17వేల ఓట్లకు ఎసరు!
ABN , Publish Date - Dec 14 , 2023 | 02:27 AM
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు అధికార పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖపట్నం తూర్పులో ఓట్ల తొలగింపునకు కుట్రలు
ఓటరుగా నమోదైన ఇంట్లో ఉండట్లేదని నోటీసులు
నోటీసు తీసుకోకున్నా, స్పందించకున్నా తొలగింపు
ఏళ్ల తరబడి అదే ఇంట్లో ఉంటున్నా ఎందుకీ నోటీసులు
అవాక్కవుతున్న ఓటర్లు.. ఏం చేయాలో తెలియక అవస్థలు
అధికార పార్టీ నేతల ఒత్తిడితో ప్రతిపక్షాల ఓట్లకు ఎసరు
విశాఖపట్నం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు అధికార పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికోసం అధికారులను పావులుగా వాడుకుంటున్నారు. ఓటర్ల జాబితా ఆధారంగా బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి వివరాలు పరిశీలించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అదే సమయంలో అధికార పార్టీ నేతలు కొందరు తమకు ఓటు వేయరనే అనుమానం ఉన్న వారి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని బీఎల్‌వోలకు సూచించారు. అధికార పార్టీ నేతలు, తమ పై అధికారుల ఆదేశాలకు అనుగుణంగా బీఎల్‌వోలు కొందరు తమ పరిశీలనలో అధికార పార్టీకి ఓటేయరని అనుమానం ఉన్న వారి (తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుల) వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసుకున్నట్టు సమాచారం. ఆయా ఓటర్లను జాబితా నుంచి తొలగించే కుట్రకు తెరలేపారు. వారంతా ఓటరు లిస్ట్‌లో పేర్కొన్న చిరునామాలో ఉండడం లేదని, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిపోయారనే సాకు చూపుతూ వారి ఓటును తొలగిస్తున్నామంటూ ఫారం-బిని పోస్టు ద్వారా ఓటరు లిస్ట్‌లోని చిరునామాకు పంపిస్తున్నారు. వాటిని అందుకున్నవారు తాము ఇంట్లో లేకపోవడం ఏమిటా.. అని అవాక్కవుతున్నారు.
నోటీసులు సిద్ధమవుతున్నాయ్....
తాజాగా విశాఖ నగరంలోని తూర్పు నియోజకవర్గం పరిధిలో నివాసం ఉంటున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంటికి పోస్ట్‌మన్ రెండు నోటీసులు తీసుకువెళ్లారు. ఆయన వాటిని పరిశీలించి ఎన్నికల సంఘం పేరుతో ఉండడంతో తీసుకున్నారు. పోస్ట్‌మన్ చేతిలో పెద్ద కట్ట ఉండడంతో అవన్నీ ఏమిటని సదరు అధికారి ప్రశ్నించగా, అన్నీ నోటీసులేనని బదులిచ్చారు. పోస్ట్‌మన్ ఇచ్చిన కవర్‌ను తెరిచి చూడగా తన భార్య, కుమార్తె సదరు చిరునామాలో లేరని బీఎల్‌వో పరిశీలనలో తేలినట్టు ఉంది. నోటీసులో సంప్రదించాల్సిన వారి వివరాలు స్పష్టంగా లేకపోవడంతో తనకు తెలిసిన రెవెన్యూ అధికారికి ఫోన్ చేయగా... ఆయన తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి ఫోన్ నంబర్ ఇచ్చారు. ఆ అధికారికి ఫోన్ చేసి మాట్లాడగా, తూర్పు నియోజకవర్గంలో 17 వేల ఓట్లను తొలగించాల్సి ఉందని గుర్తించామని, ఈ మేరకు నోటీసులు తయారు చేస్తున్నామని చెప్పడంతో విస్తుపోయారు. ఇప్పటికే 12,500 మందికి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.