పీజీలో 123 నకిలీ సీట్లు!
ABN , First Publish Date - 2023-09-02T03:56:37+05:30 IST
ఒకటి కాదు.. రెండు కాదు.. వందల్లో పీజీ మెడికల్ సీట్లు సృష్టించారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వైద్య కళాశాలలకు నకిలీ లేఖలు పంపించారు.
3 వైద్య కళాశాలలకు కేటాయింపు
రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్ సిద్ధం చేసిన హెల్త్ వర్సిటీ
అమరావతి, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఒకటి కాదు.. రెండు కాదు.. వందల్లో పీజీ మెడికల్ సీట్లు సృష్టించారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వైద్య కళాశాలలకు నకిలీ లేఖలు పంపించారు. హెల్త్ వర్సిటీలకు లెటర్ ఆఫ్ పర్మిషన్(ఎల్‌వోపీ) ఇచ్చేశారు. వాటి ఆధారంగా పెరిగిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించడం కూడా పూర్తయింది. తీరా చూస్తే మొత్తం ఫేక్ అని తేలింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) కళ్లు తెరిచేలోగా సీట్లు భర్తీ ప్రక్రియ దాదాపు ముగిసింది. ఇలా దేశవ్యాప్తంగా 300 సీట్లు పెంచగా.. ఒక్క ఏపీలోనే 123 పీజీ సీట్లు ఎన్‌ఎంసీతో సంబంధం లేకుండా పెంచేశారు. కర్నూలు శాంతిరామ్ మెడికల్ కాలేజీ (50), రాజమండ్రిలోని జీఎ్‌సఎల్‌వీ కాలేజీ (50)తో పాటు విజయనగరంలోని మహారాజ మెడికల్ కాలేజీలో(23) సీట్లు పెంచుతున్నట్లు ఎల్‌వోపీలు వచ్చాయి. ఇందులో ఎక్కువగా జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్, ఈఎన్‌టీ వంటి విభాగాల సీట్లే ఉన్నాయి. వాటికోసం విద్యార్థులు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. అవసరమైతే రూ.కోట్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేసేవారూ ఉన్నారు. ఈ ఎల్‌వోపీలపై హెల్త్ వర్సిటీ అధికారులకు తొలుత సందేహం వచ్చినా ఎన్‌ఎంసీ లెటర్ హెడ్, స్టాంప్, సీల్ ఉండటంతో చూసీచూడనట్లు వదిలేశారు. అయితే విజయనగరం మహారాజ కాలేజీలో 23 సీట్లు పెరుగుతున్నట్టు వచ్చిన లేఖలతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి. ఆ సీట్లను కౌన్సెలింగ్‌లో చూపించలేదు. ఈలోగా ఫేక్ ఎల్‌వోపీలపై ఎన్‌ఎంసీ స్పందించింది. ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఉన్న సీట్ల ఆధారంగానే కౌన్సెలింగ్ నిర్వహించాలంటూ దేశంలోని అన్ని వర్సిటీలు, డీఎంఈ విభాగాలకు అధికారులు లేఖలు రాశారు. ప్రస్తుతానికి కౌన్సెలింగ్‌కు బ్రేక్ లేకుండా రాష్ట్రాల వారీగా ఏయే కాలేజీలకు ఎన్ని పీజీ సీట్లు కేటాయించామన్న దానిపై ఎన్‌ఎంసీ స్పష్టత ఇచ్చింది. ఈ వివరాలు తన వెబ్‌సైట్‌లో పొందుపరించింది. కేవలం తమ వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని, ఏమైనా అనుమానాలు ఉంటే నేరుగా ఎన్‌ఎంసీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.
ఎల్లుండి సీట్ల కేటాయింపు
ఫేక్ ఎల్‌వోపీల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ జరిగిన మెడికల్ పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియను హెల్త్ వర్సిటీ రద్దుచేసింది. అయితే అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి, నీట్ ర్యాంక్ ఆధారంగా తయారు చేసిన మెరిట్ లిస్ట్‌ను మాత్రం యథాతథంగా కొనసాగిస్తారు. సీట్ మ్యాట్రిక్స్‌తో పాటు సీటు కేటాయింపు ప్రక్రియను మాత్రమే మరోసారి చేపడతారు. శుక్రవారం సాయంత్రానికి రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్ సిద్ధం చేసి, వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. శుక్రవారం రాత్రి 10గంటల నుంచి ఆదివారం ఉదయం 10గంటల వరకూ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం కల్పించారు. సోమవారం ఉదయం సీట్ల కేటాయింపు ప్రకియ్ర చేపడతారు.