1న వేతనం.. ఏప్రిల్‌ ఫూల్‌!

ABN , First Publish Date - 2022-04-05T09:11:04+05:30 IST

ఖజానా ఆదాయం పెరిగింది.. పన్నుల రాబడీ బాగుంది.. అన్నింటికి మించి రెండేళ్లుగా దెబ్బకొట్టిన కొవిడ్‌ ప్రభావం పోయింది.

1న వేతనం.. ఏప్రిల్‌ ఫూల్‌!

  • సోమవారం నాటికి హైదరాబాద్‌ జిల్లా పరిధి ఉద్యోగులకే వేతనాలు
  • 32 జిల్లాల్లోని వారికి రిక్తహస్తమే.. నేడు సెలవు.. రేపు మరికొందరికి
  • 11వ తేదీలోగా రాష్ట్రంలోని అందరికీ చెల్లింపునకు అవకాశం
  • అసలే ఏప్రిల్‌ నుంచి ధరాభారం.. ఎదుర్కొనడం ఎలాగని సతమతం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): ఖజానా ఆదాయం పెరిగింది.. పన్నుల రాబడీ బాగుంది.. అన్నింటికి మించి రెండేళ్లుగా దెబ్బకొట్టిన కొవిడ్‌ ప్రభావం పోయింది. ఇంకేముంది..? అంతా శుభ సూచకమేని ప్రభుత్వ ఉద్యోగులు భావించారు. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి 1వ తేదీనే జీతాలు ఖాతాల్లో పడిపోతాయని ఆనందించారు. ఉగాదిని ఉత్సాహంగా జరుపుకొందామని అనుకున్నారు. కానీ, ఆశలు అడియాసలే అయ్యాయి. పండుగ రోజున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘‘చేదు’’ మాత్రమే మిగిలింది. ఏడాదిగా వాయిదాల పద్ధతిలో వేతనాలు ఇస్తున్న ప్రభుత్వం.. ఈసారీ దానిని కొనసాగిస్తోంది. ఈ నెల 1, 2, 3 తేదీల్లో రాష్ట్రంలోని ఉద్యోగులెవరికీ జీతాలు అందలేదు. కనీసం 4వ తేదీనైనా వేతనం పడుతుందన్న ఆశతో బ్యాంకు నుంచి వచ్చే మెస్సేజ్‌ల కోసం కళ్లు కాయలు కాసేలా ఉద్యోగులు ఎదురు చూడగా.. ఎక్కువమందికి నిరాశే ఎదురైంది. సోమవారం నాటికి హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని ఉద్యోగులకు మాత్రమే వేతనాలు అందాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట సహా ఏ జిల్లాలోనూ ఉద్యోగులకు జీతం పడలేదు. కాగా, మంగళవారం బాబూ జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న కొన్ని జిల్లాల ఉద్యోగులకు వేతనాలందే అవకాశం ఉంది.


ధరల మోతలో.. ఉపశమనం అనుకుంటే..

ప్రభుత్వ ఉద్యోగి అనగానే ఒకటో తేదీన వేతనాలు పొందుతారన్న పేరుండేది. కానీ, రాష్ట్రంలో ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగియనున్న క్రమంలో వేతనాల బిల్లులకు కొంత ఇబ్బంది ఏర్పడేది. అయినప్పటికీ చాలా సందర్భాల్లో ఏప్రిల్‌ 1న (మార్చి నెలకు సంబంధించిన) ఉద్యోగులు వేతనాలు అందుకున్న దాఖలాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పండుగలు ఉంటే.. ఒక రోజు ముందే చెల్లించిన సందర్భాలూ ఉన్నాయి. కానీ, కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో ఉద్యోగులకు ఏడాదిగా వాయిదాల పద్ధతినే ఇస్తున్నారు. ర్యాండమ్‌గా కొన్ని జిల్లాలను ఎంచుకుంటూ ప్రతి నెల 11వ తేదీ దాకా చెల్లిస్తున్నారు. వాస్తవానికి పరిస్థితులు చక్కబడడంతో కొన్ని నెలలుగా పన్నుల ఆదాయంతో పాటు, భూముల అమ్మకాలతో పన్నేతర ఆదాయం పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పన్ను రాబడి రూ.30 వేల కోట్లకు పైగా పెరిగింది. అయినా, వేతనాల వద్దకు వచ్చేసరికి ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. కాగా, ఈ నెల 1 నుంచి అనేక రకాల వస్తువులు, సేవల ధరలు పెరిగాయి. ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరల గురించి అయితే చెప్పనవసరం లేదు.


ఈ పరిస్థితులో సమయానికి వేతనం రాకపోవడంతో ఉద్యోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే.. అన్నీ బాగుండి కూడా ఈ నెల జీతాలు ఆలస్యం కావడంపై ఉన్నతాధికారుల వాదన మరోలా ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఏప్రిల్‌ 1న మాత్రమే పని దినం (వర్కింగ్‌ డే) ఉండడం, 2న ఉగాది, 3న ఆదివారం అయినందున జీతాల చెల్లింపు కొంత ఆలస్యమైందని చెబుతున్నారు. కానీ, ఇది సాకు మాత్రమే. కచ్చితంగా 1న జీతం ఇవ్వాలని అనుకుంటే అందుకుతగ్గట్లే ప్రక్రియను మార్చి నాలుగో వారాని కల్లా సిద్ధం చేసేవారు. అలాంటిదేమీ చేయకపోవడంతో.. నెల మొదటి తేదీన వేతనం ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టమైంది. దీంతో ఉద్యోగులు మాత్రం జీతాల్లేకుండానే ఉగాదిని జరుపుకోవాల్సి వచ్చింది.


విద్యుత్తు ఉద్యోగులదీ అదే పరిస్థితి

రాష్ట్రంలో 24 గంటల పాటు విద్యుత్తు అందిస్తున్నామని చెప్పుకొనే డిస్కమ్‌ల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. రాష్ట్రానికి వెలుగులు పంచుతూ... ఈ సంస్థలు చీకట్లో కూరుకుపోతుండగా.. ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఆర్టీసీలోనూ ప్రతి నెలా వేతనాల చెల్లింపునకు అగచాట్లు తప్పడం లేదు. ఎట్టకేలకు సోమవారం సాయంత్రం కార్మికుల ఖాతాల్లో వేతనాలు జమ చేశారు.


కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌కు కటకటే

రెగ్యులర్‌ ఉద్యోగులు ఒకటిన కాకుంటే.. 11వ తేదీలోగానైనా వేతనాలు అందుకుంటారు. కానీ, రాష్ట్రంలోని కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా ఏ నెల జీతాలు ఆ నెల అందని  దైన్యం వీరిది. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూర్చే వాటిలో రిజిస్ట్రేషన్ల శాఖ ఒకటి. అయితే, ఈ శాఖలోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్లో సగం కంటే ఎక్కువమందికి ఏడాదిగా వేతనాలు అందడం లేదు. మరికొందరికైతే ఏడాదిన్నరగా జీతాలు రావడంలేదు. ఇటీవల విడుదలైన జీవో మేరకు మార్చి 31న వేతనాలు అందాల్సి ఉన్నప్పటికీ.. ఆర్థిక శాఖ తొక్కిపెట్టడంతో నిధులు విడుదల కాలేదు. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలల కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాల బిల్లులు ట్రెజరీ కార్యాలయాలు దాటి, టోకెన్లు జారీ చేసినప్పటికీ ఖాతాల్లో పడలేదు. దీంతో పెండింగ్‌ జీతాలు వెంటనే చెల్లించాలని ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రా్‌సకు కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సంఘం ప్రతినిధులు సోమవారం వినతిపత్రం అందించారు.


7న వాయిదా పెట్టుకున్నా.. జరిమానాలు కడుతున్నా

ఎలాగూ ఒకటో తేదీన జీతం చేతికి వస్తుందని గృహ రుణం తీసుకున్నా. ముందుజాగ్రత్తగా ప్రతి నెల 7వ తేదీన వాయిదా కట్టేలా ఒప్పందం చేసుకున్నా. కొన్ని నెలలుగా ఆ తేదీకి కూడా వేతనం అందడం లేదు. సకాలంలో వాయిదాలు చెల్లించకపోవడంతో నా క్రెడిట్‌ స్కోర్‌ పడిపోయింది. ప్రతి నెలా జరిమానాలు కడుతున్నా.

- నీటిపారుదల శాఖలోని ఓ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఆవేదన ఇది

Updated Date - 2022-04-05T09:11:04+05:30 IST