నెలాఖరులోగా ‘వార్ధా’ డీపీఆర్‌!

ABN , First Publish Date - 2022-03-05T06:58:11+05:30 IST

గోదావరి బేసిన్‌లో నిర్మించతలపెట్టిన వార్ధా బ్యారేజీ డీపీఆర్‌

నెలాఖరులోగా ‘వార్ధా’ డీపీఆర్‌!

  •  ముసాయిదాను సిద్ధం చేస్తున్న వ్యాప్కోస్‌
  •  నేడో రేపో లైడార్‌ సర్వే కూడా..


హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): గోదావరి బేసిన్‌లో నిర్మించతలపెట్టిన వార్ధా బ్యారేజీ డీపీఆర్‌ సిద్ధమవుతోంది. తుమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా వార్ధా బ్యారేజీ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్‌ ఈ రిజర్వాయర్‌ డీపీఆర్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైంది. నెలాఖరులోగా ముసాయిదా డీపీఆర్‌ను సిద్ధం చేసే అవకాశాలున్నాయి. నేడో, రేపో లైడార్‌ సర్వే కూడా చేయనున్నారు. వాస్తవానికి నెలన్న ర కిందటే డీపీఆర్‌ను సమర్పిస్తామని తెలంగాణ ప్రభు త్వం గోదావరి బోర్డుకు సమాచారం ఇచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రాజెక్టు ఆయకట్టు కింద నీరివ్వడానికి వీలుగా డిస్ట్రిబ్యూటరీలు, సబ్‌ డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం కూడా పూర్తయింది. బ్యారేజీ నిర్మాణం పూర్తయితే ప్రతిపాదిత ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంటుంది.


ఇది తెలంగాణ-మహారాష్ట్రల ఉమ్మడి ప్రాజె క్టు అయినప్పటికీ దీని నిర్మాణ వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వమే పూర్తిగా భరించనుంది. రూ.500 కోట్లు ఖ ర్చవుతుందని అంచనా వేస్తున్న ఈ బ్యారేజీ నుంచి 20 టీఎంసీల నీటిని తీసుకోవాలనే యోచనతో ఉన్నారు. ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. ఇటీవల మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌.. ఉద్ధవ్‌ ఠాక్రేతో జరిగిన చర్చల్లో వార్ధా బ్యారేజీకి అనుమతి కోరినట్లు ప్రచారం కూడా జరిగింది.  అంతర్రాష్ట్ర చీఫ్‌ ఇంజనీర్ల స్థాయి భేటీలో చర్చించిన అనంతరం రాష్ట్రస్థాయికి ఫైలు చేరనుంది. మరోవైపు బ్యారేజీ డీపీఆర్‌ సిద్ధమయ్యేలోపు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న తర్వాత అనుమతుల కోసం కేంద్ర జలవనరుల సంఘాని (సీడబ్ల్యూసీ)కి ప్రాజెక్టు వివరాలను సమర్పించనున్నారు. 


Updated Date - 2022-03-05T06:58:11+05:30 IST