కౌన్సిలర్ల తిరుగుబాటు

ABN , First Publish Date - 2022-10-18T04:53:35+05:30 IST

కౌన్సిలర్ల తిరుగుబాటు

కౌన్సిలర్ల తిరుగుబాటు
వర్ధన్నపేట మునిసిపాలిటీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్న కౌన్సిలర్లు

మునిసిపాలిటీలో అవినీతి నిగ్గు తేల్చాలని డిమాండ్‌

పార్టీలకు అతీతంగా ఏకమై  కౌన్సిలర్ల ఆగ్రహం.. ఫిర్యాదు.. 

చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కమిషనర్‌పై కన్నెర్ర 

వర్ధన్నపేట, అక్టోబరు 17: వర్ధన్నపేట మునిసిపాలిటీలో అక్రమాల నిగ్గు తేల్చాలంటూ కౌన్సిలర్లు పట్టుబడుతున్నారు. రూ.కోట్లల్లో ఖర్చు చూపడం.. పత్రికల్లో వరుస కథనాలు రావడంతో ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లతోపాటు, అధికార పార్టీ కౌన్సిలర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు సోమవారం రెండో వార్డు కౌన్సిలర్‌ తోటకూరి రాజమణి ఇంట్లో పార్టీలకతీతంగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు మినహా 10 మంది కౌన్సిలర్లు సమావేశమై పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి చేసిన తీర్మానాలపై చర్చించుకున్నారు. సాధారణ నిధులు, ఎస్‌ఎ్‌ఫసీ నిధులు, 14వ ఆర్ధిక సంఘం నిధులు మొత్తం కలిపి రూ. 6కోట్ల71లక్షల65వేల921 నిధుల వివరాల పూర్తి సమాచారం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. కౌన్సిలర్లు లేకుండా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కమిషన్‌ చేసిన సొంత తీర్మానాలు కొన్ని ఉన్నాయని, వాటి పూర్తి వివరాలు సైతం బయటకు వస్తేనే ఏం జరిగిందో తెలుస్తుందని ఓ నిర్ణయానికి వచ్చారు. మునిసిపాలిటీలో జరిగిన పాలకవర్గం తీర్మానాలు, సొంతంగా చేసిన తీర్మానాల వివరాలు అందించాలని, కౌన్సిలర్లు పార్టీ కండువాలు కప్పుకుని కలిసి కట్టుగా ర్యాలీగా మునిసిపాలిటీ కార్యాలయానికి వెళ్లి కమిషర్‌ను వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లారు. అందుబాటులో చైర్మన్‌, కమీషనర్‌ లేకపోవడంతో ఆఫీస్‌ ఇన్‌చార్జి సాంబలక్ష్మికి వినతి పత్రాన్ని అందించారు. పాలకవర్గం తీర్మానాలు, పాలకవర్గాన్ని కాదని చైర్మన్‌ సొంత నిర్ణయాలతో చేసిన తీర్మానాల వివరాలు అందించాలని కౌన్సిలర్లు వినతి పత్రం అందించడం పట్టణంలో చర్చకు దారి తీసింది. 

చైర్మన్‌ చెప్తేనే వస్తాం...

మునిసిపాలిటీలో రెండు రోజుల నుంచి కొత్త రూల్స్‌ అమలులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రతి విషయం చెప్పడంతోపాటు వార్డుల వారీగా జరిగే పనులు, అవసరాలకు కౌన్సిలర్లు ఆదేశిస్తే వెళ్లకూడదని, కౌన్సిలర్లు వచ్చి కార్యాలయంలో చైర్మన్‌, కమిషనర్‌కు చెప్పిన తర్వాతనే వెళ్లాలని అధికారులు ఆర్డర్‌  వేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కౌన్సిలర్లు ఏకంగా మున్సిపాలిటీ కార్యాలయంలో సిబ్బందిని నిలదీయడంతో మేడం చెప్తేనే పని చేయమని చెప్పారని, ఆమె ఆదేశాలే పాటిస్తామని బహిరంగంగా పేర్కొనడం విశేషం.


Updated Date - 2022-10-18T04:53:35+05:30 IST