AP Debts : సాంతం ఊడ్చేశారు!

ABN , First Publish Date - 2023-06-02T03:41:48+05:30 IST

ఇది బకాసురుడికి మించిన ‘కాసుల’ ఆకలి! ఎవరెస్టును సైతం మించిన అప్పుల కొండ! వచ్చింది వచ్చినట్లు... తెచ్చింది తెచ్చినట్లు మింగేయడమే! అలాగని... ఏదైనా భారీ పథకం అమలు చేశారా...

AP Debts : సాంతం ఊడ్చేశారు!
20 thousand crores

13 రోజుల్లో రూ.20 వేల కోట్లు హాంఫట్‌

రెవెన్యూలోటు గ్రాంటు రూ.10,460 కోట్లు

రెండు విడతల్లో తెచ్చిన అప్పు 4 వేల కోట్లు

సొంతంగా వచ్చిన ఆదాయం 5 వేల కోట్లు

అయినా తీరని జగన్‌ సర్కారు అప్పుల ఆకలి

ఒకటో తేదీ రాగానే మళ్లీ ఆర్బీఐ వద్ద ‘దేహీ’

వేజ్‌ అండ్‌ మీన్స్‌తో అరకొరగా జీతాలు

మొత్తం జీతాలకు ఇంకెన్ని కష్టాలు పడాలో!

(అమరావతి – ఆంధ్రజ్యోతి)

ఇది బకాసురుడికి మించిన ‘కాసుల’ ఆకలి! ఎవరెస్టును సైతం మించిన అప్పుల కొండ! వచ్చింది వచ్చినట్లు... తెచ్చింది తెచ్చినట్లు మింగేయడమే! అలాగని... ఏదైనా భారీ పథకం అమలు చేశారా... ఇంకేదైనా ప్రాజెక్టుకు డబ్బులు ఖర్చు పెట్టారా... మరేదైనా అభివృద్ధి పనిచేశారా అంటే ఏదీ లేదు! ఏమీ చేయకుండానే 13 రోజుల్లో రూ.20వేల కోట్లు మింగేశారు. ఒకటోతేదీ వచ్చే సరికి... జీతాలు, పింఛన్ల కోసం‘దేహీ’ అని రిజర్వు బ్యాంకు ముందు నిల్చున్నారు. ఇదీ... జగన్‌ సర్కారు ఆర్థిక అస్తవ్యస్త దుస్థితి! గడచిన 13 రోజుల్లో రాష్ట్ర ఖజానాకు రూ.20,000 కోట్ల సొమ్ము వచ్చింది. మే 19వ తేదీన రాష్ట్ర విభజనకు సంబంధించిన రెవెన్యూ లోటు గ్రాంటు రూ.10,460 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఆ తర్వాత... ఆర్బీఐ నుంచి రెండుసార్లుగా రూ.4,000 కోట్ల అప్పు తెచ్చారు. ఇక... సొంతంగా ఖజానాకు రూ.5వేలకోట్లకుపైగా ఆదాయం వచ్చింది. వెరసి... 13 రోజుల్లో రూ.20వేల కోట్లు వచ్చాయి. కానీ... బుధవారంనాటికి మొత్తం ఖాళీ! ఒకటోతేదీన స్వల్పంగా వేతనాలు చెల్లించారు. ఆ మాత్రానికి కూడా ఆర్బీఐ నుంచి వేజ్‌ అండ్‌ మీన్స్‌ రూపంలో అప్పుతేవాల్సి వచ్చింది. ఇంకా పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్లు చెల్లించాలంటే రాష్ట్రానికి ఉన్న వేజ్‌ అండ్‌ మీన్స్‌ పరిమితి రూ.2,800 కోట్లు కూడా సరిపోవు. మళ్లీ ఆర్బీఐ నుంచి ఓడీకి వెళ్లి జీతాలు, పెన్షన్లు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. కేంద్రం మన రాష్ట్రానికి ఏడాది కాలానికి ఇచ్చిన రుణపరిమితినీ వాడేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఇంకా రూ.15వేల కోట్లు మాత్రమే మిగిలాయి. కానీ... బాండ్ల వేలానికి ఆరో తేదీ దాకా ఆగాల్సిందే.

కేంద్రం నుంచి రెవెన్యూ లోటు గ్రాంటు రూపంలో ఒకేసారి రూ.10,460 కోట్లు వచ్చి పడ్డాయి. అయినా సరే... ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం డబ్బులు వెతుక్కోవాల్సి వస్తోంది. అసలు... 13 రోజుల్లో వచ్చిన రూ.20వేల కోట్లను జగన్‌ సర్కారు ఏం చేసిందన్నదే అసలు ప్రశ్న! గురువారం ‘రైతు భరోసా’కు బటన్‌ నొక్కారు. ఈ పథకానికి రూ.2000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. అంతకుముందు... మే 24న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.900 కోట్లు పంచుతున్నామంటూ బటన్‌ నొక్కారు. అవి ఇంకా లబ్ధిదారులకు జమ కాలేదు. నెల కిందట నొక్కిన ‘వసతి దీవెన’ డబ్బులను వారం కిందట పూర్తిగా చెల్లించగలిగారు. మరి... 13 రోజుల్లో వచ్చిన రూ.20వేల కోట్లకు లెక్కలెక్కడ?

Updated Date - 2023-06-02T03:41:48+05:30 IST