నిర్లక్ష్యం ఖరీదు.. రెండు ప్రాణాలు..

ABN , First Publish Date - 2022-09-12T05:29:38+05:30 IST

నిర్లక్ష్యం ఖరీదు.. రెండు ప్రాణాలు..

నిర్లక్ష్యం ఖరీదు.. రెండు ప్రాణాలు..

కల్వర్టులో బైక్‌తో సహా పడి ఇద్దరు యువకుల మృతి

పైడిపెల్లి ప్రధాన రహదారిపై ఘటన

కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో ప్రమాదకరంగా కల్వర్టులు

సూచిక బోర్డులు లేకపోవడంతోనే ప్రమాదం


పోచమ్మమైదాన్‌ (వరంగల్‌), సెప్టెంబరు 11 : గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వలన ఇద్దరు యువకులు బలయ్యాయి. ప్రధాన రహదారిపై కల్వర్టు పనులు ప్రారంభించి మధ్యలోనే నిలిపివేయడమే గాక.. ఎలాంటి ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయక పోవడంతో ఇద్దరు రాత్రి వేళలో బైక్‌తో సహా కల్వర్టులో పడి మృతి చెందారు. ఈ సంఘటన గ్రేటర్‌ వరంగల్‌ మూడో డివిజన్‌లోని పైడిపెల్లి ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...


వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం శనిగరం గ్రామానికి చెందిన గుండారపు చంద్రమౌళి-సునిత దంపతులకు కుమారుడు ప్రశాంత్‌(24), కుమార్తె ఉన్నారు. చంద్రమౌళి నర్సంపేటలో హమాలీ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలాగే సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండ లం సూరంపల్లి గ్రామానికి చెందిన ముత్యాల నరసింహులు- రాణి దంపతులకు కుమారుడు గౌతమబుద్ధుడు (23), కుమార్తె ఉన్నారు. ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. అయితే గుండారపు ప్రశాంత్‌, ముత్యాల గౌతమబుద్ధుడు ఇద్దరు హైదరాబాద్‌లో ఉంటూ ఒకే కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత అక్కడే గది అద్దెకు తీసుకుని పోలీసు ఉద్యోగానికి సిద్ధమై ఇటీవల కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగాలకు పరీక్షలు రాశారు.


కాగా, వరంగల్‌ కరీమాబాద్‌ ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో స్నేహితుడైన వనం రాకేష్‌ దశదిన కర్మకు ప్రశాంత్‌, గౌతమబుద్ధుడు కలిసి శనివా రం ఉదయం వచ్చారు. కార్యక్రమం ముగిసిన త రువాత రాత్రి సమయం లో హైదరాబాద్‌కు వెళ్లేందుకు వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రైలు వెళ్లిపోవడంతో కరీమాబాద్‌కు వెళ్లి మరో స్నే హితుడి ద్విచక్ర వాహనం తీసుకొని గౌతమబుద్ధుడుతో కలిసి ప్రశాంత్‌ దామెర మండలం ఊరుగొండలోని తమ సమీప బంధువు ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో గ్రేటర్‌ వరంగల్‌ మూడో డివిజన్‌ పైడిపెల్లిలోని మధ్యలకుంట్ల ప్రాంతంలో రోడ్డుపై నిర్మాణంలో ఉన్న కల్వర్టులో బైక్‌తో సహా పడి మృతి చెందారు. ఆదివారం ఉదయం రోడ్డుపై వెళ్తున్న స్థానికులు కల్వర్టులో బైక్‌ పడి ఉండటం, యువకుడి మృతదేహం తేలడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కల్వర్టులో నుంచి ద్విచక్ర వాహనాన్ని, మృతదేహాన్ని వెలికితీశారు. వాహనం నంబరుతో వివరాలు సేకరించేందుకు ప్రయత్నించడంతో బైక్‌పై ఇద్దరు వెళ్లారనే విషయాన్ని తెలుసుకొని కల్వర్టులో వెదకడంతో మరో మృతదేహం బయటపడింది. అక్కడి నుంచి ప్రశాంత్‌, గౌతమబుద్ధుడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో ఎంజీఎంకు చేరుకొని బోరుమన్నారు. ప్రశాంత్‌ తండ్రి గుండారపు చంద్రమౌళి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 


కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో..

గ్రేటర్‌ వరంగల్‌ మూడో డివిజన్‌ పరిధిలో దేశాయిపేట నుంచి ఆరెపల్లి వరకు కిందటేడు రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో మూడు చోట్ల కల్వర్టు పనులు మధ్యలోనే నిలిపివేశారు. రోడ్డు మధ్యలో కల్వర్టుల నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా వదిలేయడంలో ప్రమాదకరంగా మారాయి. దీంతో కల్వర్టుల పక్క నుంచే నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అనేక సార్లు స్థానికులు, కార్పొరేటర్‌, ఇతర పార్టీల నాయకులు జీడబ్ల్యూఎంసీ అధికారులు, మేయర్‌ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ పనులు మాత్రం పూర్తి కాలేదు. ఆరు నెలల నుంచి ప్రమాదం పక్క నుంచే ప్రయాణం చేస్తున్నారు. గతంలో సైతం కల్వర్టులో పడి గాయాలపాలైన ఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ కాంట్రాక్టర్‌ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెలువడుతున్నాయి. కల్వర్టు చుట్టూ కనీసం ప్రమాద సూచిక బోర్డులు సైతం ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-09-12T05:29:38+05:30 IST