తుపాకులగూడెం బ్యారేజీ సిద్ధం!

ABN , First Publish Date - 2022-03-05T07:04:49+05:30 IST

పూర్వ ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల సాగు, తాగునీటి

తుపాకులగూడెం బ్యారేజీ సిద్ధం!

  • నెలాఖరులో తెలంగాణకు అంకితం!.. రూ.9257 కోట్ల నిర్మాణ వ్యయం
  •  1143 మీటర్ల పొడవు, 92 మీటర్ల ఎత్తు
  •  14 లక్షల ఎకరాలకు సాగునీరు
  •  వరంగల్‌, హన్మకొండకు తాగునీరు
  •  240 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి
  •  బహుళార్థక సాధక ప్రాజెక్టుగా నిర్మాణం


హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పూర్వ ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి వీలుగా నిర్మిస్తున్న తుపాకులగూడెం(సమ్మక్కసాగర్‌) బ్యారేజీ తుదిదశకు చేరుకుంది., దేవాదుల, ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణలో భాగంగా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెంవద్ద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈనెలలో నాలుగో వారం కల్లా పనులు పూర్తిచేసి, ప్రాజెక్టును అందుబాటులోకి తేవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంతా సవ్యంగా జరిగితే నెలాఖరులో తుపాకులగూడెం బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణకు అంకితం చేయనున్నారని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం ప్రాజెక్టు డీపీఆర్‌ను అనుమతులు కోసం కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో దాఖలు చేయగా... పరిశీలన కీలక దశలో ఉంది. దీనికి అనుమతినివ్వాలని కోరుతూ గతేడాది సెప్టెంబరులోనే తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌ను సమర్పించింది.


తుపాకులగూడెం బహుళార్థక సాధక ప్రాజెక్టు. సాగు, తాగునీటి అవసరాలు తీర్చడమే కాకుండా 240 మెగావాట్ల జల విద్యుత్‌ ఉత్పత్తి జరిగేలా దీని నిర్మిస్తున్నారు. తుపాకులగూడెం పైన గంగారం వద్ద ఏర్పాటు చేసిన పంపులతో ఎత్తిపోతల ద్వారా దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు ను ఇస్తారు. వచ్చే వానాకాలం(ఖరీ్‌ఫ)లో ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీళ్లు అందించనున్నారు.


దేవాదుల ప్రాజెక్టు పరిధిలో ఉండే పాత వరంగల్‌, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లోని 6.21 లక్షల ఎకరాలకు... ఎస్సారెస్పీ పరిధిలోని 7.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు నీళ్లు ఇస్తారు. వరంగల్‌/హన్మకొండ నగరాలతో పాటు పలు గ్రామాలకు తాగునీటిని అందించనున్నారు. ఈ బ్యారేజీ కోసం మట్టి పని మొత్తం పూర్తయ్యింది. బ్యారేజీ పనులు పూర్తయ్యాయని నెలరోజుల కిందటే అధికారులు సీఎం కేసీఆర్‌కు సమాచారం కూడా ఇచ్చారు. దాంతో త్వరలోనే ఈ ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారని అధికారులు చెబుతున్నారు.


Updated Date - 2022-03-05T07:04:49+05:30 IST