లక్ష ఖాళీలు ఏమయ్యాయ్‌?

ABN , First Publish Date - 2022-03-16T09:24:07+05:30 IST

ఏడేళ్లుగా ఊరించి 80 వేల ఉద్యోగాలనే భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్‌ మిగిలిన లక్ష ఖాళీలను మింగేశారా? వాటిని టీఆర్‌ఎస్‌ నేతలకు ఇస్తారా?

లక్ష ఖాళీలు ఏమయ్యాయ్‌?

కేసీఆర్‌ మింగేశారా? టీఆర్‌ఎస్‌ నేతలకు ఇస్తారా?: షర్మిల

పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసేంతవరకూ పోరాటం


వలిగొండ, మార్చి 15: ఏడేళ్లుగా ఊరించి 80 వేల ఉద్యోగాలనే భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్‌ మిగిలిన లక్ష ఖాళీలను మింగేశారా? వాటిని టీఆర్‌ఎస్‌ నేతలకు ఇస్తారా? అని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. తాను ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోనే ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేశారని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో ఉద్యోగాలు భర్తీచేసేదాకా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. నిరుద్యోగులు, యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా దున్నపోతు మీద వాన పడ్డట్లుగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన కుటుంబంలో ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్నాను కదా.. ఎవరు ఎలా పోతే నాకేంటి అన్న విధంగా కేసీఆర్‌ ప్రవర్తిస్తున్నారని ఆరోపంచారు. డిగ్రీలు, పీజీలు చేసిన యువత ఆటోలు నడుపుకుంటూ, హమాలీ పని చేసుకుంటూ, గొర్లుబర్లు కాసుకుంటూ బతకాలా... కేసీఆర్‌ కుమారుడు, కుమార్తె మాత్రమే రాజ్యామేలాలా? అని ప్రశ్నించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 26వ రోజైన మంగళవారం ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం బూర్లగడ్డలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. పీఆర్సీ, బిస్వాల్‌ కమిటీ ప్రకారం మొత్తంగా 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలుస్తుండగా, కేసీఆర్‌ మాత్రం 80వేల ఉద్యోగాలే అనడం ఏమిటని నిలదీశారు. ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారని ఆరోపించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం కేసీఆర్‌ స్పందించలేదని,  బాధిత కుటుంబాలను అధికార పార్టీ నాయకులు కనీసం పలకరించలేదని విమర్శించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోనూ 11 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగం లేకపోతే ప్రతి నెల రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించి మోసం చేసిన కేసీఆర్‌ ప్రతి నిరుద్యోగికి ఇప్పటివరకు రూ.1.20 లక్షల బాకీ పడ్డారని చెప్పారు. 


నేటి పాదయాత్ర ఇలా...

ప్రజాప్రస్థానం పాదయాత్ర 27వ రోజైన బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం బూర్లగడ్డలో మొదలవుతుంది. నెమిలికాల్వ జంక్షన్‌, జైకేసారం క్రాస్‌, జల్‌కాల్వ, గోకారం, వర్కట్‌పల్లి, సంగం మీదుగా సాగి భూదాన్‌పోచంపల్లి మండలం ధర్మారెడ్డిపల్లి, సలోనిగూడెం క్రాస్‌రోడ్‌ వద్ద ముగుస్తుంది.నేటి పాదయాత్ర ఇలా...

ప్రజాప్రస్థానం పాదయాత్ర 27వ రోజైన బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం బూర్లగడ్డలో మొదలవుతుంది. నెమిలికాల్వ జంక్షన్‌, జైకేసారం క్రాస్‌, జల్‌కాల్వ, గోకారం, వర్కట్‌పల్లి, సంగం మీదుగా సాగి భూదాన్‌పోచంపల్లి మండలం ధర్మారెడ్డిపల్లి, సలోనిగూడెం క్రాస్‌రోడ్‌ వద్ద ముగుస్తుంది.


Read more