ఇంట్లో వాళ్లే ఛీ కొట్టిన చరిత్ర నీది: రాజయ్య

ABN , First Publish Date - 2022-08-31T09:27:25+05:30 IST

ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య విమర్శల జడిని మరింత తీవ్రం చేశారు.

ఇంట్లో వాళ్లే ఛీ కొట్టిన చరిత్ర నీది: రాజయ్య

హనుమకొండ టౌన్‌, ఆగస్టు 30: ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య విమర్శల జడిని మరింత తీవ్రం చేశారు. కడి యం అవినీతి చిట్టా అంతా తనవద్ద ఉందని హెచ్చరించారు. బడా కాంట్రాక్టర్‌ను పట్టుకుని హనుమకొండలో కడియం పెద్ద భవనం నిర్మించుకున్నారని, పెద్ద ఎత్తున భూములు కొన్నారని, పెట్రోల్‌బంక్‌ ఉందని, అవినీతి సొమ్ముతో ఇంకా ఎన్నో ఆస్తులను కొనుగోలు చేశారని ఆరోపించారు. కడియం   అవినీతి చిట్టా గురించి టీడీపీ కార్యకర్తల్లో ఎవరిని అడిగినా చెబుతారని పేర్కొన్నారు. కడియం అవినీతిపై ఖల్‌నాయక్‌ పుస్తకమే వచ్చిందన్నారు. కుటుంబసభ్యులే ఛీకొట్టిన చరిత్ర ఆయనదని విమర్శించారు. పార్టీ నిబంధనలకు లోబడి పనిచేస్తున్న నాయకుడిగా తాను కడియం గుట్టు పూర్తిగా విప్పడంలేదని, ఇవి మచ్చుకు కొన్ని మాత్రమేనన్నారు. ‘రాజకీయాల్లోకి రాకముందు నీ ఆస్తులు ఎన్నో.. నా ఆస్తులెన్నో లెక్కలు తీద్దామా?’ అని కడియంకు సవాల్‌ విసిరారు. తాను అవినీతికి పాల్పడినట్లుగా ఆధారాలున్నట్లు ఆయన వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే దొంగే.. దొంగ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. హనుమకొండలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడారు. తన నియోజకవర్గంలో సోమవారం జరిగిన సమావేశంలో తాను కడియం శ్రీహరిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. ఆయన టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లను చంపించాడని అనలేదని పేర్కొన్నారు. కడియం శ్రీహరి తనపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నాని చెప్పారు. ఓ పిల్లల డాక్టర్‌గా తనది పిల్లల మనస్తత్వం అని ఆయన తెలిపారు. ‘స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం నేను పుట్టిన గడ్డ.. అది నా అడ్డా’ అని స్పష్టం చేశారు. తన నియోజకవర్గం దేవాలయం అని,  ప్రజలు దేవుళ్లు, తాను పూజారిని అని పేర్కొన్నారు. కేసీఆర్‌ తన దేవుడు అని.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి నడుచుకునే క్రమశిక్షణ కలిగిన నాయకుడినని పేర్కొన్నారు.  

Read more