కేంద్రానికి తెలంగాణ తీన్మార్
ABN , First Publish Date - 2022-09-23T08:08:09+05:30 IST
కేంద్రానికి తెలంగాణ తీన్మార్

కాళేశ్వరం, పోలవరం, అప్పర్ తుంగ, అప్పర్ భద్రలపై లేఖలు
హైదరాబాద్, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం అదనపు టీఎంసీని కలిపి దాఖలు చేసిన సవరణ డీపీఆర్‌ను పరిశీలించకుండా గోదావరినదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) పక్కనపెట్టడాన్ని తెలంగాణ తప్పుపట్టింది. అవసరం లేకున్నా కోర్టు కేసుల్లో ఉన్నందున డీపీఆర్‌ను పరిశీలించలేమని గోదావరి బోర్డు పక్కనపెట్టిందని, డీపీఆర్ అప్రైజల్ జరిగేలా బోర్డుకు తగిన ఆదేశాలు ఇవ్వాల ని కేంద్రాన్ని కోరింది. దీంతో పాటు పోలవరం బ్యాక్‌వాట ర్, అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు క్లియరెన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ గురువారం లేఖలు రాశారు. కా ళేశ్వరం ఎత్తిపోతలలో రోజుకు 2 టీఎంసీలను తరలించే ప్రధాన ప్రాజెక్టుతో పాటు వెనువెంటనే చేపట్టిన రోజుకు అదనంగా ఒక టీఎంసీని తరలించే పథకాన్ని కలిపి ఒకే పథకంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ సవరణ డీపీఆర్‌ను కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ)కి సమర్పించిన విషయం విదితమే. కాళేశ్వరం అదనపు టీఎంసీ ప్రత్యేక ప్రాజెక్టేనని, దానికి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని, అప్పటిదాకా పనులు చేయడానికి వీల్లేదని, యథాతథా స్థితిని కొనసాగించాలని జూలై 27న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కారణాలతో డీపీఆర్ ను పరిశీలించడం సబ్‌జ్యుడిస్ అవుతుందని, డీపీఆర్‌ను ముట్టుకునే ప్రసక్తే లేదంటూ గోదావరి బోర్డు లేఖ రాసిం ది. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులపైనే న్యాయస్థానం అ భ్యంతరాలు ఉన్నాయని, అనుమతుల ప్రక్రియపై లేవని పేర్కొంది. అదనపు టీఎంసీది కొత్త ప్రాజెక్టు కాదని, కాళేశ్వరంలో అంతర్భాగమేనని కేంద్ర జలశక్తి మంత్రిని సీ ఎం కేసీఆర్ కోరారని గుర్తు చేసింది. అందులో భాగంగానే సవరణ డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి సమర్పించామని రజత్ కుమార్ నివేదించారు. కాళేశ్వరం డీపీఆర్ పరిశీలన ప్రక్రియను పూర్తి చేసేలా గోదావరి బోర్డుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పోలవరం బ్యాక్‌వాటర్‌తో ఏపీ సరిహద్దు నుంచి తెలంగాణ దాకా 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలు నీట మునుగుతాయని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది.