రైతుబంధు ఎప్పుడు!?

ABN , First Publish Date - 2022-06-07T08:27:24+05:30 IST

నైరుతి రుతు పవనాలు రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోకి అడుగు పెట్టనున్నాయి! అక్కడక్కడా వర్షాలు కురుస్తుండడంతో రైతులు

రైతుబంధు ఎప్పుడు!?

ఇప్పటికే కొన్నిచోట్ల సాగు పనులు ప్రారంభం

ఇప్పటి వరకూ ఆర్థిక సాయం ఊసే ఎత్తని సర్కారు

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అమలుపైనా అనిశ్చితి

రైతు బంధుకు కావాల్సిన మొత్తం రూ.7500 కోట్లు

ఖజానా కటకటతో నిధుల సర్దుబాటుపై సందేహాలు

ఇంకా కసరత్తు మొదలు పెట్టని వ్యవసాయ శాఖ

మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు


హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతు పవనాలు రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోకి అడుగు పెట్టనున్నాయి! అక్కడక్కడా వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఇప్పటికే పొలం పనులు మొదలు పెట్టేశారు! దుక్కులు దున్ని సాగుకు సిద్ధమవుతున్నారు! వానలు ప్రారంభమైతే సాగు పనులూ ఊపందుకోనున్నాయి! అయినా.. ప్రభుత్వం నుంచి ‘రైతు బంధు’ సాయం ఊసే వినిపించడం లేదు. ఫలానా సమయానికి ఆర్థిక సాయం విడుదల చేస్తామన్న ప్రకటనలూ వెలువడడం లేదు. ఆర్థిక అనిశ్చితిలో రాష్ట్రం కొట్టుమిట్టాడుతుండడంతో రైతు బంధు అమలుపైనా అనిశ్చితి నెలకొంది! రాష్ట్ర ప్రభుత్వ నెలవారీ సగటు రాబడి సుమారు రూ.10 వేల కోట్లు.


ఏప్రిల్‌లో రూ.9,984 కోట్ల ఆదాయం రాగా మే నెల ఖర్చులకు సరిపోయింది. మే నెల రాబడితో జూన్‌ ఖర్చులను వెళ్లదీయాల్సి ఉంది. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకే రూ.4 వేల కోట్లు అవసరం. రోజుకింత ఆదాయం వస్తుంటే వీటిని కూడా జిల్లాలవారీగా విడతలు విడతలుగా చెలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితులతో అప్పులు తీసుకునే పరిస్థితి లేదు. దాదాపు రెండు నెలల తర్వాత ఇప్పుడు రూ.4000 కోట్ల అప్పు తీసుకోవడానికి అనుమతిచ్చింది. ఇలాంటి సమయంలో రైతుబంధు పథకానికి రూ.7,500 కోట్లు ఎలా సర్దుబాటు చేస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అన్నదాతల సమస్యలన్నింటికీ సర్వరోగ నివారిణిలా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న ఈ పథకం అమలుపై అయోమయం నెలకొంది.


తొలి సీజన్‌లో మాత్రమే సజావు.. 

రైతుబంధు ప్రారంభమైన 2018లో మాత్రమే నిర్ణీత సమయంలో చెక్కులు పంపిణీ చేశారు. అప్పట్లో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మే 5వ తేదీ నుంచే సాయం అందజేశారు. కానీ, 2019లో జూన్‌ 4, 2020లో జూన్‌ 22, 2021లో జూన్‌ 15 నుంచి చెల్లింపులు ప్రారంభించారు. ఈ-కుబేర్‌ సాఫ్ట్‌వేర్‌తో బదిలీ చేస్తున్నా.. నిధుల సర్దుబాటు కారణంగా జాప్యం జరుగుతోంది.


దాంతో 10 నుంచి 15 రోజులు పడుతోంది. గత రెండు సీజన్ల నుంచి ఎకరాల చొప్పున విడతలవారీగా ఇస్తున్నారు. తొలుత ఎకరంలోపు చిన్న రైతులకు అందించి.. తర్వాత విస్తీర్ణం సంఖ్యను పెంచుకుంటూ వెళుతున్నారు. దాంతో, జూలై మొదటివారం వరకు కూడా రైతుబంధు పంపిణీ కొనసాగుతోంది. నిజానికి, వరి మినహా పత్తి, కంది ఇతర పంటలు సాగు చేసే చెలక భూములకు రైతులు వేసవిలోనే దుక్కులు చేస్తారు. జూన్‌ మొదటి వారానికే విత్తనాలు కొంటారు. సబ్సిడీ ఎత్తివేయడంతో ఇప్పుడు మార్కెట్‌ ధరకు కొనాల్సి వస్తోంది. ఇక వరి రైతులకు విత్తడం, నారుమడి సిద్ధం చేయడం, వరి నార్లు పోయడం, బురద దుక్కులు, నాట్లు.. ఇలా పొలంలో అడుగు పెట్టడంతోనే ఖర్చులు మొదలవుతాయి. అంటే, మే నెల రెండో భాగంలో, సాధ్యం కాకపోతే జూన్‌ తొలి వారానికే చేతిలో పెట్టుబడి డబ్బులు ఉండాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారీ జాప్యం చేస్తోంది. అదే సమయంలో, రుణమాఫీ పూర్తికాని కారణంగా బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడం లేదు. ఫలితంగా రైతులు మళ్లీ అధిక వడ్డీకి ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోంది. 


కసరత్తు మొదలుపెట్టని వ్యవసాయ శాఖ

రైతుబంధు పథకానికి సంబంధించి వ్యవసాయ శాఖ ఇప్పటి వరకూ ఎలాంటి కసరత్తు మొదలుపెట్టలేదు. యాసంగి సీజన్‌లో చెల్లించిన రైతుల వివరాలు మాత్రం వారివద్ద ఉన్నాయి. కానీ, ఆ తర్వాత వ్యవసాయ భూములు కొనుక్కున్న రైతులు ఉంటారు. అంటే, యాజమాన్య హక్కులు మారిపోతాయి. కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు కూడా పెద్దఎత్తున జారీ అయ్యాయి. భూమి విక్రయించిన రైతుల పాస్‌బుక్‌ నుంచి సర్వే నంబర్లు, విస్తీర్ణం తొలగించి.. కొనుక్కున్న రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరాలు రైతుబంధు పోర్టల్‌లో నమోదు చేయాలి. కానీ, ఇంతవరకు అలాంటి జాబితా వ్యవసాయ శాఖ వద్దకు చేరలేదు. ఏఈవోలు రైతుల పట్టాదారు, బ్యాంకు పాస్‌ పుస్తకం, ఆధార్‌లను సేకరించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చి, జాబితా చేతికందిన తర్వాతే వాటిని తీసుకుంటామని చెబుతున్నారు.


యాజమాన్య హక్కుల లెక్క తేల్చి ఇస్తారా?

రాష్ట్రంలో వ్యవసాయ భూముల జాబితాలో ఉండి.. వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నది ఎంత? పూటు ఖరాబు భూములు ఎన్ని ఉన్నాయి? ఇలాంటి భూములకు రైతుబంధు ఆపితే ఖజానాకు ఎంత మిగులుతుంది? అనే వివరాలను రెవెన్యూ శాఖ సేకరిస్తోంది. ఇది కొలిక్కి వచ్చాక రైతుబంధు పంపిణీ చేస్తారా? గతంలోలా షరతులు లేకుండా ఖాతాల్లో డబ్బు వేస్తారా? అనే సందేహాలను నివృత్తి చేయకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక పదుల ఎకరాలు ఉన్న వారికి రైతుబంధు అవసరం లేదని, ప్రజాధనాన్ని అనర్హులకు పంచిపెడుతున్నారనే విమర్శలున్నాయి. ఖజానా కటకట నేపథ్యంలో 10 ఎకరాలకుపైగా భూమి ఉన్నవారికి రైతుబంధు నిలిపివేస్తే రూ.కోట్లు మిగిలే అవకాశాలున్నాయి. ఈ కోణంలో ప్రభుత్వం పునరాలోచన చేస్తుంటే దాన్నయినా స్పష్టం చేయాలని, ఏదో ఒకటి తేల్చి అర్హులకు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2022-06-07T08:27:24+05:30 IST