అందరికీ ఆరోగ్య పరీక్షలెప్పుడు?

ABN , First Publish Date - 2022-09-29T08:41:32+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హెల్త్‌ ప్రొఫైల్‌ అటకెక్కినట్టేనా..

అందరికీ ఆరోగ్య పరీక్షలెప్పుడు?

  • ములుగు, సిరిసిల్లలో పూర్తి 
  • ఈ జిల్లాల్లో 47% మందికి సమస్యలు
  • ఫలితాలు చూసి కంగుతిన్న ప్రభుత్వం! 

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హెల్త్‌ ప్రొఫైల్‌ అటకెక్కినట్టేనా? ప్రస్తుతం దాని గురించి సర్కారు పట్టించుకోవడం లేదా? ఈ హామీ ఇచ్చి నాలుగేళ్లవుతున్నా కేవలం పైలెట్‌ ప్రాజెక్టుతో మమ అనిపించడం చూస్తే అవును అనే అనిపిస్తోంది. వాస్తవానికి 2018 ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌.. మళ్లీ అధికారంలోకి వస్తే అందరికీ చెవి, ముక్కు, దంతపరీక్షలు సహా అన్ని ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ హామీపై ప్రధానంగా దృష్టిపెట్టలేదన్న విమర్శలున్నాయి. 2020లో కొవిడ్‌ రావడంతో వైద్యశాఖలోని సిబ్బంది అంతా కొవిడ్‌ సేవలకే పరిమితం కావాల్సివచ్చింది. ఆ తర్వాతా ఈ హెల్త్‌ ప్రొఫైల్‌పై సర్కారు అంత సీరియ్‌సగా దృష్టి పెట్టలేదు. ఈ ఏడాది మార్చిలో సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టు నిర్వహించారు. ఆ రెండు జిల్లాల్లో 40 పైబడిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు చేశారు. 40 ఏళ్లలోపు హెల్త్‌ రిస్క్‌ ఉన్నవారికే హెల్త్‌ప్రొఫైల్‌ చేశారు. అలా టెస్టుల చేసిన వారందరికీ ఒక యూనిక్‌ ఐడీ నంబరు ఇచ్చారు. దాన్ని ఆన్‌లైన్‌ చేశారు. కాగా  ఈ రెండు జిల్లాల్లో క్షేత్రస్థాయి అనుభవాల ఆధారంగా రాష్ట్రమంతా అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయాలని నిర్వహించారు. అయితే ఇంతవరకు వైద్యఆరోగ్యశాఖ దానిగురించి ఆలోచనే చేయడం లేదన్న విమర్శలు న్నాయి. పైగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో చేసిన హెల్త్‌ ప్రొఫైల్‌ ఫలితాలను కూడా వైద్యశాఖ అధికారికంగా విడుదల చేయలేదు. ములుగు జిల్లాల్లో టెస్టులు చేయించుకున్న వారిలో 60% మందికి, సిరిసిల్ల జిల్లాలో 39.32% మందికి అనారోగ్య సమస్యలున్నట్లు గుర్తించారు. ఆ రెండు జిల్లాల్లో అత్యధికంగా 38% మంది లిపిడ్‌ ప్రొఫైల్‌ అసాధారణంగా ఉన్నట్లు గుర్తించారు.  తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారి వివరాలను ఆన్‌లైన్‌లో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు పంపారు. స్థానికంగా ఉండే ఏఎన్‌ఎంలు ఆ రోగులను ఆస్పత్రులకు తీసుకెళ్లి, పరీక్షలు చేయించి, మందులు ఇప్పించే బాధ్యత అప్పగించారు.  


రాష్ట్రవ్యాప్తంగా 2కోట్ల మందికి సమస్యలు? 

ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రజల్లో ఉన్న అనారోగ్య సమస్యలు చూసి సర్కారు కంగుతిన్నట్లు సమాచారం. పైకి జనాలు ఆరోగ్యంగానే కనిపించినప్పటికీ, టెస్టుల ద్వారా తేలిన ఫలితాలను చూసి వైద్య ఆరోగ్యశాఖ అధికారులే షాక్‌కు గురయ్యారు. ఉచితంగా పరీక్షలు సరే  వారందరికీ వైద్యం, మందులు అంటే తడిసిమోపెడవుతుంది. ఈ రెండు జిల్లాలను లెక్కలోకి తీసు కుంటే.. రాష్ట్ర జనాభా ప్రకారం సగటున 2 కోట్ల మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పరిగణించాల్సివుంటుందని వైద్యఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం మిగతా జిల్లాల్లో  హెల్త్‌ ప్రొఫైల్‌పై వైద్యశాఖ ఆలోచనే చేయ డం లేదు. ప్రజలకు ఉపయోగపడే హైప్‌ ప్రాజెక్టులు సరిగ్గా ఎన్నికల సమయంలోనే ప్రారంభిస్తారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 15 ఆగస్టు 2018న కంటి వెలుగు ప్రొగ్రామ్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అప్పుడు ప్రారంభమైన ఈ కార్యక్రమం అదే ఏడాది ఎన్నికలు ముగిసే వరకు కొనసాగింది. ఈసారి కూడా హెల్త్‌ ప్రొఫైల్‌ సరిగ్గా ఎన్నికలకు ముందే ప్రారంభిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 


హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టు రిపోర్టులు ఇలా.. 

సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో చేసిన హెల్త్‌ ప్రొఫైల్‌లో సగటున 47% మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడతున్నట్లు తేలింది. ములుగు జిల్లాలో 1,81,540 మందికి  పరీక్షలు చేశారు. అందులో 1,10,527 మంది వివిధ జబ్బులతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇందులో 11,896 మందికి థైరాయిడ్‌, 28,281 మందికి లివర్‌ సంబంధిత సమస్యలు, 28,857 మందికి కాల్షియం లోపం, 23,216 మందిలో సీబీపీలో అబ్‌నార్మల్‌, లిపిడ్‌ ఫ్రొఫైల్‌లో 65,586 మందికి సమస్యలున్నట్లు గుర్తించారు. వీరిలో ఎక్కువ మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాగే 12,186 మంది కిడ్నీ సమస్యలు, 11,752 మందికి అమైలైజ్‌ ఎంజైమ్‌ లోపం ఉన్నట్లు గుర్తించారు. ఇక యూరిక్‌ యాసిడ్‌తో 10,124 మంది, నియంత్రణలేని షుగర్‌తో 9,775 మంది బాధపడుతున్నట్లు అందులో తేలింది. సిరిసిల్ల జిల్లాల్లో మొత్తం 3,38,761 మందికి టెస్టులు చేశారు. అందులో 1,33,230 మంది హెల్త్‌ రిస్కులో ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 27,985 మందికి కొలెస్ట్రాల్‌ శాతం అసాధారణంగా ఉన్నట్లు లిపిడ్‌ ప్రొఫైల్‌  పరీక్షల్లో తేలింది. 27,550 మందికి కాల్షియం లోపం, 17,331 మందికి సీబీపీ అబ్‌నార్మల్‌గా ఉంది. ఇందులో 26.2% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 17,001 మందికి థైరాయిడ్‌, 15,839 మందికి లివర్‌ ఫంక్షన్‌లో తేడా ఉందని ఎల్‌ఎ్‌ఫటీ టెస్టుల్లో తేలింది. మరోవైపు 14,267 మందికి కిడ్నీ సమస్య ఉంది. 10,797 మందికి అమైలేస్‌ ఎంజైమ్‌లోపం, 9,180 మందికి నియంత్రణలోలేని షుగర్‌, ఉన్నట్లు గుర్తించారు. 

Read more