SHARMILA: లిక్కర్ స్కామ్‌తో పరువు తీశారు
ABN , First Publish Date - 2022-12-15T04:00:32+05:30 IST
లిక్కర్ స్కామ్‌తో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పరువు తీశారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. అమాయకంగా బతుకమ్మ ఆడుతూ ప్రజల చెవుల్లో పూలు పెట్టిన ఘనత ఆమెకే దక్కుతుందని అన్నారు.
బతుకమ్మ ఆడుతూ కవిత కోట్లు సంపాదించారు
ఇక్కడ చాలదన్నట్లు ఇతర రాష్ట్రాల మీద పడ్డారు
నా పాదయాత్రను కేసీఆరే అడ్డుకుంటున్నారు
పోలీసులను పనోళ్లలాగా వాడుకుంటున్నారు
సంక్రాంతి తర్వాత మళ్లీ పాదయాత్ర: షర్మిల
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): లిక్కర్ స్కామ్‌తో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పరువు తీశారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. అమాయకంగా బతుకమ్మ ఆడుతూ ప్రజల చెవుల్లో పూలు పెట్టిన ఘనత ఆమెకే దక్కుతుందని అన్నారు. బతుకమ్మ ఆడుతూ కోట్లు సంపాదించుకున్నారని, అది చాలదన్నట్లుగా అట్లతద్ది చేస్తానంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బిడ్డగా తప్పితే.. కవితకు ఉనికి ఉందా? ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చిందా? అని ప్రశ్నించారు. ఓడిపోయిన బిడ్డకు ఎమ్మెల్సీ ఇచ్చి కాపాడుకున్న కేసీఆర్.. శ్రీకాంతాచారి తల్లికి మాత్రం మొండిచేయి చూపారని విమర్శించారు. సాటి మహిళనైన తనను మగవారితో పోలుస్తావా? తానూ అలాగే మాట్లాడితే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. వైఎ్‌సఆర్ బిడ్డను పంజరంలో పెట్టి
మిగతా 9వ పేజీలో...
బంధించాలని చూశారని, కానీ.. కేసీఆర్ బిడ్డే ఇప్పుడు ఉచ్చులో చిక్కుకున్నారని అన్నారు. ప్రధాని మోదీ తనకు ఫోన్ చేయడం వ్యక్తిగత విషయమని వ్యాఖ్యానించారు. స్వయంగా సీఎం కేసీఆరే రాష్ట్రంలో తన పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. పోలీసులను పనోళ్లలా వాడుకుంటూ తనను దిగ్బంధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హక్కులకు భంగం కలిగిస్తూ, తనను ఎందుకు కట్టడి చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. పై నుంచి ఆదేశాలు ఉన్నాయంటూ పోలీసులు తనను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసుల ప్రవర్తన శ్రుతి మించినందునే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. సంక్రాంతి తర్వాత ఆగిన చోట నుంచే పాదయాత్రను పునఃప్రారంభిస్తానని ప్రకటించారు. లోట్‌సపాండ్‌లో బుధవారం షర్మిల విలేకరులతో మాట్లాడుతూ సుమారు 3,500 కిలోమీటర్ల మేర ఎలాంటి ఆటంకం లేకుండా తాను యాత్ర కొనసాగించానని గుర్తు చేశారు. నర్సంపేటలో కేసీఆర్ గూండాలు తన బస్సును, వైఎస్సార్ విగ్రహాన్ని తగలబెట్టి శాంతిభద్రతల సమస్యను సృష్టించారని విమర్శించారు. పోలీ్‌సశాఖ మొత్తం కేసీఅర్ ఆధీనంలో ఉన్నా, కోర్టుల్లో న్యాయం మాత్రం బతికే ఉందన్నారు. అందుకే తన పాదయాత్రకు అనుమతి వచ్చిందని పేర్కొన్నారు. కేసీఅర్కు న్యాయస్థానంపై నమ్మకం ఉంటే తన పాదయాత్రను సాగనివ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదని అన్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించిన ఘటనపై స్పందిస్తూ.. పొట్టోడ్ని పొడుగోడు కొడితే... పొడుగోడిని పోచమ్మ కొట్టిందని వ్యాఖ్యానించారు. తన పాదయాత్రలో ఫ్లెక్సీలు చింపిన అధికార పార్టీ నేతలు.. ఇప్పుడు ఢిల్లీలో వారికి అదే పరిస్థితి ఎదురైతే తట్టుకోలేకపోతున్నారని అన్నారు. తెలంగాణలో నిరుద్యోగులు, మైనారిటీలకు భరోసా కరువైందని, ప్రతి వర్గానికీ కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. కేసీఆర్.. కిసాన్ ద్రోహి అని, తెలంగాణ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని అన్నారు. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్టుగా పంజాబ్ రైతులకు ఆర్థికసాయం చేశారని విమర్శించారు. తెలంగాణ కోసం కేసీఆర్ రాజకీయాల్లోకి రాలేదని, చంద్రబాబు హయాంలో మంత్రి పదవి దక్కకపోవడంతోనే తెలంగాణ సెంటిమెంట్‌ను లేవనెత్తారని మండిపడ్డారు. అదే సెంటిమెంట్ వాడుకుని సీఎం అయ్యాక ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.