Share News

500 కోట్లకే!

ABN , First Publish Date - 2023-11-29T04:18:40+05:30 IST

అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ భూముల్లో కొత్త కుంభకోణం మొదలైందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

500 కోట్లకే!

5 వేల కోట్ల భూములు..

లేపాక్షి భూముల్లో కొత్త స్కాం

కొద్ది డబ్బు చెల్లిస్తే.. తొమ్మిది వేల ఎకరాలు ప్రభుత్వం చేతికి

తన మనుషులు ఉన్నారనే కదలని జగన్‌: టీడీపీ ఆరోపణ

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ భూముల్లో కొత్త కుంభకోణం మొదలైందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. రూ.5 వేల కోట్ల విలువైన భూములను కేవలం రూ.500 కోట్లకు హస్తగతం చేసుకొనేలా వ్యవహారం నడుస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి సన్నిహితులైన వ్యక్తులు, సంస్థలే ఇందులో ప్రముఖంగా కనిపిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొద్ది మొత్తం వెచ్చిస్తే తొమ్మిది వేల ఎకరాల భూమి సర్కారు చేతికి వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం కదలడం లేదని, తమ వారికి లబ్ధి కలగాలనే ముఖ్యమంత్రి మౌనం వహిస్తున్నారని విమర్శించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అనంతపురం జిల్లాలో ఇందూ ప్రాజెక్ట్స్‌ కంపెనీకి నాటి వైఎస్‌ ప్రభుత్వం లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ పేరుతో తొమ్మిది వేల ఎకరాల భూమిని కేటాయించింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి, కియా పరిశ్రమకు మధ్యలో ఇవి ఉన్నాయి. ఇందులో ఆరు వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించారు. మూడు వేల ఎకరాలు ప్రభుత్వ భూములు. అప్పట్లో రైతులకు ఎకరానికి రూ.లక్ష ఇచ్చారు. ఇప్పుడు అవే భూముల విలువ ఎకరం రూ.కోటికి చేరింది. పరిశ్రమలు పెడతానని ఈ భూములు తీసుకొన్న ఇందూ సంస్థ వాటిని 9 బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.4వేల కోట్ల రుణం తీసుకుంది. ఇంత భారీ మొత్తం రుణం ఇచ్చిన ఈ బ్యాంకులు ఇటీవల అన్నీ కలిపి రూ.477 కోట్లు చెల్లిస్తే మొత్తం భూమిని ఇవ్వడానికి అంగీకరించాయి. దీనికి సంబంధిత ట్రైబ్యునల్‌ కూడా అంగీకారం తెలిపింది. కేవలం పది శాతం రుణం చెల్లిస్తే మిగిలిన రుణం మొత్తం మాఫీ చేయడానికి బ్యాంకులు అంగీకరించడం అనేక అనుమానాలు కలిగిస్తోంది. ఈ విధంగా తీసుకోడానికి అరబిందో సహా కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి. అలా వచ్చిన కంపెనీలన్నీ ముఖ్యమంత్రి సన్నిహితులకు సంబంధించినవే. అందులో ఒక కంపెనీకి అనుమతి కూడా లభించింది. అయితే, ఆ కంపెనీ డబ్బు చెల్లించలేకపోవడంతో ఆ ప్రక్రియ అంతటితో నిలిచిపోయింది’ అని విజయ్‌కుమార్‌ తెలిపారు. ఇందూ ప్రాజెక్ట్స్‌ తాకట్టు పెట్టిన భూముల్లో హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన దుర్గం చెరువు ప్రాంతంలోని 12 ఎకరాలు, మియాపూర్‌ ప్రాంతంలో 20 ఎకరాలు, హైదరాబాద్‌లోనే ఇతర ప్రాంతాల్లో మరో 35 ఎకరాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని భూముల వరకూ వేలం వేసినా బ్యాంకులు కోరుతున్న రూ.500 కోట్లకు రెట్టింపు వస్తాయని, అయినా పట్టించుకోకుండా మొత్తం భూములు రూ.500 కోట్లకు ఇస్తామని బ్యాంకులు అడుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

Updated Date - 2023-11-29T04:18:59+05:30 IST