Naveen Reddy: నవీన్‌రెడ్డి ఎక్కడ?
ABN , First Publish Date - 2022-12-12T04:09:29+05:30 IST
వివాహ నిశ్చితార్థం జరుగుతున్న ఇంట్లోకి యాభై మంది అనుచరులతో వచ్చి.. ఆ ఇంట్లోని వారిని రాడ్లు, కర్రలతో కొట్టి నానా బీభత్సం సృష్టించి మరీ వధువును తన వెంట తీసుకెళ్లిన నవీన్ రెడ్డి ఆచూకీ ఇంకా దొరకలేదు!
కిడ్నాప్ జరిగిన రోజే వైశాలిని కాపాడి
మర్నాడు 32 మందిని అరెస్టు చేసిన పోలీసులు
పరారీలో ఉన్నాడా? అరెస్టు చేసి
రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారా?
ఆదిభట్ల, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): వివాహ నిశ్చితార్థం జరుగుతున్న ఇంట్లోకి యాభై మంది అనుచరులతో వచ్చి.. ఆ ఇంట్లోని వారిని రాడ్లు, కర్రలతో కొట్టి నానా బీభత్సం సృష్టించి మరీ వధువును తన వెంట తీసుకెళ్లిన నవీన్ రెడ్డి ఆచూకీ ఇంకా దొరకలేదు! ఘటన జరిగిన గంటల్లోనే వధువు వైశాలిని పోలీసలు సురక్షితంగా రక్షించినా.. ఆ మర్నాడు నవీన్ అనుచరులైన 32మందిని అదుపులోకి తీసుకున్నా.. నవీన్ మాత్రం పట్టుబడలేదు. ఆధిభట్లలో వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్‌రెడ్డి, అతడి స్నేహితుడు, హబ్సిగూడలో వస్త్ర దుకాణం నడుపుతున్న రూబిన్ కోసం మూడు రోజులుగా నాలుగు ప్రత్యేక బృందాలతో ఎస్‌వోటీ పోలీసులు గాలిస్తున్నారు. వైశాలిని కిడ్నాప్ అవ్వగా, సాయంత్రానికే ఆమెను పోలీసులు సురక్షితంగా తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. 32మందినిందితులను శనివారం అరెస్టు చేశారు. కిడ్నాప్ ఘటనతో సంబంధం ఉన్న నిందితులంతా నవీన్‌కు చెం దిన ‘మిస్టర్ టీ స్టాల్స్’లో పనిచేసే సిబ్బందేనని తెలుస్తోంది. కాగా లొకేషన్ ఆధారంగా పోలీసులు ఆచూకీ కనిపెడతారని ఊహించి నవీన్, రూబిన్ తమ సెల్‌ఫోన్లను, సిమ్‌లను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. నవీన్, రూబిన్ ఆచూకీ దొరకలేదని చెబుతున్నప్పటికీ.. పోలీసు లు వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే నవీన్‌రెడ్డి, రూబీన్‌ల అరెస్టును పోలీసులు ధ్రువీకరించడం లేదు.
బయట పడే ప్రయత్నాలు
పోలీసుల అదుపులో ఉన్నట్లుగా చెబుతున్న నవీన్‌రెడ్డిని కాపాడి, ఈ కేసు నుంచి బయటపడేసేందుకు కొన్ని పెద్ద తలకాయలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది పోలీసులకు కూడా పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. వారు రాజీ లేకుండా దర్యాప్తు సాగిస్తున్నప్పటికీ.. నవీన్ రెడ్డికి సన్నిహితులైన రాజకీయ నాయకుల నుంచి వస్తున్న ఫోన్‌లతో ఒత్తిడి పెరుగుతోందని సమాచారం. నిజానికి తనకు రాజకీయ పరిచయాలు, పరపతి ఉన్నాయన్న ధీమాతోనే అతడు ఈ పనికి పాల్పడ్డాడని.. రాజకీయ సన్నిహితులు తనను తప్పిస్తారనే ధీమాతోనే ఇలా రెచ్చిపోయాడని తెలుస్తోంది. ఏదేమైనా.. నవీన్‌రెడ్డితో పాటు మరో ఇద్దరిని సోమవారం అరెస్టు చూపే అవకాశముందని తెలుస్తోంది.