11 ఏళ్లు ఇంట్లోనే బందీగా..

ABN , First Publish Date - 2023-03-02T03:22:42+05:30 IST

న్యాయం తరఫున నిలబడాల్సిన ఓ న్యాయవాది అన్యాయంగా ప్రవర్తించాడు! బాహ్య ప్రపంచం గురించి తెలియనివ్వకుండా 11 ఏళ్ల పాటు భార్యను ఇంట్లోనే బంధించి వేధింపులకు గురిచేశాడు! విజయనగరంలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి బాధితులు, పోలీసుల కథనం ఇలా ఉంది.

11 ఏళ్లు ఇంట్లోనే బందీగా..

విజయనగరంలో భార్యను నిర్బంధించిన న్యాయవాది

తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసుల సోదాలు

విజయనగరం క్రైమ్‌, మార్చి 1: న్యాయం తరఫున నిలబడాల్సిన ఓ న్యాయవాది అన్యాయంగా ప్రవర్తించాడు! బాహ్య ప్రపంచం గురించి తెలియనివ్వకుండా 11 ఏళ్ల పాటు భార్యను ఇంట్లోనే బంధించి వేధింపులకు గురిచేశాడు! విజయనగరంలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి బాధితులు, పోలీసుల కథనం ఇలా ఉంది. విజయనగరం కంటోన్మెంట్‌లోని బాలాజీ మార్కెట్‌ సమీపంలో నివసించే న్యాయవాది జి.మధుసూదన్‌కు పుటపర్తికి చెందిన సాయిప్రియతో 2008లో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. కాలక్రమంలో తల్లి, తమ్ముడి మాయమాటలు విని.. మధుసూదన్‌ భార్యను వేధించడం ప్రారంభించాడు. ఇలా గత 11ఏళ్లుగా భార్యను ఇంట్లోనే బంధించాడు. ఆమె తల్లిదండ్రులు మాట్లాడేందుకు ప్రయత్నం చేసినా.. చూసేందుకు వచ్చినా అనుమతించలేదు. ఇటీవల మరింతగా వేధిస్తున్నట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు.. బుధవారం విజయనగరం ఎస్పీని ఆశ్రయించారు. ఎస్పీ ఆదేశాలతో వన్‌టౌన్‌ పోలీసులు మధుసూదన్‌ ఇంటికి వెళ్లారు. తనిఖీ చేసే అధికారం ఎవరికీ లేదంటూ మధుసూదన్‌ ఎదురు తిరిగాడు. దీంతో పోలీసులు వెనుదిరిగి నాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు సెర్చ్‌ వారంట్‌ జారీ చేయడంతో న్యాయవాది ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. నీరసించిన శరీరంతో సాయిప్రియ చీకటి గదిలో ఉండటాన్ని గుర్తించారు. ఆమెను బయటికి తీసుకొచ్చి న్యాయస్థానంలో హాజరు పరిచారు. నాయస్థానం ఆదేశాల మేరకు సాయిప్రియను ఆమె తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. నిందితునిపై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

Updated Date - 2023-03-02T03:22:42+05:30 IST