అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లర్‌ టోనీ ఆటకట్టు

ABN , First Publish Date - 2022-01-21T08:53:05+05:30 IST

అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లర్‌ టోనీ ఆటకట్టు

అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లర్‌ టోనీ ఆటకట్టు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):  ఏటా రూ.కోట్లలో డ్రగ్స్‌ దందా చేస్తూ.. ఏడు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారిన ఘరానా స్మగ్లర్‌ను హైదరాబాద్‌ సిటీ పోలీసులు ఎట్టకేలకు ముంబైలో పట్టుకున్నారు. అతనితో పాటు అతని వద్ద భారీగా డ్రగ్స్‌ కొనుగోలు చేసి వినియోగిస్తున్న తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 10 గ్రాముల కొకైన్‌, ఒక కారు, 11 మొబైల్‌ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌లో నగర కమిషనర్‌ సీవీ ఆనంద్‌ గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 6న స్మగ్లర్‌ టోనీ అనుచరులను అరెస్టు చేసిన అనంతరం వారిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి, వారి ఫోన్‌ల నుంచి విలువైన డేటాను సేకరించారు. టోనీ గురించి ఆధారాలు సేకరించిన అనంతరం ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. సీపీ ఆనంద్‌, టాస్క్‌ఫోర్‌ ఓఎ్‌సడీ రాఽధాకిషన్‌ పర్యవేక్షణలో ఆ బృందం ముంబైలో టోనీని  అరెస్టు చేసింది అతని ద్వారా భారీగా డ్రగ్స్‌ కొనుగోలు చేసిన మరో  తొమ్మిది మంది  వినియోగదారులను కూడా అరెస్టు చేశారు. ఘరానా డ్రగ్స్‌ స్మగ్లర్‌ టోనీ అసలు పేరు చుక్వు ఒగ్బొన్నా డేవిడ్‌. భారత్‌కు వచ్చిన తర్వాత అతని పేరు టోనీ అభియా మర్షా అలియాస్‌ టోనీగా మారింది. 2013లో తాత్కాలిక వీసాతో ముంబైకి వచ్చాడు. వీసా గడువు ముగిసినా ముంబైలోనే ఉంటున్నాడు. అక్కడి నుంచి దుస్తులు, విగ్గులు కొనుగోలు చేసి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసేవాడు. ఈ క్రమంలో 2017లో అతనికి మహారాష్ట్రలో ఒక నైజీరియన్‌ మహిళ యూస్‌ఫతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ సహజీవనం చేశారు. ప్రస్తుతం వారికి ఒక పాప. ముంబైలో టోనీ ఉండే ప్రాంతం పేరు మిరా బయాందర్‌, వాసాయి విహార్‌. అక్కడ ఎక్కువగా ఆఫ్రికా దేశానికి చెందిన వారే నివసిస్తుంటారు. ఈ క్రమంలో టోనీకి వారితో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. వారి ద్వారా అలా డ్రగ్స్‌ తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. వారిలో కొంతమంది ఆఫ్రికా దేశస్థులు డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించి వారితో పరిచయం పెంచుకున్నాడు. వారితో చేతులు కలిపి విగ్గులు, దుస్తుల వ్యాపారం వదిలేసి డ్రగ్స్‌ దందాలోకి అడుగుపెట్టాడు. కాగా, టోనీని పట్టుకోవడంలో హైదరాబాద్‌ పోలీసులకు సాంకేతికత దన్నుగా నిలిచింది. ఇప్పటి వరకు టోనీ ఎవరితోనూ ఫోన్‌లో మాట్లాడలేదు. అంతర్జాతీయ నంబర్లను వినియోగిస్తూ వాట్సాప్‌ కాల్స్‌లో (వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నేట్‌ ప్రొటోకాల్‌) మాట్లాడుతుండేవాడు. గతంలో దొరికిన స్మగ్లర్ల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. అక్కడి నుంచి సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌లకు లేఖలు రాసి, అక్కడి నుంచి ఐపీ అడ్ర్‌సలు తెప్పించారు. ఆ తర్వాత డేటా, సీడీఆర్‌లు పరిశీలించి టోనీ ఆటకట్టించారు. 

హైదరాబాద్‌కు చెందిన బడాబాబుల అరెస్టు
నార్త్‌జోన్‌ పోలీసులు టోనీతో సహా హైదరాబాద్‌ నగరానికి చెందిన తొమ్మిది మంది డ్రగ్స్‌ వినియోగదారులను అరెస్టు చేశారు. వారిని హిమాయత్‌నగర్‌కు చెందిన నిరంజన్‌ కుమార్‌ జైన్‌, బంజారాహిల్స్‌కు చెందిన ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శశావత్‌ జైన్‌, కాంట్రాక్టర్‌ దండు సూర్య సుమంత్‌ రెడ్డి, ప్రముఖ వ్యాపారి వెంటక్‌ చెలసాని, గౌలీపురాకు చెందిన వ్యాపారి యాగ్యా ఆనంద్‌, ఎర్రగడ్డకు చెందిన వ్యాపారి బండి భార్గవ్‌, బంజారాహిల్స్‌కే చెందిన తమ్మినేని సాగర్‌, ప్రైవేట్‌ ఉద్యోగి అల్గాని శ్రీకాంత్‌, ఆఫీస్‌ బాయ్‌ గోడి సుబ్బారావులుగా గుర్తించారు.  

Updated Date - 2022-01-21T08:53:05+05:30 IST