అమ్మో.. నర్సంపల్లి
ABN , First Publish Date - 2022-07-25T09:22:38+05:30 IST
అక్కడ అధికారం, దళారీ కలగలసింది..! అక్రమం.. అన్యాయం రాజ్యమేలుతోంది..! దౌర్జన్యం..
- ఉన్నది 2 వేల ఎకరాలు.. రికార్డుల్లోనేమో 3 వేలు..
- ప్రతి సర్వే నంబరులో చిక్కుముడులు.. వివాదాలు
- దళారుల మాయాజాలం.. అధికారుల చేతివాటం
- ఒక్కో భూమి మీద ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్
- సీఎం నియోజకవర్గంలో సమస్యాత్మక గ్రామం
తూప్రాన్ రూరల్, జూలై 24: అక్కడ అధికారం, దళారీ కలగలసింది..! అక్రమం.. అన్యాయం రాజ్యమేలుతోంది..! దౌర్జన్యం.. దందా యథేచ్ఛగా సాగుతోంది..! ఇంకేం.. అసలే భూమే లేకున్నా రికార్డుల్లో పుట్టుకొస్తుంది.. ఒకవేళ రికార్డు ల్లో మీ పేరు మీద ఉన్నా.. ఎప్పుడో కబ్జా అయిపోయి ఉం టుంది. ఖాళీగా కనిపించిందా..? వేరొకరి ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఆఖరికి అసైన్డ్ అయినా సరే.. కబళించే వ్యూహంతో వివాదం రేగుతుంది. ఎప్పుడో దశాబ్దాల కిందట సొసైటీకి ఇచ్చినదైనా సరే.. సృష్టికి ప్రతి సృష్టిలా పోటీగా నకిలీ సొసైటీ ఏర్పడి ఏకంగా క్రయవిక్రయాలే జ రిగి పోతుంటాయి. ఇదంతా ఎక్కడో ఏ మారుమూల ప్రాంతంలోనో కాదు.. హైదరాబాద్‌కు ద గ్గరలో.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం నర్సంపల్లిలో జరుగుతోంది. ఇక్కడ ప్రతి భూమి వివాదాస్పదమే. ప్రతి సర్వే నం బరు లోనూ సమస్యలే. గ్రామ పరిధిలో వాస్తవంగా 2 వేల ఎకరాల భూమి ఉండగా, రికార్డుల్లో 3 వేల ఎకరాలుగా న మోదైంది. భూమి ఒక చోట ఉంటుంది. కాగితాల్లో మరోచోట కనిపిస్తుంది. ఈ గ్రామంలో భూములుండి హైదరాబాద్‌లోనో, ఇతర ప్రాంతాల్లోనో ఉంటున్నవారైతే ఆశలు వదులుకోవాల్సిందే. యజమానులకు తెలిసేలోపు ఇద్దరు ముగ్గురు చేతులు మారి రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. అసలు వారు భూమి వద్దకు వచ్చేసరికి ఇది తమదేనంటూ ఇంకొందరు బయల్దేరతారు.
సహజ వనరులు సహా దేన్నీ వదల్లేదు
గతంలో పనిచేసిన పట్వారీలు, వీఆర్వోలు కాసుల కోసం దళారులను ప్రోత్సహిస్తూ వచ్చారు. నర్సంపల్లిలో ఎవరైనా భూమి కొనాలన్నా, అమ్మాలన్నా ముందుగా ఇక్కడి దళారులకు తెలిసిపోతుంది. బయటి వ్యక్తులు వస్తే వారిని బురి డీ కొట్టించి లేని భూమిని కాగితాల్లో చూపించి విక్రయిస్తా రు. ఇలానే కాగితాల్లో పేర్లు మారుతూ గ్రామ పరిధి భూ ములు రికార్డుల్లో 3 వేల ఎకరాలకు చేరుకున్నాయి. రైతు లు పొలాలకు వెళ్లేందుకు 61, 62 సర్వే నంబర్లలో ప్రభు త్వం 2015లో రూ.5 లక్షల ఉపాధి హామీ నిధులు వెచ్చిం చి రోడ్డు నిర్మించింది. దళారులు ఈ రోడ్డును చెరిపేసి, దగ్గరలో ఉన్న ఈదులకుంట కట్టనూ కలిపేసి మొత్తం 20 ఎకరాలను అమ్మేశారు. రెడ్యానాయక్ తండా నుంచి తెట్టెకుంట వరకు 2017లో ప్రభుత్వం రూ.5 లక్షలతో ని ర్మించిన రోడ్డును దాంతోపాటు ఏడెకరాలను విక్రయించేశారు. సర్వే నంబరు 283లో ఉన్న 6 ఎకరాల చెరువు కట్ట ఏనెను చదును చేసి అమ్మేశారు. సర్వేనంబరు 25లో 18 ఎకరాలుండగా.. 46 ఎకరాలుగా రికార్డుల్లో పేర్కొంటూ ప లువురికి అంటగట్టారు. ఇవే కాకుండా పలుచోట్ల రైతులను బెదిరించి, వారి పట్టాభూములను ఆక్రమించుకుని బేరానికి పెట్టారు. పొరుగునే ఉన్న బేగంపేట, అప్పాయిపల్లి, నాచారం గ్రామాలకు చెందిన పలువురు రైతులతో పాటు, హైదరాబాద్ వాసులు మరికొందరికి నర్సంపల్లి పరిధిలో భూములున్నాయి. వీటి గురించి తెలుసుకున్న దళారులు ఉద్దేశపూర్వకంగా వివాదం సృష్టిస్తున్నారు. లేనిపోని భయాలు కల్పించి, బలవంతం చేసి తక్కువ ధరకు స్వాధీనం చేసుకుంటున్నారు.
ఆత్మహత్య చేసుకున్నదొకరు.. టెంటేసి ఆందోళన చేసిందొకరు
బేగంపేటకు చెందిన ఎడ్ల రుక్కయ్యకు నర్సంపల్లి శివారులో 8 ఎకరాల భూమి ఉంది. దాన్ని నలుగురు కొడుకులకు పట్టా చేయించారు. హైదరాబాద్‌లో ఉంటున్న వారికి భూమి హద్దులు తెలియ వు. దీంతో దళారులు ఆ భూమిని ఆక్రమించి పట్టా మార్పిడి చేసుకున్నారు.
బేగంపేటలోనే పనిచేసిన ఓ వీఆర్వో.. లేని భూ మికి రికార్డులు సృష్టించి మూడెకరాలను భార్య పేరిట పట్టా చేయించుకున్నాడు. ఆ కాగితాలతో తనకు నచ్చిన భూమిని చూపిస్తూ ఇతరులకు వి క్రయించాడు.
హైదరాబాద్ వాసి సంధ్యారాణి 4 నెలల క్రితం నర్సంపల్లి శివారులో 15 ఎకరాలను దళారుల వ ద్దనే కొనుగోలు చేశారు. అయితే ఆ భూమికి రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వలేదు. దీంతో ఆమె తహసీల్దార్ కార్యాలయం ఎదుట టెంటు వేసుకుని ఆందోళనకు దిగారు. క్షేత్రస్థాయిలో భూమి లేకుండానే పట్టా ఎలా ఇస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
నర్సంపల్లిలోని సర్వే నంబరు 68లో ఉన్న 16 ఎకరా ల ప్రభుత్వ భూమిని ముగ్గురు వ్యక్తులకు అసైన్ చేసి పట్టాలు కూడా ఇచ్చారు. అయితే ఈ భూమి ఖాళీగా ఉండటంతో దళారులు కన్నేశారు. అక్కడ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తీసుకువచ్చారు. అసైన్డ్‌దారులు అడ్డుకోవడంతో అది ఆగిపోయింది.
ప్రభుత్వం 1983లో సర్వే నం.283లో ఉన్న 130 ఎకరాలను శ్రీనివాస జాయింట్ ఫార్మింగ్ సొసైటీకి కే టాయించింది. అందులో సభ్యులుగా ఉన్నవారంద రూ ఈ భూమిని చూపి తూప్రాన్ సహకార బ్యాం కు నుంచి రుణాలు తీసుకున్నారు. కానీ అదే భూమి పేరిట కొందరు వ్యక్తులు మరో సొసైటీని ఏర్పాటు చేసి భూమిని విక్రయించడం ఆరంభించా రు. రెండు సొసైటీల మధ్య వివాదం మొదలైంది. 130ఎకరాలు కాస్తా రికార్డులో 200కు పె రిగింది.
ఏడాది క్రితం రెడ్యానాయక్ తండాకు చెందిన ధరావత్ రాజు.. తనకున్న 2.20 ఎకరాల భూమిలో 10 గుంటలను ఉంచుకుని మిగతాది అమ్మేశాడు. కానీ, కొన్న వ్యక్తి మాత్రం దళారుల అండతో ఆ పది గుంటలనూ కలిపేసుకుని ఫెన్సింగ్ వేశాడు. మోసపోయానని మనస్తాపం చెందిన రాజు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
భూస్వామి మనసు మార్చి.. తండానే అమ్మేశారు
గుండ్యా నాయక్ (మద్దుల) తండా.. నర్సంపల్లికి దూరంగా పొలాల్లో ఉండేది. నివాసానికి అనుకూలంగా లేకపోవడంతో గిరిజనులు.. తాము ఇళ్లు కట్టుకుని ఉండేందుకు స్థలమిస్తే.. ప్రతిగా తండా ను అప్పగిస్తామంటూ దాదాపు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన బొమ్మల యాదయ్యను ఆశ్రయించారు. దీంతో ఆయన నర్సంపల్లి సమీపంలో ఉన్న సర్వే నంబరు 9లోని ఐదెకరాలను ఇచ్చారు. గిరిజనులందరూ అందులో ఇళ్లు కట్టుకున్నారు. ప్రభుత్వం తండాకు రోడ్డు కూడా వేసింది. తాగునీరు, కరెంటు ఇచ్చింది. అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న తరుణంలో.. ఆ తండాను విక్రయించేశారు. ఇప్పుడు వారికి ఎలాంటి హక్కులూ లేవనే వార్త వారి చెవినపడింది. సమీపంలోనే ఉన్న సర్వే నంబర్ 21లోని ప్రభుత్వ పాఠశాల, దాని చుట్టూ ఉన్న రెండెకరాలనూ అమ్మేసినట్లు తెలిసింది. దీనివెనుక దళారులు పెద్ద కథే నడిపించారు. గిరిజనులెవరికీ తమ రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోవడం.. భూముల ధరలు పెరగడంతో ఎవరికైనా అమ్మేయొచ్చని బొమ్మల యాదయ్యకు నూరిపోశారు. కొనుగోలుదారులను కూడా దళారులే తీసుకొచ్చి యాదయ్య నుంచి కొనుగోలు చేయించారు. తొలుత ఆవాసాలు, పశువుల పాకలు పోగా మిగిలిన స్థలాన్ని, తర్వాత తండానంతటినీ స్వాధీనం చేసుకోవాలని యోచించారు. స్థానికులు అడ్డుకోవడంతో తోకముడిచారు. గిరిజనులకు పట్టాలు లేనందున ఎప్పటికైనా తమ వద్దకే వస్తారన్న ధీమాతో ఉన్నారు.
మా తండాకు ఎసరు పెట్టారు
మా తండాలో ప్రభుత్వం రోడ్డు వేసింది. నీళ్లు, కరెంటు ఇచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఏడాది కిందట గ్రామానికి చెందిన కొందరు దళారులు వచ్చి మా తండాపై లొల్లి షురూ చేసిండ్రు. మా తండాను అమ్మేశారట. ఎంతో కష్టపడి పైసాపైసా కూడబెట్టి పక్కా ఇళ్లు కట్టుకున్నాం. మా ఇళ్లను, భూమిని లాక్కుంటామంటే ఎంతకైనా తెగిస్తాం. ప్రాణాలు పోయినా తండాను వదిలేది లేదు.
- ధరావత్ కిష్టయ్య, గుండ్యానాయక్ తండా
కుట్రలన్నీ తహసీల్దార్ నుంచే..
దళారుల వల్లే నర్సంపల్లిలో భూముల సమస్యలు పెరుగుతున్నాయి. అధికారులు కూడా వారికే మద్దతిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలోనే ఈ కుట్రలన్నీ జరుగుతున్నాయి. తెలియక కొన్న అమాయకులు మోసపోతున్నారు. ఇపుడు మా తండాపైనే కొందరు కన్నేశారు.
- మాన్‌సింగ్, గుండ్యానాయక్ తండా
చీపుర్లతో బుద్ధి చెబుతాం
తండా భూమిని ఇతరులకు అమ్ముకుంటే ఇళ్లు వదిలి మేం ఎక్కడికి పోవాలి? భూమి యజమానికి దళారులు మాయమాటలు చెప్పి మనసు మార్చారు. పక్కా ఇళ్లు కట్టుకుని ఉంటున్న తండాను ఎవరు కొన్నా మేం ఊరుకోం. మా జోలికొస్తే చీపుర్లతోనే బుద్ధి చెప్తాం.
- మెగావత్ ధర్మి, గుండ్యానాయక్ తండా