ఆర్థిక ఇబ్బందులతో.. కుటుంబం ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-11-25T04:00:51+05:30 IST

నమ్ముకున్న కులవృత్తితో బతుకు బండి నడవటం లేదు. బయట మరో ఉపాధి కోసం ప్రయత్నించినా ఫలితం లేదు. పూట గడవటమే కష్టంగా మారింది.

ఆర్థిక ఇబ్బందులతో..  కుటుంబం ఆత్మహత్యాయత్నం

ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి..తామూ తీసుకున్న దంపతులు

ఇంట్లోనే భార్యా భర్తల మృతి

పెద్ద కుమారుడి పరిస్థితి విషమం

చిన్న కుమారుడికి తప్పిన ప్రమాదం

వరంగల్‌ గిర్మాజీపేటలో విషాదం

వరంగల్‌, నవంబరు 24 : నమ్ముకున్న కులవృత్తితో బతుకు బండి నడవటం లేదు. బయట మరో ఉపాధి కోసం ప్రయత్నించినా ఫలితం లేదు. పూట గడవటమే కష్టంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. ఇక ఆత్మహత్యే శరణ్యమని భావించారు ఆ దంపతులు. వాటర్‌ బాటిల్‌లో సైనైడ్‌ కలిపి ఇద్దరు పిల్లలకు తాగించారు. ఆపై భార్యాభర్తలిద్దరూ అదే విషం తీసుకున్నారు. ఈ ఘటనలో దంపతులు చనిపోగా, పెద్దకుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వరంగల్‌ గిర్మాజీపేటలో గురువారం సాయంత్రం ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాలకు చెందిన స్వర్ణకారుడు ఉప్పుల మోహన్‌, కవిత దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు నవధాన్‌ అలియాస్‌ సతీశ్‌(33)కు భార్య స్రవంతి (28), కుమారులు విరాట్‌ (7), విహార్‌(5) ఉన్నారు. సతీశ్‌ నగరంలో కుల వృత్తి చేసుకుని జీవిస్తున్నాడు. వీరంతా గిర్మాజీపేటలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కాగా, సతీశ్‌కు సరిగా పని దొరక్కపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. నాలుగు నెలలుగా ఇంటి అద్దె చెల్లించలేదు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పెద్ద కుమారుడు విరాట్‌ స్కూల్‌ నుంచి రాగానే సతీశ్‌, అతడి భార్య, ఇద్దరు కుమారులతో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.

వారు ఎంతకీ బయటకురాకపోవడంతో అనుమానం వచ్చిన సతీశ్‌ తల్లి తలుపులు కొట్టింది. చిన్న కుమారుడు విహార్‌ బయటకు వచ్చాడు. ఏమైందని అడగ్గా, తీర్థమని చెప్పి ఏదో తాగించారని నోరు తెరిచి చూపించాడు. అది సైనైడ్‌ అని గుర్తించిన సతీశ్‌ తల్లి వెంటనే ఉమ్మి వేయించింది. గదిలోకి వెళ్లి కొడుకు, కోడలు, మనవడు అస్వస్థతకు గురవడం చూసి కేకలు వేసింది. ఇరుగు పొరుగు వారు వచ్చి వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే భార్యాభర్తలు మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. విరాట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. విహార్‌కు ప్రాణాపాయం తప్పింది. ఇంట్లోకి వెళ్లిన నలుగురు ఓ ప్లాస్టిక్‌ బాటిల్‌లో నీళ్లు తీసుకుని, కులవృత్తిలో ఉపయోగించే పొటాషియం సైనైడ్‌ కలిపి తాగారని పోలీసులు భావిస్తున్నారు. కాగా, సతీశ్‌ కుటుంబం పదేళ్ల కిత్రం వరంగల్‌కు వచ్చింది. గిర్మాజీపేటలోని బొడ్రాయి వద్ద ఓ ఇంట్లో 8 నెలల నుంచి కిరాయికి ఉంటున్నారు.

Updated Date - 2022-11-25T04:00:53+05:30 IST