పేదరికంలో 20వ స్థానం

ABN , First Publish Date - 2023-07-18T04:26:19+05:30 IST

పేదరికంలో ఆంధ్రప్రదేశ్‌ 20వ స్థానంలో నిలిచింది. రాష్ట్ర జనాభాలో 6.06 శాతం మంది పేదరికంలో ఉన్నారని నీతీ ఆయోగ్‌ వెల్లడించింది.

పేదరికంలో 20వ స్థానం

ఏపీ జనాభాలో 6.6 శాతం పేద లు

జాతీయ పేదరిక సూచీని విడుదల చేసిన నీతీ ఆయోగ్‌

న్యూఢిల్లీ, జూలై 17(ఆంధ్రజ్యోతి): పేదరికంలో ఆంధ్రప్రదేశ్‌ 20వ స్థానంలో నిలిచింది. రాష్ట్ర జనాభాలో 6.06 శాతం మంది పేదరికంలో ఉన్నారని నీతీ ఆయోగ్‌ వెల్లడించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స-5 (2019-21)) ఆధారంగా 12 ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకొని ‘జాతీయ మల్టీ డైమెన్షనల్‌ పేదరిక సూచీ-2023’ పేరిట నివేదికను నీతీ ఆయోగ్‌ రూపొందించింది. ఈ నివేదికను సోమవారం ఢిల్లీలో నీతీ ఆయోగ్‌ వైఎస్‌ చైర్మన్‌ సుబన్‌ బెరి, సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం, సభ్యులు వీకే పౌల్‌, అర్వింద్‌ వీరమణి విడుదల చేశారు. జనాభాలో 33.75 శాతం పేదరికంతో బిహార్‌ తొలి స్థానంలో ఉండగా, 28.81 శాతంతో జార్ఖండ్‌ రెండో స్థానంలో, 37.79 శాతంతో మేఘాలయ మూడో స్థానంలో, 22.93 శాతంతో ఉత్తరప్రదేశ్‌ నాలుగో స్థానంలో, 20.63 శాతంతో మధ్యప్రదేశ్‌ ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక 5.88 శాతం పేదలతో తెలంగాణ పేదరికంలో 21వ స్థానంలో నిలిచింది. 2015-16తో పోల్చితే దేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారని నీతీ ఆయోగ్‌ తెలిపింది. అత్యధికంగా యూపీలో 3.34 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. తర్వాతి స్థానంలో బిహార్‌, మధ్యప్రదేశ్‌ ఉన్నాయి. ఏపీలో 30,19,718 మంది పేదరికం నుంచి విముక్తి పొందారని వెల్లడించింది. 2015-16లో ఏపీలో 11.77 శాతం జనాభా పేదరికంలో ఉండగా, 2019-21 నాటికి అది 6.06 శాతానికి తగ్గిందని, అంటే ఐదేళ్లలో 5.71 శాతం జనాభా పేదరికం నుంచి విముక్తయ్యారని పేర్కొంది. పట్టణ ప్రజల కంటే గ్రామీణుల్లోనే ఎక్కువ పేదరికం ఉన్నట్లు తెలిపింది. ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో 7.71 శాతం జనాభా పేదరికంలో ఉంటే, పట్టణ ప్రాంతాల్లో 2.2 శాతం జనాభా పేదరికంలో ఉన్నట్టు వెల్లడించింది. 2015-16లో 14.72 శాతం గ్రామీణ జనాభా పేదరికంలో మగ్గితే, 2019-21 నాటికి 7.71 శాతానికి తగ్గింది. 2015-16లో పట్టణ ప్రాంతాల్లో 4.63 శాతం జనాభా పేదరికంలో ఉంటే, అది 2019-21నాటికి 2.2 శాతానికి తగ్గింది. ప్రామాణికాల వారీగా ఏపీలో 22.94 శాతం జనాభా పోషకాహార లేమితో, శిశు-యువ మరణాలు 1.27 శాతం, మాతృత్వ ఆరోగ్య సమస్యలతో 10.77, వంట ఇంధనంలేమితో 16.09, పారిశుధ్యంలేమితో 22.84, రక్షిత తాగునీరు లేమితో 9.14, గృహాలు లేని 14.67, ఆస్తుల లేమితో 8.11, బ్యాంకు ఖాతాలు లేని 3.56 శాతం జనాభా ఉన్నట్లు నీతీ ఆయోగ్‌ వివరించింది. రాష్ట్రంలో పేదరికం అత్యధికంగా కర్నూలు జిల్లాలో(12.84ు), అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లా (2.42ు)లో ఉందని తెలిపింది. 2015-16తో పోల్చితే 2019-21 నాటికి అత్యధికంగా విజయనగరం జిల్లాలో 10.34ు జనాభా పేదరికం నుంచి బయటపడినట్టు తెలిపింది.

Updated Date - 2023-07-18T04:26:19+05:30 IST