ఉత్త కాళ్లతో ఉర్కి.. లక్ష కొట్టి!

ABN , First Publish Date - 2022-06-02T08:35:51+05:30 IST

హుస్నాబాద్‌, జూన్‌ 1: పరుగు పందెంలో విజయం సాధించాలంటే ఎంతో కొంత సాధన చేయాలి! ఆ రేసు వద్దకైతే దాదాపు మూడు నెలలుగా కఠోర సాధన చేసిన మహిళలు వచ్చారు. ఓ 35 ఏళ్ల

ఉత్త కాళ్లతో ఉర్కి.. లక్ష కొట్టి!

-5కే రన్‌లో విజేతగా నిలిచిన మహిళా రైతు 

-ఎలాంటి సాధన లేకుండానే పరుగు పందెంలోకి 

-3నెలలుగా సాధన చేసినవారంతా ఆశ్చర్యం

-పొలం పనులే విజేతగా నిలిపాయని వెల్లడి


హుస్నాబాద్‌, జూన్‌ 1: పరుగు పందెంలో విజయం సాధించాలంటే ఎంతో కొంత సాధన చేయాలి! ఆ రేసు వద్దకైతే దాదాపు మూడు నెలలుగా కఠోర సాధన చేసిన మహిళలు వచ్చారు. ఓ 35 ఏళ్ల మహిళా రైతూ వచ్చింది. ఆమె షూ వేసుకోలేదు.. కాళ్లకు చెప్పులు కూడా లేవు. పైగా ఎలాంటి సాధనా చేయలేదు. ప్రథమ స్థానంలో నిలిచిన విజేతకు రూ.లక్ష బహుమతి ఇస్తారని తెలిసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది.  పరుగు పందెం మొదలైంది. ఆ మహిళా రైతేమో ఉట్టి కాళ్లతోనే పరుగు మొదలుపెట్టింది. ఒక్కొక్కరినీ వెనక్కి నెడుతూ.. క్రమంగా పరుగులో వేగం పెంచుతూ భారీ అంచనాలు ఉన్నవారినీ దాటుకుంటూ విజేతగా నిలిచింది.


పరుగు పందెం నిర్వాహకులే అచ్చెరువొందేలా చేసిన ఆ మహిళా రైతు పేరు మల్లం రమ.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 30 ఏళ్లు పైబడిన మహిళల కోసం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బుధవారం నిర్వహించిన ఐదు కిలోమీటర్ల పరుగు (5కే రన్‌)లో రమ ఈ అద్భుతం చేశారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పోటీ గురించి స్థానిక ఎమ్మెల్యే సతీశ్‌ కుమార్‌ ప్రకటించారు. ఔత్సాహికులైన మహిళలంతా సిద్ధం కావాలని, విజేతకు రూ.లక్ష బహుమతి ఉంటుందని చెప్పారు. అప్పటి నుంచి ఎంతోమంది మహిళలు 5కే రన్‌ కోసం సాధన చేస్తున్నారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల సతీమణులు కూడా ప్రత్యేకంగా సాఽధన చేసి సిద్ధమయ్యారు. అయితే అక్కన్నపేట మండలం మల్లంపల్లికి చెందిన మహిళా రైతు మల్లం రమకు  ఒక రోజు ముందనగా పోటీ గురించి  తెలిసింది. ఎలాగైనా పోటీలో గెలవాలనుకున్నారామె. కాళ్లకు చెప్పుల్లేకుండా, పొలం పనులు చేసేప్పుడు వేసుకునే చొక్కాను ధరించి పరుగులో పాల్గొన్నారు.


ప్రాక్టీసు చేసిన మహిళలను దాటుకుంటూ అందరికన్నా ముందుగా 26.42 నిమిషాల్లోనే పరుగును పూర్తిచేసి ఆమె విజేతగా నిలిచారు. రమకు ఇద్దరు కుమారులున్నారు. ఉన్న రెండెకరాల్లో వ్యవసాయం చేయడం, పశుపోషణ ఆమె వృత్తి. పరుగులో ఎలాంటి అనుభవం లేకపోయినా, పందెం కోసం ఎలాంటి సాధన చేయకపోయినా రమ విజయం సాధించడంపై స్థానికులు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తన జీవనశైలే తనను విజేతగా నిలిపిందని రమ చెప్పారు. ఇంటి నుంచి పొలం మూడు కిలోమీటర్ల దూరం అని, తాను రోజూ పొలానికి నడుచుకుంటూనే వెళ్తొస్తానని చెప్పారు. పశువులను మేపుతున్నప్పుడు వాటిలో కొన్ని కుదురుగా ఉండక అటో ఇటో పరుగెడుతుంటాయని, వాటిని పట్టుకోవడానికి తానూ పరుగెడతానని ఇదంతా తనకు పోటీ కోసం ఉపయోగపడిందని చెప్పారు. తాను మూడో క్లాసు దాకే చదివానని.. బహుమతిగా వచ్చిన రూ.లక్షను తన కుమారుల చదువు కోసం వినియోగిస్తానని చెప్పారు.  కాగా, ఈ పరుగు పందెంలో 500 మంది పాల్గొన్నారు.

Updated Date - 2022-06-02T08:35:51+05:30 IST