జీతాలివ్వలేని దుస్థితి ఎందుకు?

ABN , First Publish Date - 2022-06-23T08:15:12+05:30 IST

ధనిక రాష్ట్రంగా రూ.16 వేల కోట్ల మిగులుతో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ప్రస్థానం ఎనిమిదేళ్ల దుష్ట పాలనలో దివాళా తీసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

జీతాలివ్వలేని దుస్థితి ఎందుకు?

  • దుష్ట పాలనలో ధనిక రాష్ట్రం దివాలా
  • నాడు రూ.16 వేల కోట్ల మిగులుతో రాష్ట్రం
  • నేడు అప్పు చేస్తే కానీ పూట గడవని స్థితి
  • పుత్రరత్నం విదేశీ పర్యటనలకు కోట్ల వ్యయం
  • ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి 
  • సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ


హైదరాబాద్‌,  జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ధనిక రాష్ట్రంగా రూ.16 వేల కోట్ల మిగులుతో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ప్రస్థానం ఎనిమిదేళ్ల దుష్ట పాలనలో దివాళా తీసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఉద్యోగులకు జీతాలు, రైతులకు రైతుబంధు ని ధులు ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోందన్నారు. అప్పులు తెచ్చుకుంటే తప్ప పూట గడవని దుస్థితికి రాష్ట్రాన్ని చేర్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. హోం గార్డులు, మోడల్‌ స్కూల్‌ సిబ్బందికి నెల జీతం కూడా ఇవ్వలేని దుస్థితికి ప్రభుత్వం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. విలువైన భూముల అమ్మకం, లక్షల కోట్ల అప్పు లు.. అదీ చాలదన్నట్లు ఇటీవల ప్రజలపై పలు రకాల పన్నుల భారం మోపారని ధ్వజమెత్తారు. అప్పుల ద్వారా,  భూముల అమ్మకం ద్వారా,  పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్‌, కరెంట్‌, భూముల రిజిస్ట్రేషన్‌, బస్‌ చార్జీలు పెంచారని మండిపడ్డారు. అడ్డూ అదుపూ లేని మద్యం అమ్మకాల ద్వారా జనంపై ఎడాపెడా భారం మోపి, ముక్కుపిండి వసూలు చేస్తున్న లక్షల కోట్ల సొమ్ములు ఏ బడా కాంట్రాక్టర్ల జేబుల్లోకి చేరుతున్నాయని ప్రశ్నించారు. పైగా తెలంగాణ ధనిక రాష్ట్రం అంటూ పక్క రాష్ట్రాలకు వెళ్లి పరిహారాలు పంచి వస్తున్నారని ఆరోపించారు. రూ.200 కోట్లు ఖర్చు చేసి దేశ వ్యాప్తంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకున్నారని ఆయన విమర్శించారు.


హోంగార్డులపై కనీస కనికరం లేదా?

పుత్రరత్నం విదేశీ పర్యటనల పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నారని, మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణలో నిద్రాహారాలు మాని పనిచేసే హోం గార్డులకు జీతాలు మాత్రం సకాలంలో ఇవ్వడం లేదని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. విందులు, విలాసాలు, విదేశీ విహార యాత్రలకు వందల కోట్లు ఖర్చు చేసే మీరు.. నెల జీతం వస్తే కాని పూట గడవని హోం గార్డుల కుటుంబాల పరిస్థితి గురించి ఒక్కసారైనా ఆలోచన చేశారా?, కట్టు బానిసల కంటే ఘోరమైన స్థితిలో పని చేసే హోంగార్డుల విషయంలో మీకు కనీస కనికరం లేదా? అని సీఎంను ప్రశ్నించారు. జూన్‌ నెల సైతం ముగియవస్తున్నా ఇంత వరకు వారికి మే నెల జీతం సైతం ఇవ్వకపోవడాన్ని ఏమని ప్రశ్నించాలన్నారు. మోడల్‌ స్కూళ్లలో టీచింగ్‌ - నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి సైతం జీతాలు ఇవ్వలేదన్నారు. 


కేసీఆర్‌ రాష్ట్రంలో ఉన్నారా? లేరా? 

తొలకరి మొదలై... వానాకాలం పంటకు సమయం ఆసన్నమైనా ఇంత వరకు రైతు బంధు నిధులు సైతం విడుదల చేయలేదని విమర్శించారు. రైతుబంధు ఉంటుందా? ఉంటే ఎప్పుడిస్తారు? అసలు ఇస్తారా? లేదా? అని పేద రైతులు ఎదురు చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌... వీఆర్‌ఎస్‌ అంటూ ప్రజలకు కనిపించకుండా, అసలు రాష్ట్రంలోనే ఉన్నారో లేదో తెలియకుండా కేసీఆర్‌ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. కనీసం ఆర్థిక మంత్రైనా సమీక్షించి, సరిదిద్దుతారని ఆశిస్తే.. రాజకీయ విమర్శల్లో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. హోం గార్డులు, మోడల్‌ స్కూల్స్‌ సిబ్బందికి తక్షణం మే నెల జీతాలు విడుదల చేయాలని, లేకుంటే ఆయా వర్గాలకు అండగా కాంగ్రెస్‌ కార్యాచరణకు దిగుతుందని ఆ లేఖలో రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2022-06-23T08:15:12+05:30 IST