భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక

ABN , First Publish Date - 2022-04-03T07:53:18+05:30 IST

భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే భారతీయ సంస్కృతికి ఉగాది

భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక

  • ప్రకృతిని పరిరక్షించుకోవడమే పండగ సందేశం: వెంకయ్య 


శంషాబాద్‌రూరల్‌, ఏప్రిల్‌ 2: భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పే భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక అని ఉపరాప్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ముచ్చింతల్‌ స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాలాన్ని గౌరవించడం, ప్రకృతిని పరిరక్షించడ మే ఉగాది సందేశమని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రజలు వివిధ పేర్లతో ఈ పండగను జరుపుకొంటారని, ఉగాదితోనే తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రస్తుతం శ్రీశుభకృత్‌ నామ సంవత్సర ఉగాదిని జరుపుకుంటున్నామని, శుభకృత్‌ అంటే మేలును కలిగించేదని అర్థమని, ఈపండగ అందరి జీవితాల్లోకి సానుకూల మార్పును తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉగాది పండగలోని ప్రతి సంప్రదాయం వెనుక వైజ్ఞానిక రహస్యాలు ముడిపడి ఉన్నాయని చెప్పారు. ఉగాదికి తయారు చేసే షడ్రుచుల పచ్చడి, ఆయా కాలాల్లో వచ్చే అనారోగ్యాలను హరించడంతో పాటు గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠాన్ని సందేశంగా ఇస్తుందన్నారు. 


Updated Date - 2022-04-03T07:53:18+05:30 IST