కేంద్రంపై ఏడ్వటం తప్ప మీరు సాధించిందేమిటి?

ABN , First Publish Date - 2022-03-18T08:57:36+05:30 IST

కేంద్రంపై ఏడ్వటం తప్ప మీరు సాధించిందేమిటి? అని బీజేఎల్పీ నేత రాజాసింగ్‌, పార్టీ అధికార ప్రతినిధులు ఎన్‌.వి.సుభా్‌ష, రాణి రుద్రమ దేవి.. ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు.

కేంద్రంపై ఏడ్వటం తప్ప మీరు సాధించిందేమిటి?

బీజేపీ నేతలు రాజాసింగ్‌, సుభాష్‌, రాణి రుద్రమ

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కేంద్రంపై ఏడ్వటం తప్ప మీరు సాధించిందేమిటి? అని బీజేఎల్పీ నేత రాజాసింగ్‌, పార్టీ అధికార ప్రతినిధులు ఎన్‌.వి.సుభా్‌ష, రాణి రుద్రమ దేవి.. ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణకు ఏడేళ్లలో రూ.3.30 లక్షల కోట్లకుపైగా కేంద్రం నిధుల మంజూరు చేసిందని, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్థి నిధులన్నీ కేంద్రానివే అని, దీనిపై బహిరంగ చర్చకు సిద్థమని ప్రకటించారు. మంత్రి గంగులపై పోటీకి బీజేపీ కార్యకర్త చాలు అని చిత్తుగా ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. ‘మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిప్పు కణం... సంజయ్‌ పేరు వింటేనే కేసీఆర్‌ వెన్నులో వణుకు పుడుతోంది.. మాటలకు చేతలకు పొంతనలేని దద్దమ్మ కేటీఆర్‌’ అని పేర్కొన్నారు. 


కరీంనగర్‌ ఎంపీగా ఉంటూ బండి సంజయ్‌ గత మూడేళ్లుగా కనీసం రూ.3 కోట్లు కూడా తేలేకపోయారంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ‘అబద్ధాలు చెప్పడంలో కేటీఆర్‌ వాళ్ల అయ్యను మించి పోయిండు. గత కొద్దిరోజులుగా నరం లేని నాలుక ఉంది కదా అని పచ్చి అబద్ధాలు వల్లిస్తుండు. కేంద్రంపై విషం చిమ్ముతున్నడు. కేంద్రం నిధులిస్తున్నా సక్రమంగా ఖర్చు చేయకుండా దారి మళ్లిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీజేపీపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటు’ అని గురువారం ఒక ప్రకటనలో వారు పేర్కొన్నారు. ‘ఏ సంవత్సరం ఏ స్కీం కింద, ఏయే రూపాల్లో కేంద్రం తెలంగాణకు నిధులు ఇచ్చిందనే పూర్తి వివరాలు మావద్ద ఉన్నయ్‌. అతి త్వరలోనే గణాంకాలతోసహా ప్రజల ముందుంచబోతున్నం. కేటీఆర్‌కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి’ అని సవాల్‌ విసిరారు. కేటీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్థి ఉన్నా వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌, ఇన్వెస్ట్‌ మెంట్‌ క్లియరెన్స్‌ పత్రాలు సమర్పించాలని వారు డిమాండ్‌ చేశారు. 

Read more