రాహుల్ గాంధీయే కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలి
ABN , First Publish Date - 2022-09-23T08:35:18+05:30 IST
రాహుల్ గాంధీయే కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలి

ప్రజల కష్టాలు తీరాలంటే రాహులే ప్రధాని పదవి చేపట్టాలి
దేశ రాజకీయాల్లో గాంధీ కుటుంబానికి ఘనమైన చరిత్ర ఉంది
నెహ్రూ నుంచి మొదలు ఇందిర, రాజీవ్ వరకు త్యాగాల చరిత్రే
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రజల కష్టాలు తీరాలంటే రాహుల్ గాంధీయే ప్రధానమంత్రి కావాలని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి అన్నారు. దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రాహుల్ గాంధీనే ఏఐసీసీ అధ్యక్ష పదవిని చేపట్టాలనే ఆకాంక్ష ఉన్నదని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం జగ్గారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగితే బాగుంటుందని, వయస్సు, ఆరోగ్య సమస్యలు ఇబ్బందిగా మారితే రాహుల్ గాంధీకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించి సలహాలు, సూచనలు అందిస్తూ ముందుకు నడిపించాలని కోరారు. సోనియా, రాహుల్లో ఎవరో ఒకరు ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తేనే కార్యకర్తల్లో జోష్ ఉంటుందని జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి, వారికి భరోసా కల్పించటానికి ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3,500 కిలో మీటర్ల పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ ఛరిష్మా కలిగిన నాయకుడని అన్నారు. ఇంటి మనిషి అధ్యక్షులుగా ఉంటే ఒకరకంగా ఉంటుందని, ఇతరులు అధ్యక్షులుగా ఉంటే మరొక రకంగా ఉంటుందని జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర అంటూ ఉన్నదని, మరే ఇతర నాయకులకు, రాజకీయ పార్టీలకు ఇంతటి ఘన చరిత్ర లేదని అన్నారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశారని గుర్తుచేశారు. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నపుడు ప్రతిపక్ష బీజేపీకి చెందిన అటల్ బిహారీ వాజ్పేయి సాక్షాత్తూ పార్లమెంటులోనే ఇందిరాగాంధీని మనం పూజించే దుర్గామాతతో పోల్చారని జగ్గారెడ్డి తెలిపారు. భారతదేశానికి టెక్నాలజీని తీసుకొచ్చి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత రాజీవ్ గాంధీదేనని, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉన్నదంటే అది రాజీవ్ గొప్పతనమేనని కొనియాడారు. ‘2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత సోనియా గాంధీ ప్రధాని కావాలని కాంగ్రెస్ ఎంపీలంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చినపుడు సోనియా కాకపోతే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే అభిప్రాయం వ్యక్తమైనా ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిని చేసిన ఘనత గాంధీ కుటుంబానిదేనని జగ్గారెడ్డి అన్నారు. యూపీఏ ఛైర్పర్సన్గా, మన్మోహన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోని పేద ప్రజలకు ఉపాధి దొరికేలా, ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చారని అన్నారు. స్వాతంత్య్రం రాకముందు నుంచి ఇప్పటిదాకా ప్రజలకు సేవ చేస్తూ జీవిస్తున్న చరిత్ర గాంధీ కుటుంబానికి ఉన్నదన్నారు. మహాత్మాగాంధీ బోధించిన అహింస, శాంతి మార్గాలను ఆచరిస్తున్న కుటుంబం వారిదని కొనియాడారు. ఒకవేళ సోనియా కానీ, రాహుల్ కానీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించకుండా అశోక్గహ్లోత్, శశిథరూర్ లాంటి సీనియర్ నాయకులకు అప్పగిస్తే... గాంధీ కుటుంబం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు.