అగ్నిపథ్‌పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరేంటి?
ABN , First Publish Date - 2022-06-28T08:58:36+05:30 IST
మిర్చి రైతులు గిట్టుబాటు ధర కోసం నిలదీస్తే రాష్ట్ర ప్రభుత్వం బేడీలు వేసిందని, తెగులు సోకి మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లితే...

మోదీ రాకకు నిరసన చేపట్టాలి..
ప్రశ్నిస్తే.. రైతులకు బేడీలు..
మిర్చికి కనీస పరిహారం ఇవ్వలేదు
శాసనసభపై కాంగ్రెస్ జెండా ఎగరాలి
కేసీఆర్, మోదీలు తోడు దొంగలు
అగ్నిపథ్ రద్దు చేసేదాకా పోరాటం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
మల్కాజిగిరిలో శాంతి సత్యాగ్రహ దీక్ష
హైదరాబాద్, మల్కాజిగిరి, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): మిర్చి రైతులు గిట్టుబాటు ధర కోసం నిలదీస్తే రాష్ట్ర ప్రభుత్వం బేడీలు వేసిందని, తెగులు సోకి మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లితే కనీసం నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలు కనీసం ప్రభుత్వ పెద్దల పరామర్శకూ నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్, మాజీ జడ్పీటీసీ భారతి సహా అనేక మంది టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు సోమవారం గాంధీభవన్‌లో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ శాసనసభపై కాంగ్రెస్ జెండా ఎగరేసినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులతో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే.. బర్తరఫ్ చేయాల్సింది పోయి ఆ మంత్రిని దగ్గరకు తీసుకున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు డిక్లరేషన్ ద్వారా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, కౌలు రైతులతో సహా ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తామని, ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు తోడు దొంగలని, వారిని బంగాళాఖాతంలో వేయాలని అన్నారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసేంత వరకు కాంగ్రెస్ నిరసన కార్యక్రమాన్ని విరమించేది లేదని సోమవారం మల్కాజిగిరిలో నిర్వహించిన శాంతి సత్యాగ్రహ దీక్షలో రేవంత్ స్పష్టం చేశారు. ఇక్కడి యువతకు క్షమాపణ చెప్పిన తర్వాతే మోదీ తెలంగాణలో అడుగు పెట్టాలన్నారు. అగ్నిపథ్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ యువతపై ఏమాత్రం గౌరవం ఉన్నా మోదీ తెలంగాణ పర్యటనలో తెలంగాణ గడ్డపై కాలుమోపేలోపే అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలపాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో అక్రమంగా జైలు పాలైన తెలంగాణ యువతకు, వారి కుటుంబాలకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వారందరికీ బెయిల్ వచ్చే వరకు అన్ని ఖర్చులను పార్టీ భరిస్తుందని అన్నారు.
అన్నీ బేషరతు చేరికలే: భట్టి విక్రమార్క
ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న చేరికలన్నీ బేషరతు చేరికలేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. కొత్తగా చేర్చుకున్న ఎవరికీ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామన్న హామీలు ఎవరూ ఇవ్వలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ.. పార్టీ విధానం ప్రకారమే జరుగుతుందని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన వారిని పార్టీలోకి తీసుకున్నంత మాత్రాన పాత వారిని పార్టీ వదిలేస్తుందని అనుకోవద్దన్నారు.
ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్‌గా నరే్‌ష
టీపీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్‌గా నరేష్ రెడ్డిని ఆ సెల్ చైర్మన్ బీఎం వినోద్ కుమార్ నియమించారు. ఈ మేరకు సోమవారం ఆయనకు నియామకపత్రం అందజేశారు.
పోడు సమస్య తీరుస్తానన్న సీఎం ఏమయ్యారు?: రేణుకా చౌదరి
రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానన్న సీఎం కేసీఆర్ ఏమయ్యారని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ప్రశ్నించారు. ఈ సమస్యకు సంబంధించి ఆయన చేసే ప్రకటన ఒకటైతే.. డిపార్ట్‌మెంట్‌కు ఇచ్చే ఆదేశం మరొకటన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ గిరిజన మహిళలపై పోలీసుల దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.