అవార్డులు తీసుకునేందుకు మనసొప్పలేదు

ABN , First Publish Date - 2022-12-16T03:37:07+05:30 IST

హైదరాబాద్‌, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సర్వసభ్య సమావేశంలో గవర్నర్‌ తమిళిసై అవార్డులు అందించారు. మంత్రులు

అవార్డులు తీసుకునేందుకు మనసొప్పలేదు

రాజ్‌భవన్‌లో కార్యక్రమానికి హాజరు కాని ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే

19మంది కలెక్టర్లు, ఒక పోలీస్‌ కమిషనర్‌, ఐదుగురు ఎస్పీలూ డుమ్మా

హైదరాబాద్‌, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సర్వసభ్య సమావేశంలో గవర్నర్‌ తమిళిసై అవార్డులు అందించారు. మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిల పేర్లు అవార్డు స్వీకర్తల జాబితాలో ఉన్నాయి. అవార్డు తీసుకునేందుకు రాజ్‌భవన్‌కు రావాలని వారికి ఆహ్వానం పంపించారు. అయినా... వారు గురువారం నాటి కార్యక్రమానికి హాజరు కాలేదు. మంత్రులు, ఎమ్మెల్యే మాత్రమే కాదు 19 మంది కలెక్టర్లు, ఒక పోలీస్‌ కమిషనర్‌, ఐదుగురు ఎస్పీలు కూడా అవార్డులు అందుకునేందుకు రాలేదు. తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య కొంత కాలంగా దూరం పెరుగుతూ వస్తున్న విషయం ఎప్పటికప్పుడు బహిర్గతం అవుతునే ఉంది. గవర్నర్‌ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా కలెక్టర్లు, కమిషనర్లు, ఎస్పీలు ప్రోటోకాల్‌ పాటించడం లేదు. ఇప్పుడు రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యాక్రమానికి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గైర్హాజరు కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

సేవల్లో రెడ్‌క్రాస్‌ ముందంజ: గవర్నర్‌

నిరుపేదలకు చేరువయ్యేందుకు ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఒక శక్తివంతమైన సంస్థగా ఎదగాలని గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్‌ ఆకాంక్షించారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సర్వసభ్య సమావేశం రాజ్‌భవన్‌లోని దర్బార్‌హాల్‌లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ, కరోనా కారణంగా వచ్చిన విరామం అనంతరం ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దాతృత్వ కార్యకలాపాలు, ప్రజాసేవ చేయడంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ముందంజలో ఉందని గవర్నర్‌ ప్రశంసించారు. రక్తదాన శిబిరాలు నిర్వహించడం, రక్తబ్యాంకులకు నిరుపేదల్ని అనుసంధానం చేసేందుకు ప్రత్యేకంగా యాప్‌ అభివృద్ధి చేయడంలో రెడ్‌క్రాస్‌ విశేషమైన సేవలు అందించిందని కొనియాడారు. వలంటీర్ల నమోదు, ఇతర సేవల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని గవర్నర్‌ చెప్పారు. గిరిజనులకు పోషకాహారం అందించడంతో పాటు కమ్యూనిటీ వనరులను బలోపేతం చేసేందుకు రెడ్‌క్రాస్‌ చేపట్టిన చర్యలను గవర్నర్‌ అభినందించారు. 2024 నాటికి టీబీ ముక్త్‌ భారత్‌గా మార్చడంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు. రక్తదానం చేసి ఎంతోమంది విలువైన ప్రాణాలను కాపాడిన రక్తదాతలకు గవర్నర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-12-16T03:37:08+05:30 IST