మాకూ ఓటు కావాలి!

ABN , First Publish Date - 2022-10-07T08:25:08+05:30 IST

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా.. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటు హక్కు కోసం 23 వేల దరఖాస్తులు వచ్చాయి. సరిగ్గా ఏడాదిన్నర క్రితం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో జరిగిన ఉప ఎన్నికకు ముందు..

మాకూ ఓటు కావాలి!

  • మునుగోడులో కొత్త ఓట్ల కలకలం
  • ఓటుకు 30 వేలు వస్తాయనే ప్రచారంతో నమోదుకు డిమాండ్‌ 
  • 23 వేల దరఖాస్తులు.. ఎన్నికల అధికారులు సీరియస్‌
  • ప్రతి కొత్త దరఖాస్తుకూ ఫైల్‌ పెట్టి వివరాలు రాయాలని ఆదేశం

నల్లగొండ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా.. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటు హక్కు కోసం 23 వేల దరఖాస్తులు వచ్చాయి. సరిగ్గా ఏడాదిన్నర క్రితం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో జరిగిన ఉప ఎన్నికకు ముందు.. ఓటు హక్కు కోసం 1,500 దరఖాస్తులు రాగా మునుగోడు విషయంలో అందుకు 15 రెట్లకు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం.


ఈ ఎన్నికల్లో ఒక్కో పార్టీ ఓటుకు రూ.10 వేల చొప్పున పంచే అవకాశం ఉందంటూ.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా సమయంలో మొదలైన ప్రచారమే ఇందుకు కారణమని సమాచారం. మూడు ప్రధాన పార్టీల నుంచి ఒక్కో ఓటరుకూ రూ.10 వేల చొప్పున మొత్తం 30 వేలు పోలింగ్‌ నాటికి అందుతాయన్న ప్రచారం జరగడంతో.. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న మునుగోడు నియోజకవర్గ ప్రజలంతా తమ తమ ఓట్లను మునుగోడుకు బదిలీ చేసేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరితో పాటు కొత్తగా 18 సంవత్సరాలు నిండినవారు, కొత్త కోడళ్లు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని ఓట్ల సంఖ్యలో రెండు శాతానికి మించి కొత్త ఓట్లకు దరఖాస్తులు రావు. కానీ మునుగోడు నియోజకవర్గంలో కొత్త ఓట్లకు 12శాతం దరఖాస్తులు రావడంతో ఎన్నికల అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 


పరస్పర ఆరోపణలు..

హైదరాబాద్‌ కేంద్రంగా బీజేపీ నేతలు మునుగోడులో ఓటు హక్కు కోసం పలువురితో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేయించారని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు.. దీనిపై సీరియ్‌సగా దృష్టిపెట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అటు బీజేపీ నేతలు కూడా.. ఓట్ల తొలగింపు, కొత్త ఓట్ల దరఖాస్తులకు టీఆర్‌ఎస్‌ నేతలు ప్రత్యేకంగా ఓ విభాగాన్నే ఏర్పాటు చేశారని ఆరోపిస్తున్నారు. కొత్తగా ఇన్ని దరఖాస్తులు రావడంపై ఎన్నికల అధికారులకు గురువారం ఫిర్యాదు చేశారు. వారి పరస్పర ఆరోపణలు, ఫిర్యాదుల సంగతెలా ఉన్నా.. 12 శాతం ఓట్లు అంటే ఎన్నికల ఫలితాన్నే ప్రభావితం చేస్తాయి కాబట్టి అధికారులు అప్రమత్తమయ్యారు.


సాధారణంగా కొత్త ఓట్ల దరఖాస్తులను బీఎల్‌వో విచారించి నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. మునుగోడులో ఆ అధికారాన్ని సూపర్‌వైజర్లు, తహసీల్దార్లకు అప్పగించారు. కొత్త ఓటు కోసం వచ్చిన ప్రతి దరఖాస్తునూ క్షుణ్నంగా పరిశీలించాలని, ఒక్కో దరఖాస్తుకూ ఒక్కో ఫైలు ఏర్పాటు చేసి.. ఓటుహక్కు కోసం అవసరమైన సర్టిఫికెట్లు జత చేశారా, లేదా అనే విషయాన్ని.. ఓటు పొందేందుకు, తిరస్కరణకు కారణాలను ఆ ఫైల్‌లో వివరంగా రాయాలని నల్లగొండ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఈనెల 14న చివరి తేదీ కాగా.. ఆనాటి వరకూ కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 14న మునుగోడు ఉప ఎన్నిక ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.

Updated Date - 2022-10-07T08:25:08+05:30 IST