ఆ ఆడియో నాది కాదు... కోర్టులో తేల్చుకుంటా: Mahendar reddy
ABN , First Publish Date - 2022-04-28T16:53:48+05:30 IST
తాండూరు టౌన్ సీఐ రాజేందర్‌రెడ్డిని దూషించిన కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు.

తాండూరు: తాండూరు టౌన్ సీఐ రాజేందర్‌రెడ్డిని దూషించిన కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఆ ఆడియో తనది కాదని... ఈ విషయంలో కోర్టులో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇదంతా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేయిస్తున్నారని ఆరోపించారు. ‘‘పోలీసులను నోటీసు ఇవ్వమనండి... విచారణను ఎదుర్కొంటా’’ అని తెలిపారు. రోహిత్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. తాండూరు పట్టణంలో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తన ముందు రౌడీ షీటర్లు వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చిందని, అక్కడికి ఇద్దరు రౌడీ షీటర్లు వచ్చారని తెలిపారు. ఈ విషయంలో రూరల్, టౌన్ సీఐతో మాట్లాడినట్లు చెప్పారు. పోలీసులు అంటే తనకు గౌరవం ఉందన్నారు. అధికారులు అంతా తాండూరు రావాలని కోరుకుంటారని అన్నారు. పోలీసులతో చాలా బాగుంటానని పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే....
తాండూరు టౌన్ సీఐ రాజేందర్‌రెడ్డిపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏప్రిల్ 23న (శనివారం) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తనకు అడ్డుగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అనుచరులతో కూర్చున్నా.. సీఐ రాజేందర్‌రెడ్డి వారించలేదనే ఆగ్రహంతోనే ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఈ ఫోన్‌కాల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాల్లో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, సీఐ రాజేందర్‌రెడ్డి మధ్య సంభాషణ ఇలా సాగింది.. ‘‘రౌడీ షీటర్లు వస్తే ఎట్లా ఊకున్నవ్. మరి నీవేం పీకుతున్నవ్’’ అని ఎమ్మెల్సీ అనగా.. ‘‘సార్ మంచిగా మాట్లాడండి’’ అని సీఐ అన్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఎమ్మెల్సీ పచ్చి బూతులు తిడుతున్నట్లు ఆడియో సంబాషణ ఉంది. దీనిపై సీఐ రాజేందర్‌రెడ్డిని వివరణ కోరగా.. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తనను దూషించడంపై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. కాగా... ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు బుధవారం రాత్రి తాండూరు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు.