Hyd IT Employees: హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు శుభవార్త..
ABN , First Publish Date - 2022-09-15T17:41:44+05:30 IST
మెట్రో నగరాల్లో (Metro Cities) ట్రాఫిక్ సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉద్యోగులు ఉదయాన్నే పనివేళకు ఆఫీస్‌లకు చేరుకోవాలంటే..
హైదరాబాద్: మెట్రో నగరాల్లో (Metro Cities) ట్రాఫిక్ సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉద్యోగులు ఉదయాన్నే పనివేళకు ఆఫీస్‌లకు చేరుకోవాలంటే గంటల ముందు బయల్దేరితే గానీ సరైన సమయానికి చేరుకోలేని పరిస్థితి నగరాల్లో ఉంటుంది. ఆ ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకే లోకల్ ట్రైన్స్, మెట్రో రైళ్లు ఇలా పలు రవాణా సదుపాయాలను ప్రభుత్వాలు పట్టాలెక్కిస్తుంటాయి. అయినప్పటికీ హైదరాబాద్‌లోని కొన్ని రూట్లలో ట్రాఫిక్ సమస్యలతో నగరవాసులు సతమతమవుతూనే ఉంటారు. కొన్ని రూట్లలో సిటీ బస్సులు చాలినన్ని లేకపోవడం వల్ల బస్సులకు వేలాడుతూ మరీ వెళుతున్న దృశ్యాలు కనిపిస్తుంటాయి. అయితే.. తాజాగా టీఎస్ఆర్టీసీ ఇలా ఇబ్బందులు పడుతున్న ఐటీ ఉద్యోగులకు (IT Employees) శుభవార్త చెప్పింది. దిల్సుఖ్ నగర్ (Dilsukhnagar) నుంచి కోకాపేట్ సెజ్ (Kokapet Sez) వరకూ బస్సులు ప్రారంభిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ (TSRTC MD Sajjanar) ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 156K రూటులో ప్రయాణికుల సౌకర్యార్ధం దిల్సుఖ్నగర్ నుంచి కోకాపేట సెజ్ వరకూ 4 నూతన మెట్రో బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.
గండిపేట, నార్సింగి, కోకాపేట సెజ్ పరిసర ప్రాంత ప్రజల సౌకర్యార్ధం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ వారు దిల్సుఖ్నగర్ నుంచి కోఠి, నాంపల్లి, మాసాబ్ ట్యాంక్, మెహదీపట్నం, లంగర్ హౌస్, టిప్పుఖాస్ బ్రిడ్జి, బండ్లగూడ, తారామతిపేట, నార్సింగి మీదుగా కోకాపేట వరకూ ప్రతి నలభై నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ ఎండీ తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉదయం 6:00 గంటలకు మొదటి బస్సు, చివరి బస్సు రాత్రి 8:40కి ఉంటుందని.. కోకాపేట నుంచి మొదటి బస్సు ఉదయం 7:25కు, చివరి బస్సు రాత్రి 10:07కు ఉంటుందని తెలిపారు. నార్సింగి, గండిపేట, కోకాపేట పరిసర ప్రాంత ప్రజలు, ఉద్యోగులు ఈ రవాణా సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ విజ్ఞప్తి చేశారు.