Chandrababu : స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఆయనపై ఆరోపణలే తప్ప.. ఆధారాల్లేవు!
ABN , First Publish Date - 2023-11-21T03:25:48+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 29 నుంచి ఆయన రాజకీయ కార్యకలాపాల్లో ..

హైకోర్టు సంచలన తీర్పు
కేసు పెట్టిన 32 నెలలకు ఆయన్ను నిందితుడిగా చేర్చారు
ఈ కాలంలో దర్యాప్తులో జోక్యం చేసుకున్నారని సీఐడీ కూడా ఆరోపించడం లేదు
‘మధ్యంతర’ షరతులతో చంద్రబాబు పార్టీకి ఇబ్బంది
వాటిని ఇప్పుడు సడలిస్తున్నాం
29 నుంచి రాజకీయ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు
28లోపు వైద్యపరీక్షల నివేదికలను ఏసీబీ కోర్టుకు సమర్పించాలి
స్కిల్ సొమ్ము టీడీపీ ఖాతాలకు మళ్లించినట్లు ఆధారాలు లేవు
సంతకాల్లో తేడాకు సీఎం ఎలా బాధ్యుడు?నిధులు విడుదల చేయాలని
సూచిస్తే చంద్రబాబు పాత్ర ఉన్నట్లా?జడ్ ప్లస్ భద్రతలో ఉన్న ఆయన
తప్పించుకుపోయే ప్రమాదం లేదు
సీఐడీ దర్యాప్తు లోపాలమయం: హైకోర్టు
చంద్రబాబుకు రిమాండ్ విధించాలని కోరడానికి ముందే.. సీఐడీ తాను చేసిన తీవ్రమైన ఆరోపణలకు బలమైన ఆధారాలను చూపించి ఉండాల్సింది.
దుర్వినియోగమైన నిధులు టీడీపీ ఖాతాలకు చేరాయన్న నిర్ణయానికి వచ్చేందుకు ఆధారాలు చూపించకపోవడం దర్యాప్తులో లోపమే. సంతకాల్లో తేడా ఉందని, ఒప్పందంలో తేదీని ప్రస్తావించలేదని ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలో చెప్పారు. వీటికి చంద్ర బాబును బాధ్యుడిని చేయడానికి వీల్లేదు.
- హైకోర్టు
అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 29 నుంచి ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాలుపంచుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో దుర్వినియోగమైనట్లు చెబుతున్న సొమ్మును టీడీపీ బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని కోర్టు తేల్చిచెప్పింది. అందుకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాలనూ ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించలేకపోయిందని పేర్కొంది. చంద్రబాబుకు రిమాండ్ విధించాలని కోరడానికి ముందే.. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలకు బలమైన ఆధారాలను సీఐడీ చూపించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. దుర్వినియోగమైన నిధులు టీడీపీ ఖాతాల్లోకి వచ్చాయనే నిర్ణయానికి వచ్చేందుకు ఆధారాలేమిటో సీఐడీ చూపించకపోవడం దర్యాప్తులో లోపంగా భావిస్తున్నామని పేర్కొంది. కేసులో ఇతర నిందితులందరూ బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేసింది.
ఈ నేపథ్యంలో గత నెల 31న చంద్రబాబుకు మంజూరు చేసిన మధ్యంత బెయిల్ ఉత్తర్వులను పూర్తి స్థాయి బెయిల్ ఉత్తర్వులుగా ఖరారు చేసింది. ప్రధాన బెయిల్ పిటిషన్‌ను పరిష్కరిస్తున్న ఈ సమయంలో.. రాజకీయ ర్యాలీలు నిర్వహించవద్దని, రాజకీయ సమావేశాల్లో పాల్గొనవద్దని మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా విధించిన షరతులు.. చంద్రబాబుకు చెందిన రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళికపై ప్రభావం చూపుతాయని.. అందుచేత వాటిని ఈ నెల 29 నుంచి సడలిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన వైద్యం చేయించుకున్న ఆస్పత్రి, పొందిన చికిత్స వివరాలను, మెడికల్ రికార్డులను ఈ నెల 28లోపు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు సోమవారం తీర్పు వెలువరించారు. స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ నిధులు మళ్లించారనే ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేయడం.. అనారోగ్యం కారణంగా కోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. ఆ తర్వాత ప్రధాన బెయిల్ పిటిషన్‌పై తుది విచారణ జరిపింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్.. సీఐడీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇటీవల తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి సోమవారం నిర్ణయాన్ని వెల్లడించారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు విదేశాలకు తప్పించుకుపోయే ప్రమాదం లేదని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రస్తావన ఉత్పన్నమే కాదని స్పష్టం చేశారు. తీర్పు కీలకాంశాలివీ..
2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ..
గుజరాత్‌లో సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రాలను రాష్ట్ర ఆర్థిక శాఖ అప్పటి కార్యదర్శి కె.సునీత, అధికారుల బృందం పరిశీలించి నివేదిక సమర్పించింది. ప్రాజెక్టు అమలు సంతృప్తికరంగా ఉందని, రాష్ట్రంలోనూ స్కిల్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అపరిమితమైన లబ్ధి చేకూరుతుందని, ప్రపంచస్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందుతారని అందులో పేర్కొన్నారు. కార్పొరేషన్ పీడీ అకౌంట్‌లో ఉన్న రూ.270 కోట్ల నిధులను తక్షణం విడుదల చేయాలని కోరారు. సునీత, అధికారుల బృందం సరైన నివేదిక ఇవ్వలేదని ప్రాసిక్యూషన్ ఎలాంటి ఆరోపణా చేయడం లేదు. 2లక్షల మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొంది, సర్టిఫికెట్లు పొందారనే విషయంపై వివాదం లేదు. స్కిల్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.371 కోట్లలో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు మళ్లించాయని సీఐడీ వాదిస్తోంది. అలాంటప్పుడు 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం సాధ్యమేనా అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, క్లస్టర్లలో మౌలిక సదుపాయాలు లేవని ప్రాసిక్యూషన్ కూడా చెప్పడం లేదు.
ఆ మెసేజ్‌లు ఒప్పందానికి ముందువి..
ఏపీఎ్‌సఎ్‌సడీసీతో ఒప్పందం కుదుర్చుకున్న సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలు, వివిధ రాష్ట్రప్రభుత్వాల సహకారంతో ట్రైనర్లకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞాన్ని అందించడంలో విఫలమయ్యాయని ప్రాసిక్యూషన్ గట్టిగా చెప్పడం లేదు. ఏపీఎ్‌సఎ్‌సడీసీ ఏర్పాటు చేసిన స్కిల్ సెంటర్ల ద్వారా 2.13 లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొంది సర్టిఫికెట్లు పొందినట్లు, శిక్షణ కోసం నిధులు ఖర్చు చేసినట్లు ఈ కేసులో ఓ నిందితుడికి ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల్లో హైకోర్టు గుర్తించింది. హవాలా మార్గంలో నిధుల మళ్లింపు కోసం 2014 డిసెంబరు 31 నుంచి 2016 జనవరి మధ్య సీమెన్స్ ఇండియా ఎండీ సుమన్ బోస్, డిజైన్‌టెక్ ఎండీ.. వాట్సాప్ సందేశాల ద్వారా కరెన్సీ నోట్ల నంబర్లు బదిలీ చేసుకున్నట్లు ఏఏజీ పేర్కొన్నారు. నిజానికి స్కిల్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీఎ్‌సఎస్‌డీసీ, సీమెన్స్ మధ్య 2017 జూన్ 30న ఒప్పందం జరిగింది. 2014-16 మధ్య వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా లావాదేవీలు జరిగాయని చేస్తున్న ఆరోపణలతో చంద్రబాబుకు ఏం సంబంధమో ప్రాసిక్యూషన్ స్పష్టత ఇవ్వలేదు. ఏ ఉద్దేశంతో సొమ్ము బదిలీ చేశారో ఆ మెసేజ్‌ల ద్వారా గుర్తించలేకపోయామని సీఐడీయే చెబుతోంది.
సంతకాల్లో తేడాకు సీఎం బాధ్యుడా?
శరత్ అండ్ అసోసియేట్స్ ఇచ్చిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికపై ప్రాసిక్యూషన్ ప్రధానంగా ఆధారపడుతోంది. తమ వద్ద కేసుకు సంబంధించిన ఫైళ్లు లభ్యంగా లేవని ఏపీ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఏపీఎ్‌సఎ్‌సడీసీ) చెబుతోంది. అందుకు భిన్నంగా ఏపీఎ్‌సఎ్‌సడీసీ తమకు పలు ఫైళ్లు అందజేసినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలో శరత్ అండ్ అసోసియేట్స్ పేర్కొంది. ఎంవోయూ ఎక్కడ జరిగిందనే విషయంలో సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలు చెబుతున్న వివరాలకు విరుద్ధంగా ఫోరెన్సిక్ ఆడిట్‌లో పేర్కొన్నారు. ఎంవోయూలో తేదీ ప్రస్తావించకపోవడానికి అందులో భాగస్వామ్యం కాని చంద్రబాబుకు ఏ విధంగా సంబంధమో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌పై ఉంది. చంద్రబాబు ప్రోద్బలంతోనే ఒప్పందంలో బ్యాంకు గ్యారెంటీ క్లాజ్‌ను తొలగించారని ఆడిట్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ విధంగా ఏ సాక్షి చెప్పారో ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ఉంచలేదు. ఎంవోయూలో సీమెన్స్ ఇండియా ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ పేరును సుమన్ బోస్‌గా పేర్కొన్నారని, సంతకాల్లో తేడా ఉందని, ఒప్పందంలో తేదీని ప్రస్తావించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ వ్యత్యాసాలకు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఏ విధంగా బాధ్యుడవుతారో సీఐడీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. సంతకాల్లో ఉన్న తేడాలను పరిశీలించాల్సిన బాధ్యత సీఎంది కాదు. ఆడిట్ నివేదికలో గుర్తించిన వ్యత్యాసాలకు చంద్రబాబును బాధ్యుడిని చేయడానికి వీల్లేదు.
షెల్ కంపెనీలకు ఆధారాలేవీ?
రూ.370 కోట్ల నిధులను షెల్ కంపెనీలకు మళ్లించి ఆ సొమ్మును నగదు రూపంలో చంద్రబాబు ఉపసంహరించారన్న వాదనకు బలం చేకూర్చేలా ప్రాసిక్యూషన్ ఎలాంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచలేదు.
బాబు పాత్రపై ఆధారాల్లేవు..
అక్రమ లావాదేవీలలో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖ తేల్చిందని సీఐడీ చెబుతున్నప్పటికీ.. దానిని బలపరిచే ఆధారాలు లేవు. సాక్షులను, సహచర నిందితులను, టీడీపీ సభ్యులను ఆయన పరోక్షంగా ప్రభావితం చేశారన్న సీఐడీ వాదనకూ ఆధారాలు లేవు.
పరస్పరం సంబంధం లేని అంశాలవి..
చంద్రబాబుకు బెయిల్ మంజూరు అంశానికి, ఆయన మాజీ పీఏ పెండ్యాల శ్రీనివాస్ సీఐడీ ముందు హాజరుకాకపోవడానికి, కిలారు రాజేశ్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి ఒకదానికొకటి సంబంధమే లేదు. చంద్రబాబు మధ్యంతర బెయిల్ షరతులు ఉల్లంఘించినట్లు బేగంపేట పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కనిపించడం లేదు.
నిందితులంతా బెయిల్‌పై విడుదల
ఒక్క చంద్రబాబు తప్ప కేసులో ఇతర నిందితులందరూ బెయిల్ లేదా ముందస్తు బెయిల్‌పై విడుదలయ్యారు. 2021లో కేసు పెట్టాక 140 మందికి పైగా సాక్షులను సీఐడీ విచారించింది. 4 వేల డాక్యుమెంట్లను సేకరించింది. కేసు దర్యాప్తు చివరి దశలో ఉంది. ప్రసుత్తం కేసుకు సంబంధించిన ఫైళ్లన్నీ ప్రాసిక్యూషన్ వద్దే ఉన్నాయి.
ఆయన భాగస్వామ్యం లేదు..
మంగళగిరి సీఐడీ డీఎ్‌సపీకి సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) ప్రిన్సిపల్ డైరెక్టర్ సుజయత్ ఖాన్.. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌కు సీమెన్స్ ఇండియా ఎండీ మాథ్యూ థామస్ ఇచ్చిన స్టేట్‌మెంట్లను పరిశీలిస్తే నేరఘటనలో చంద్రబాబు భాగస్వామ్యం ఉన్నట్లు ప్రాథమికంగా కనిపించడం లేదు. కేసు నమోదు చేసిన 32 నెలల తర్వాత ఆయన్ను నిందితుడిగా చేర్చినట్లు రికార్డులను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఈ కాలంలో ఆయన కేసు దర్యాప్తులో జోక్యం చేసుకున్నారనడానికి ఎలాంటి ఆధారం లేదు. సీఐడీ సైతం అలాంటి ఆరోపణ చేయలేదు.
అలాంటి షరతులతో..
చంద్రబాబు వయసు, అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని ఇదివరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశాం. ఆ సమయంలో సీఐడీ అభ్యర్థన మేరకు రాజకీయ ర్యాలీలు నిర్వహించవద్దని, రాజకీయ సమావేశాల్లో పాల్గొనవద్దని, కేసుకు సంబంధించి విషయాలు మీడియాతో మాట్లాడవద్దని షరతులు విధించాం. కేసులో మిగిలిన నిందితులు బెయిల్‌పై ఉన్నారనే కారణంతో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదన్న ఏఏజీ వాదనను తిరస్కరిస్తున్నాం. ప్రధాన బెయిల్ పిటిషన్‌ను పరిష్కరిస్తున్న ఈ సమయంలో అలాంటి షరతులు విధించడం చంద్రబాబుకు చెందిన రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళికపై ప్రభావం చూపుతుంది. ఈ నేపఽథ్యంలో రాజకీయ ర్యాలీలు నిర్వహించవద్దని, రాజకీయ సమావేశాల్లో పాల్గొనవద్దని విధించిన షరతులను ఈ నెల 29 నుంచి సడలిస్తున్నాం. వైద్యం చేయించుకున్న ఆస్పత్రి, పొందిన చికిత్స వివరాలను, మెడికల్ రికార్డులను ఈ నెల 28లోపు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలని చంద్రబాబును ఆదేశిస్తున్నాం. గత నెల 31న మంజూరు చేసిన మధ్యంత బెయిల్ ఉత్తర్వులను పూర్తి స్థాయి బెయిల్ ఉత్తర్వులుగా ఖరారు చేస్తున్నాం.
సబ్‌కాంట్రాక్టరు తప్పులకు..
ఆర్థిక కార్యదర్శి అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు నిధులు విడుదల చేయాలని ఆదేశించే అధికారం సీఎంకు లేదని ప్రాసిక్యూషన్ వాదించడం లేదు. చంద్రబాబుకు గానీ, ఆయన పార్టీ ఖాతాలకు గానీ నిధులు మళ్లించినట్లు ఎలాంటి ఆధారాలు లేకుండా.. స్కిల్ కేంద్రాల ఏర్పాటు నిమిత్తం నిధుల విడుదలకు ముఖ్యమంత్రి హోదాలో ఆయన సూచించారనే కారణంతో కేసులో ఆయన పాత్ర ఉందని భావించడానికి వీల్లేదు. సబ్ కాంట్రాక్టర్ స్థాయిలో జరిగిన తప్పులకు ఆయన్ను బాధ్యుడిగా చేయడానికి వీల్లేదన్న సీనియర్ న్యాయవాది వాదనతో ఏకీభవిస్తున్నాం. కార్పొరేషన్‌లో జరుగుతున్న తప్పులను అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు.