల్లడించింది. తమ మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని ముఖ్యమంత్రి, మంత్రులు పదేపదే చేస్తున్న ప్రకటనలకు సమాధానంగా ఈ హామీలపై పెద్ద పుస్తకమే తీసుకొచ్చింది. జగన్‌ ఇచ్చిన హామీలను మూడు రకాలుగా వర్గీకరించింది. నవ రత్నాల పేరుతో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, పాదయాత్రలో ఇచ్చిన హామీలుగా వీటిని విభజించారు. పాదయాత్రలో ఇచ్చిన వాటిలో కూడా రాష్ట్ర స్థాయి హామీలు, జిల్లా నియోజకవర్గ స్ధాయి హామీలుగా విభజించారు.

Updated Date - Dec 29 , 2023 | 03:33 AM