హైకోర్టు న్యాయమూర్తిగా చాడ విజయభాస్కర్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-04T09:31:50+05:30 IST

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా చాడ విజయభాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు.

హైకోర్టు న్యాయమూర్తిగా చాడ విజయభాస్కర్‌రెడ్డి

సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా చాడ విజయభాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. బుధవారం ఈ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 12 మందిని జడ్జిలుగా నియమించాలని సుప్రీం కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. అయితే అందులో 10 మందికి మాత్రమే కేంద్రం ఆమోదం తెలిపింది. న్యాయవాదుల కోటా నుంచి ఇద్దరికి రాష్ట్రపతి ఆమోదం లభించలేదు. కాగా ఆ ఇద్దరిలో ఒకరైన చాడ విజయభాస్కర్‌రెడ్డి నియామకానికి తాజాగా బుధవారం కేంద్రం ఆమోదం తెలిపింది. గురువారం విజయభాస్కర్‌రెడ్డి హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా, తాజా నియామకంతో హైకోర్టులో జడ్జిల సంఖ్య 28కి చేరింది. మొత్తం జడ్జిల స్ర్టెంత్‌ 42 కాగా.. ప్రస్తుతం 27 మందే ఉన్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల స్ట్రెంత్‌ 24 నుంచి 42కు పెంచారు. ఏడాది వ్యవధిలోనే మొత్తం 18 మంది న్యాయాధికారులు, న్యాయవాదులను హైకోర్టు జడ్జిలుగా నియమించారు. 


గత నెలలో మరో ఆరుగురు న్యాయవాదులను హైకోర్టు జడ్జిలుగా నియమించాలని జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. దీనికి కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉన్నది. కాగా, ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని దుబ్బాకకు చెందిన చాడ పుష్పమ్మ, చాడ కేశవరెడ్డి దంపతులకు 1968లో విజయభాస్కర్‌రెడ్డి జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1992లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేయించుకున్న ఆయన.. జస్టిస్‌ వీవీఎస్‌ రావు హైకోర్టు సీనియర్‌ న్యాయవాదిగా ఉన్న సమయంలో ఆయన వద్ద జూనియర్‌గా చేరారు. ఎన్‌ఐఆర్డీ, చిన్న పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా, కేంద్ర ప్రభుత్వ అడిషనల్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా, వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర రెవెన్యూశాఖ తరఫున జీపీగా పని చేస్తున్నారు.  

Updated Date - 2022-08-04T09:31:50+05:30 IST