Lanka Lands: లంకల్లో వాలిన గద్దలు!

ABN , First Publish Date - 2023-02-08T03:15:57+05:30 IST

కృష్ణా, గోదావరి నదీ తీరం వెంబడి ముంపునకు గురయ్యే ప్రాంతంలో ఉన్న భూములే... లంక భూములు. నదులకు వరద వచ్చినప్పుడు మునిగిపోతాయి. మిగిలిన రోజుల్లో ఆ నేలలకు అనుకూలమైన పంటలు పండిస్తుంటారు.

Lanka Lands: లంకల్లో వాలిన గద్దలు!

రాష్ట్రంలో 23 వేల ఎకరాల లంక భూములు

కేటగిరీలు మార్చేసి సొంత ఖాతాలోకి!

‘సీ’ కేటగిరీ నుంచి ‘బీ’లోకి మార్చి పట్టాలు

ముందుగానే పాగా వేసి చక్రం తిప్పుతున్న నేతలు

ఎవరి పేరిట ఇవ్వాలో వారి నుంచే జాబితా

వారు కోరుకున్నట్లుగానే సర్కారు ఉత్తర్వులు

అసైన్డ్‌ భూములు, షరతుగల పట్టా భూములు, అనాధీనం భూములు... వీటిని ఎంచక్కా భోంచేస్తున్న అధికార పార్టీ నేతలు చివరికి లంక భూములపైనా పడ్డారు. పేదల పేరుతో వాటినీ సొంతం చేసుకునేలా స్కెచ్‌ గీశారు. ప్రభుత్వమూ అదే ముసుగులో ‘తగిన’ ఆదేశాలు జారీ చేసేసింది. దీంతో... లంక భూముల ‘కేటగిరీ’లు చకచకా మారిపోతున్నాయి. పట్టాలు పుట్టేస్తున్నాయి. ఇందులో లబ్ధి పొందేవారిలో అసలైన పేద రైతులు గరిష్ఠంగా 40 శాతమే! మిగిలిన వారంతా అధికార పార్టీ నేతలే.

(అమరావతి - ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి నదీ తీరం వెంబడి ముంపునకు గురయ్యే ప్రాంతంలో ఉన్న భూములే... లంక భూములు. నదులకు వరద వచ్చినప్పుడు మునిగిపోతాయి. మిగిలిన రోజుల్లో ఆ నేలలకు అనుకూలమైన పంటలు పండిస్తుంటారు. రాష్ట్రంలో ఆరు జిల్లాల పరిధిలో 23వేల ఎకరాల లంక భూములున్నాయి. వీటిలో ఏ, బీ, సీ అనే మూడు కేటగిరీలు ఉన్నాయి. ‘ఏ’ కేటగిరీలోనివి పట్టా భూములు. ఇవి శాశ్వతంగా లంకలు. ముంపు చాలా తక్కువ. దాదాపు అన్నీ ప్రైవేటు పట్టా భూములే ఉంటాయి. ఇక... బి-కేటగిరీ భూముల్లో పాక్షికంగా ముంపు ఉంటుంది. ఇక్కడి భూములు ప్రైవేటు వ్యక్తుల సాగులో ఉన్నప్పటికీ, వీటిపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. పర్యావరణం, మత్స్య సంపదపరంగా కీలకమైనవి. అందుకే...ఈ భూములపై ప్రభుత్వ ఆ జమాయిషీ ఉంటుంది. ఇక...సీ-కేటగిరీ భూములు పూర్తిగా ప్రభుత్వానికి చెందినవే. తరచూ ముంపునకు గురవుతాయి. వీటిని ప్రభుత్వం ఏడాది గడువుతో లీజుకు ఇస్తుంది. ఏటా లీజు పొడిగిస్తూ రావొచ్చు.

బీ, సీ భూముల్లో పాగా...

ప్రభుత్వ నియంత్రణలోని భూములను ‘ప్రైవేటు’ పరం చేయడమే లక్ష్యంగా సాగుతున్న యజ్ఞంలో లంక భూములూ చేరాయి. సీ కేటగిరీ భూములను ‘బీ’లోకి తెచ్చి పట్టాలు తీసుకునేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలకు... ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తోంది. లంక భూములపై పట్టాలు ఇచ్చేందుకు, భూముల కేటగిరీ మార్చేందుకు వెసులుబాటు కల్పిస్తూ గత ఏడాది డిసెంబరు 30న జీవో 799 వెలువడింది. దీనికి కూడా కలెక్టర్లనే వాడుకోవడం గమనార్హం. తూర్పు గోదావరి, బాపట్ల జిల్లా కలెక్టర్ల నుంచి లేఖ అందిందంటూ... కేటగిరీల మార్పు, లీజు కాలపరిమితిని ఏడాది నుంచి ఐదేళ్ల పెంపుపై ఉత్తర్వులు ఇచ్చారు. భూమిలో ఎరువులు, క్రిమిసంహారకాలు చల్లిన ఆనవాళ్లున్నా... ‘ఈ భూమి ఫలానా వారి సాగులో ఉంది’ అని పక్కనున్న రైతు చెప్పినా పట్టాలు ఇచ్చేయమని చెప్పేశారు. గతం లో ప్రభుత్వ స్థాయిలో జరిగే కేటగిరీల మార్పును... ఇప్పుడు జేసీలకే అప్పగించారు. దీంతో జిల్లా స్థాయిలోనే లంక భూముల కేటగిరీలు మారిపోతున్నాయి. మరోవైపు... సీ-కేటగిరీ భూముల లీజు కాలపరిమితిని ఏడాది నుంచి ఐదేళ్లకు పొడిగించారు. అసైన్‌మెంట్‌ కమిటీ ఆమోదంతో జిల్లా కలెక్టర్‌కు పట్టాలు జారీ చేసే అధికారం కల్పించారు.

అసైన్‌మెంట్‌ కమిటీల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలే ఉంటారు. వారి సిఫారసులను కాదని కలెక్టర్‌లు సొంత నిర్ణయాలు తీసుకోగలరా? అన్నది పెద్ద సందేహం. ఇప్పటికే రైతుల పొజిషన్‌లో ఉన్న భూములకు డీ-పట్టాలు ఇవ్వడంతోపాటు కొత్తగా 7,038.83 ఎకరాల లంక భూములకు హక్కులు కల్పించాలని రెవెన్యూ శాఖ చెబుతోంది. ఉమ్మడి పశ్చి మ గోదావరిలో 1000 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 3వేల ఎకరాలు, ఎన్టీఆర్‌ జిల్లాలో 948 ఎకరాలు, బాపట్ల జిల్లాలో 1,172 ఎకరాల భూములను గుర్తించారు. సర్వేలో ఈ విస్తీర్ణం మరింత పెరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జీవో 799 ప్రకారం తమ పరిధిలోని భూములను సర్వే చేసి జాబితా ఇవ్వాలని, ఇప్పటికే పొజిషన్‌లో ఉన్న రైతుల వివరాలు ఇవ్వాలని అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ ఒత్తిడి తెస్తున్నారు.

ఇలా గేలం వేస్తారు...

అసైన్డ్‌, చుక్కలు, అనాధీనం, లంక, షరతుగల భూములను దక్కించుకునేందుకు ఒకేరకమైన వ్యూహం అమలు చేస్తున్నారు. ఇవన్నీ.. పేదలు హక్కులు కోరుతున్న భూములే. ప్రభుత్వ స్థాయిలో మీరు హక్కు సా ధించలేరని, ఆ భూములను తమకు రాసివ్వాలని నేత లు వీరిపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే పరిష్కారం దొరక్క విసిగిపోయిన పేదలు నేతలకు ఆ భూములను రాసిస్తున్నారు. అంతే, నేతలు పలుకుబడి ఉపయోగిం చి వాటిని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ‘పేదల ప్రయోజనాల’ పేరిట పెద్దలకు హక్కులు కల్పించేలా జీవోలు జారీ చేస్తోంది.

సాదా బైనామాలు సరే... ‘మాకేంటి?’

పేద రైతులు రిజిస్ట్రేషన్‌ చార్జీలు భరించలేక భూలావాదేవీలను తెల్ల కాగితాలపై ఒప్పందం రూపంలో రాసుకుంటున్నారు. వీటినే సాదాబైనామాలు అంటారు. వీటిని క్రమబద్ధీకరించేందుకు గత ఏడాది సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. అక్టోబరు 20 నుంచి డిసెంబరు 15 వరకు ప్రభుత్వానికి 10వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు ఆమోదించినవి ఎన్నో తెలుసా? కేవలం రెండే రెండు. అది కూడా ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే. అక్కడ ఐదు దరఖాస్తులు వస్తే రెండు ఆమోదించి, మరో రెండింటిని తిరస్కరించారు. ఒకటి పెండింగ్‌లో పెట్టారు. సాదాబైనామా దరఖాస్తు దారుల్లో 90 శాతం మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే! పేద రైతులకు మేలు చేసే ఈ ఆదేశాలపై ఎందుకీ అలసత్వం? ఎందుకంటే... వీటిని సెటిల్‌ చేస్తే ఏ నేతకూ రూపాయి రాదు. ఏ అధికారికీ పైసా దక్కదు. అందుకే... వీటిని పట్టించుకోరు!

గిరిజనులకు ‘హక్కు’ లేదా?

‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు’ అని ప్రేమ ఒలకబోసేది మాటల్లోనే! ఇందుకు ప్రతక్ష నిదర్శనం ఆర్‌ఓఎ్‌ఫఆర్‌ పట్టాల పంపిణీ. అడవిలో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు ఆ భూములపై పట్టాలు ఇవ్వాలని అటవీ హక్కుల చట్టం(ఆర్‌ఓఎ్‌ఫఆర్‌)2006 చెబుతోంది. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో అటవీ భూములపై హక్కులు కోరుతూ వ్యక్తిగతంగా, కమ్యూనిటీ పరంగా 92వేలు దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. ఇందులో ప్రభుత్వం ఒక్క దరఖాస్తును కూడా సెటిల్‌ చేయలేదు. కారణం... వీటిపై పట్టాలు ఇచ్చినా ‘పెద్దలకు’ మిగిలేది ఏమీ ఉండదు. గిరిజనేతర నేతలు ఏజెన్సీకి వెళ్లి అక్కడి భూములను చేజిక్కించుకోలేరు.

ఎక్కడికక్కడ...

పరిశ్రమ కోసం రైతులు చౌకగా అప్పగించిన వంద ఎకరాల భూమిని కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి ఒకరు తన కుటుంబ సభ్యుల పేరిట కొనుగోలు చేశారు. పెడితే కంపెనీ పెట్టాలి... లేదా, రైతులకు వెనక్కి తిరిగి ఇవ్వాలి! మధ్యలో మంత్రిగారి భూమంత్రాంగం ఏమిటనేది స్థానిక రైతుల ప్రశ్న!

అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళా ప్రజాప్రతినిధి సైతం... సోలార్‌ ప్లాంటుకోసం సేకరించిన భూములను సొంతం చేసుకున్నారు. అదికూడా తన వద్ద పనిచేసే అటెండర్లు, డ్రైవర్ల పేరుతో!

పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం కొండప్రోలు అగ్రహారం పరిధిలో 1725 ఎకరాల ఉత్తరాది మఠంవారి భూములపై ఒక నాయకుడు కన్నేశారు. దాని సెటిల్‌మెంట్‌కు రెవెన్యూలోని ఓ అధికారే చక్రం తిప్పుతున్నారు.

పేదింటి స్థలాల పేరుతో...

జగన్‌ సర్కారు అధికారంలోకి రాగానే ‘నవరత్నాలు - పేదలంద రికీ ఇళ్లు’ పథకం కింద 25వేల ఎకరాల ప్రైవేటు భూములను సేకరించారు. దీనికోసం రూ.18వేల కోట్లకుపైగా ఖర్చు పెట్టారు. దీనిని భూసేకరణ చరిత్రలోనే అతి విస్తారమైన కుంభకోణంగా చెబుతున్నారు. తొండలు గుడ్లుపెట్టని, ఎందుకూ పనికిరాని, ముంపునకు గురయ్యే, మడ పరిధిలోకి వచ్చే భూములను అధికార పార్టీ నేతలు కారుచౌకగా ముందే దక్కించుకున్నారు. ఆ తర్వాత అక్కడే జగనన్న కాలనీలు ఏర్పాటయ్యేలా అధికారులపై ఒత్తిడి తెచ్చి, అవే భూములను ప్రభుత్వంతో భారీ ధరలకు కొనిపించారు. వీటిపై ‘ఆంధ్రజ్యోతి’ అనేక కథనాలను ప్రచురించింది. ఈ వివరాలన్నీ ప్రభుత్వ పెద్దలకు తెలుసు. ఏ నియోజకవర్గంలో, ఏ నాయకుడు ఎన్నెన్ని కోట్లు వెనకేసుకున్నారో నివేదికలు తెప్పించుకున్నారు. చర్యలు తీసుకోవడానికి కాదండోయ్‌! ఆయా నేతలను తమ అదుపులో ఉంచుకోవడానికి మాత్రమే!

ఇప్పుడే ఎందుకు?

కలెక్టర్లు అడుగుతున్నారంటూ భూములకు సంబంధించిన నిబంధనలను మార్చడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. గతంలో ఎవ్వరికీ రాని ఆలోచనలు ఇప్పుడే ఎందుకొచ్చాయి? గతంలో రైతులనుంచి రాని పిటిషన్లు ఇప్పుడే ఎందుకొస్తున్నాయి? పలు రకాల భూములను సొంతం చేసుకునే వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని అధికారులే చెబుతున్నారు.

వాలిపోయారు...

పల్నాడు, రామచంద్రాపురం, పిఠాపురం, కిర్లంపూడి ప్రాంతాలకు చెందిన ముగ్గురు నేతలు పట్టాలు ఎవరెవరి పేరిట ఇవ్వాలో పేర్లు సూచిస్తున్నారు.

పల్నాడు జిల్లాలోని అమరావతి మండలం పొందుగులలో 2వేల ఎకరాల లంక భూములు అధికారపార్టీ ముఖ్య ప్రజాప్రతినిధి నియంత్రణలో ఉన్నాయి. వాటిపై పట్టాలు సాధించేందుకు ఆయన తన పలుకుబడి ప్రయోగిస్తున్నారు. రెవెన్యూలో అధికారులూ సలాం కొడుతున్నారు.

గోదావరి జిల్లాలోని రామచంద్రాపురానికి చెందిన ఒక నేత ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో ఉంటారు. ఇప్పుడు వైసీపీ నేత హోదాలో 1200 ఎకరాల లంకభూములపై కన్నేశారు. రైతుల పేర్లు ఇచ్చి బి-కేటగిరీ భూములను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - 2023-02-08T03:16:06+05:30 IST