Minister KTRకు ట్విటర్‌లో ప్రశ్నల పరంపర.. UPలో బీజేపీని ఓడించేందుకు..!

ABN , First Publish Date - 2022-01-14T08:21:30+05:30 IST

‘ఆస్క్‌ కేటీఆర్‌’ అంటూ గురువారం సాయంత్రం ట్విటర్‌ ద్వారా గంటపాటు నెటిజన్లతో మంత్రి సంభాషించారు....

Minister KTRకు ట్విటర్‌లో ప్రశ్నల పరంపర.. UPలో బీజేపీని ఓడించేందుకు..!

 • దళితబంధు ఇంకెప్పుడు?
 • నవంబరు 4 నుంచే అమలు చేస్తామన్నారు కదా
 • ధరణి సమస్యలను అసలు పట్టించుకోరా!?
 • ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు పరిహారమెప్పుడు?
 • లష్కర్‌లుగా వీఆర్‌ఏలు ఇంకెప్పుడు?
 • కేజీ - పీజీ కేవలం మ్యానిఫెస్టోకే పరిమితమా?
 • సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే 
 • పేదలకు రూ.5 లక్షలు చచ్చాక ఇస్తారా!?
 • ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌కు నెటిజన్ల ప్రశ్నలు
 • స్వరాష్ట్రంలో స్థానికేతరులుగా.. 
 • జీవో 317 సవరించాలని వినతి
 • ఆస్క్‌ కేటీఆర్‌లో ఆ ప్రశ్నలపై స్పందించని మంత్రి
 • రేవంత్‌పై వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ శ్రేణుల విమర్శలు


హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందించే దళిత బంధు పథకం ఇంకెప్పుడు అమలు చేస్తారు? నవంబరు 4 నుంచి ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని, దానిని ఎవరూ అడ్డుకోలేరంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘనంగా ప్రకటించిన హామీ ఏమైంది? ఎస్సీ కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు!? ఒక నియోజకవర్గం ఉప ఎన్నికలో విజయం కోసమా..? లేక నిజంగానే ఎస్సీల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉందా!? రైతులను మానసిక వేదనకు గురి చేస్తున్న ధరణి సమస్యలను అసలు పట్టించుకోరా..? అంటూ వివిధ సమస్యలపై నెటిజన్లు మంత్రి కె.తారకరామారావుకు ప్రశ్నలు సంధించారు. ‘ఆస్క్‌ కేటీఆర్‌’ అంటూ గురువారం సాయంత్రం ట్విటర్‌ ద్వారా గంటపాటు నెటిజన్లతో మంత్రి సంభాషించారు.


ఈ సందర్భంగా, ధరణిలో సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, సమస్యలు ఉన్నాయని ప్రభుత్వమే ఒప్పుకొంటున్నా ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. నిషేధిత భూములు, ఆధార్‌ సమస్యలతో రైతులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని, వారికి ఇప్పటికే ఉన్న సమస్యలు చాలవన్నట్టు.. ధరణి రూపంలో కొత్త సమస్యలు వెంటాడుతున్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 


నెలలు గడుస్తున్నా వీఆర్వోల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తప్పుబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 3,357 మంది వీఆర్‌ఏలను లష్కర్‌లుగా గుర్తిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ, ఇప్పటి వరకూ అది అమలు కావడం లేదని రెవెన్యూ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జీవో 317ను సవరించాలని, సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేపట్టాలని ఎక్కువమంది విజ్ఞప్తి చేశారు. ఒక కుటుంబం ఆత్మహత్యకు కారణమైన మీ ఎమ్మెల్యే కుమారుడిని ఎప్పుడు ఎన్‌కౌంటర్‌ చేస్తారని మరొకరు ప్రశ్నించారు. బలహీనులనే ఎన్‌కౌంటర్‌ చేస్తారా? అని నిలదీశారు. గ్రూప్‌ 1, 2 నోటిఫికేషన్లు వేయాలని, డీఎస్సీ వేసి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైందని నిలదీశారు. దానిని అమలు చేసే ఆలోచన ఉందా లేక, కేవలం పార్టీ మ్యానిఫెస్టోకే పరిమితమా? అని ప్రశ్నించారు. విద్యను కార్పొరేట్‌ సంస్థలు ఆక్రమించడంతో మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు ఇస్తామని, హామీ ఇచ్చారని, ఆ పథకాన్ని ఇప్పటికీ అమలు చేయడం లేదని, పేదలు చచ్చాక ఇస్తారా..? అంటూ ఓ నెటిజన్‌  ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల భార్యలు ప్రభుత్వ పరిహారం కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారని, ఇలా ఎందుకు నిరీక్షించాలని జాన్‌ హాప్కిన్క్‌ వర్సిటీలో పరిశోధక విద్యార్థి కోట నీలిమ ప్రశ్నించారు. వరి సాగు చేయవద్దని రైతులకు చెబుతున్న ముఖ్యమంత్రి తన ఫాంహౌజ్‌లో 150 ఎకరాల్లో వరి ఎందుకు సాగు చేస్తున్నారని నిలదీశారు. ఈ ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ స్పందించలేదు.


రేవంత్‌పై వ్యాఖ్యలు.. దుమారం

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య పరస్పర ప్రత్యారోపణలకు కారణమయ్యాయి. ‘పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కుని బక్వాస్‌ జుమ్లా పార్టీ (బీజేపీ)కి అనుకూలంగా పని చేస్తున్న రేవంత్‌రెడ్డి మీతో చర్చకు వస్తానంటున్నారు. ఆయనకు ఎలాంటి సందేశం ఇస్తారు?’ అంటూ టీఆర్‌ఎస్‌ మద్దతుదారుడు చేసిన ట్వీట్‌పై మంత్రి స్పందించారు. ‘‘తొలుత ఆయనను ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చర్చ పెట్టుకోనివ్వండి. క్రిమినల్‌, 420లతో నేను చర్చకు రాను’ అంటూ బదులిచ్చారు. దీనిపై కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రత్యారోపణలు చేశారు. అక్రమ పాస్‌పోర్టులు, మానవ అక్రమ రవాణా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆరే క్రిమినల్‌ అంటూ బదులిచ్చారు. తన కిడ్నాప్‌ వెనక కేటీఆర్‌ ఉన్నారంటూ ఒడిసా పారిశ్రామికవేత్త సుభాష్‌ అగర్వాల్‌ గతంలో చెప్పిన మాటలు ప్రచురితమైన వార్తను కాంగ్రెస్‌ నేతలు పోస్ట్‌ చేశారు.


నెటిజన్ల ప్రశ్నలు.. కేటీఆర్‌ సమాధానాలు కొన్ని..

- గ్రామాలకు టి-ఫైబర్‌ ఇంటర్నెట్‌ ఎప్పటి నుంచి ఆశించవచ్చు?

మొదటి దశ ఏప్రిల్‌-2022లో అందుబాటులోకి వస్తుంది.

- ఐటీ రంగం జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందేందుకు మిమ్మల్ని కేంద్ర ఐటీ మంత్రిగా చూడాలని ఉంది. జాతీయ రాజకీయాలపై మీ దృక్పథం ఏమిటి?

తెలంగాణలో ఉండి నా రాష్ట్రానికి సేవ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.


నెటిజన్ల ప్రశ్నలు.. కేటీఆర్‌ సమాధానాలు

- యూపీలో ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడారు. మీ అభిప్రాయం?

ప్రస్తుతం ట్రెండ్‌ చూస్తుంటే ఎస్పీకే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది.

- తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీని ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

మా దృష్టి సుపరిపాలన, అభివృద్ధిని కొనసాగించడంపైనే ఉంటుంది. ప్రజలు శాంతి, సుస్థిర పాలన కోరుకుంటున్నారు.

- యూపీలో బీజేపీని ఓడించేందుకు ఎస్పీకి మద్దతుగా టీఆర్‌ఎస్‌ ప్రచారం చేయనుందా?

త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం

- కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో వచ్చే వారంలో జరగాల్సిన బీడీఎస్‌ పరీక్షలను వాయిదా వేయాలి

మంత్రి హరీశ్‌ రావు పరిశీలిస్తారు

- ములుగు జిల్లా కమలాపూర్‌లోని బిల్ట్‌ ఫ్యాక్టరీ ఏడేళ్లుగా మూతపడి ఉంది. ఉద్యోగుల బకాయిలు చెల్లించండి?

బిల్ట్‌ పునరుద్ధరణకు అనేక పరిష్కారాలు ఆలోచిస్తున్నాం. కానీ, ఇంతవరకు విజయవంతం కాలేదు.

- విపక్షాల విద్వేష ప్రచారం, అసత్య వార్తలను ఎలా ఎదుర్కొంటారు?

ఏది సత్యమో, ఎవరు తెలంగాణ కోసం పని చేస్తున్నారో ప్రజలకు తెలుసు

- ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న ప్రధాని మోదీపై మీ కామెంట్‌.

జుమ్లా ఆఫ్‌ ది సెంచరీ (ఈ శతాబ్దంలోనే అతి పెద్ద తప్పుడు హామీ)

- రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పెడతారా?

అది కేసుల సంఖ్య, వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ఇచ్చే సలహాపై ఆధారపడి ఉంటుంది.

Updated Date - 2022-01-14T08:21:30+05:30 IST