బీఆర్‌ఎస్‌ సరే.. టీఆర్‌ఎస్‌ సంగతేంటి

ABN , First Publish Date - 2022-06-12T08:22:20+05:30 IST

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) మహారాష్ట్రలో పుట్టింది! జాతీయ స్థాయికి విస్తరించాలని భావించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పశ్చిమ బెంగాల్‌లో ఆవిర్భవించింది! జాతీయ స్థాయి విస్తరణ ప్రణాళికల్లో ఉంది!

బీఆర్‌ఎస్‌ సరే.. టీఆర్‌ఎస్‌ సంగతేంటి

తెలంగాణలో యథావిధిగా కొనసాగుతుందా!

భారత రాష్ట్ర సమితిలో విలీనమవుతుందా!?..

పార్టీ భవితపై రాజకీయ వర్గాల్లో హాట్‌ హాట్‌ చర్చ

జాతీయ స్థాయిలో కేసీఆర్‌ది ఒంటరి పోరాటమేనా!?..

కొన్ని పార్టీలు కాంగ్రెస్‌ కూటమిలో.. మరికొన్ని ఎన్డీయేలో

మిగిలిన పార్టీల నాయకులు జాతీయ స్థాయి విస్తరణలో..

మరి, ఒంటరిగా జాతీయ స్థాయికి విస్తరించడం సాధ్యమేనా!?

బీఆర్‌ఎస్‌ భవితపై రాజకీయ వర్గాల్లో విశ్లేషణలెన్నో!!


రాష్ట్రపతి ఎన్నికల్లో వ్యూహం ఏంటి?

రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్‌ వ్యూహం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీ అభ్యర్థికి ప్రత్యామ్నాయంగా అభ్యర్థిని నిలపాలని కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. మరోవైపు మమత వివిధ రాజకీయ పార్టీలకు లేఖలు రాశారు. కేసీఆర్‌కు ఫోన్‌ కూడా చేశారు. మరి, ఏ కూటమితో కలవకుండా సొంతంగా పార్టీ పెట్టాలని భావిస్తున్న కేసీఆర్‌ రాష్ట్రపతి ఎన్నికల్లో ఏం చేస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ప్రతిపక్షాల అభ్యర్థికి మద్దతు ఇస్తారా!? లేక ఏ పక్షం వహించకుండా రెండు కూటములకు సమాన దూరమంటూ మౌనంగా ఉంటారా? అని రాజకీయ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.


హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) మహారాష్ట్రలో పుట్టింది! జాతీయ స్థాయికి విస్తరించాలని భావించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పశ్చిమ బెంగాల్‌లో ఆవిర్భవించింది! జాతీయ స్థాయి విస్తరణ ప్రణాళికల్లో ఉంది! ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీలో శ్రీకారం చుట్టింది! దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు విస్తరిస్తోంది! ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) అధినేత కేసీఆర్‌ జాతీయ పార్టీ పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు! దాని పేరు ‘భారత రాష్ట్ర సమితి’ (బీఆర్‌ఎస్‌) అనే సంకేతాలూ వస్తున్నాయి! ఈ నేపథ్యంలో, అందరి మనసుల్లోనూ వెల్లువెత్తుతున్న సందేహం ఒక్కటే! అదే.. టీఆర్‌ఎస్‌ ఉంటుందా!? ఉండదా!? అన్నదే! ఎన్సీపీ, తృణమూల్‌, ఆప్‌ తదితర పార్టీలు ఆయా పేర్లతోనే జాతీయ స్థాయికి విస్తరిస్తున్నాయి. ఇందుకు కారణం.. ఆయా పార్టీల పేర్లలో స్థానికత, ప్రాంతీయతను సూచించే పదాలు లేకపోవడమే. కానీ, టీఆర్‌ఎస్‌ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ఏర్పడిన పార్టీ కావడమే ఇందుకు కారణం. దాంతో, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎప్పట్లాగే కొనసాగుతుందా!? జాతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌ ఏర్పడుతుందా!? లేక, బీఆర్‌ఎ్‌సలో టీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందా!? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.


నిజానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ప్రాంతీయ వాదంతో టీఆర్‌ఎస్‌ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర సమితిగా జాతీయ స్థాయికి వెళ్లే అవకాశం లేదు. పార్టీ పేరులోనే ఒక ప్రాంతానికి పరిమితమైనట్లుగా స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో, జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటున్నారు. అప్పుడు.. టీఆర్‌ఎస్‌ సంగతేమిటనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీని కొనసాగిస్తూ, దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు జాతీయ పార్టీ అంటే రాజకీయంగా చెల్లుబాటు కష్టమవుతుంది. ఇతర రాష్ట్రాలకు జాతీయ పార్టీ, తెలంగాణలో మాత్రం ప్రాంతీయ పార్టీ ఏమిటనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఈ నేపథ్యంలోనే, ఉద్యమ పార్టీ కథ ముగిసిందని, ఇకనుంచి రాజకీయ పార్టీగా కొనసాగుతుందని కేసీఆర్‌ గతంలో ప్రకటించినట్లుగానే.. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ కనుమరుగై జాతీయ పార్టీలో విలీనమవుతుందా? అనే సందేహాలను ఆ పార్టీ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి.


ఒంటరి పోరాటమేనా!?

‘టీఆర్‌ఎ్‌సను స్థాపించినప్పుడు నేనొక్కడినే. నాతో గుప్పెడు మంది మాత్రమే ఉన్నారు. 13 ఏళ్లు పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించాం’ అని సీఎం కేసీఆర్‌ తరచూ చెబుతుంటారు. ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ ఆయన ఒక్కరే ఒంటరి పోరాటం చేస్తారా!? ఆయనతో కలిసొచ్చే రాజకీయ పార్టీలేవి!? అన్న అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వామపక్షాలు సహా ఆయనతో కలిసి వచ్చే పార్టీలు కానీ, కూటములు కానీ ఏమీ లేవని, ఈ పరిస్థితుల్లో అడుగు ఎలా ముందుకు పడుతుందనే సందేహాలు టీఆర్‌ఎస్‌ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి. జాతీయ పార్టీ పేరిట అటు దృష్టి సారిస్తే, రాష్ట్రంలో పలుచన అవుతామనే ఆందోళన కూడా వారిలో వ్యక్తమవుతోంది. నిజానికి, తొలుత కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి కట్టడానికి కేసీఆర్‌ పావులు కదిపారు. 2018లో ముందస్తు ఎన్నికలకు ముందే బీజేపీ, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయం అంటూ హడావుడి చేశారు. తీరా ఎన్నికల సమయానికి దానిని పక్కన పెట్టారు. మళ్లీ కొద్ది నెలల కిందట కూటమి కట్టే ప్రయత్నాలు మొదలెట్టారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తదితరులను కలిశారు.


హైదరాబాద్‌కు వచ్చిన సీపీఐ, సీపీఎం జాతీయ నాయకులనూ ప్రగతి భవన్‌కు పిలిపించుకుని చర్చలు జరిపారు. ఆ తర్వాత, కొంత కాలంపాటు మౌనంగా ఉన్న కేసీఆర్‌.. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందు ఢిల్లీకి వెళ్లి ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ను, కర్ణాటక వెళ్లి జేడీఎస్‌ అధినేత దేవెగౌడను కలిసి వచ్చారు. అంతకు ముందే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ తదితరులతోనూ మంతనాలు జరిపారు. ఆయా నేతల నుంచి ఎటువంటి హామీ లభించిందనే విషయం తెలియదు కానీ.. తాజాగా కూటమి కట్టడానికి కేసీఆర్‌ విముఖంగా ఉన్నారనే సంకేతాలు వస్తున్నాయి. యునైటెడ్‌ ఫ్రంట్‌, నేషనల్‌ ఫ్రంట్‌ ప్రయోగాలన్నీ గతంలో విఫలమయ్యాయని, దేశ ప్రజలు వాటితో విసిగిపోయి ఉన్నారన్న అభిప్రాయం మంత్రులు, ఎంపీలు, ముఖ్య నాయకులతో శుక్రవారం కేసీఆర్‌ నిర్వహించిన సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది. కప్పల తక్కెడ, కలగూర గంప వ్యవహారాలతో రాజకీయ అధికారం వచ్చినా దేశాన్ని మార్చడం సాధ్యపడదని కూడా, అసలు ఇలాంటి ఫ్రంట్‌లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కూడా అభిప్రాయపడినట్లు సమాచారం.


ఈ నేపథ్యంలో, జాతీయ పార్టీ పెట్టడం ఒక్కటే ప్రత్యామ్నాయమని, కేసీఆర్‌ నేతృత్వంలోనే పార్టీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. దేశంలో రాజకీయ, నాయకత్వ శూన్యత కూడా ఉందని అభిప్రాయపడినట్లు తెలిసింది. దీనినిబట్టి, మిగిలిన పార్టీలతో కలవకుండా కేసీఆర్‌ సొంతంగా జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి, కాంగ్రెస్‌ కూటమిలో భాగమైన డీఎంకే, ఎన్సీపీ, శివసేన వంటి పార్టీలు ఇప్పుడు కాంగ్రె్‌సతో సంబంధాలు తెంచుకునే పరిస్థితి లేదు. అన్నాడీఎంకే, వైసీపీ, బిజూ జనతాదళ్‌ తదితర పార్టీలకు బీజేపీతో వైరం తెచ్చుకునే ఆసక్తి లేదంటున్నారు. శరద్‌ పవార్‌, మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌ తదితరులు తాము కూడా జాతీయ స్థాయికి విస్తరించాలని పావులు కదుపుతున్నారు.


అఖిలేశ్‌ యాదవ్‌ వంటి నేతలు, వామపక్ష పార్టీలు కేసీఆర్‌ ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీని నమ్ముకుని కలిసొచ్చే అవకాశాలూ తక్కువేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీనికితోడు, తెలంగాణలో ఉన్నవి మొత్తం 17 ఎంపీ స్థానాలు. వాటిలో గత ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు వచ్చినవి పట్టుమని తొమ్మిది స్థానాలు. కానీ, డీఎంకే, తృణమూల్‌ పార్టీలకు దాదాపు 40 చొప్పున ఎంపీ స్థానాలున్నాయి. సింగిల్‌ డిజిట్‌లోనే ఎంపీ స్థానాలున్నా కూటములు లేకుండా ఒంటరిగా పార్టీ పెట్టి జాతీయ స్థాయికి ఎదగాలని కేసీఆర్‌ భావిస్తుండడంపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.


దేశవ్యాప్త విస్తరణ సాధ్యమేనా!?

ప్రాంతీయ వాదమే పునాదిగా, రాష్ట్ర విభజన లక్ష్యంగా ఏర్పడిన పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించడం సాధ్యమేనా!? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. తెలంగాణ మినహా టీఆర్‌ఎ్‌సకు ఎక్కడా ప్రాతినిధ్యం లేదు. పార్టీ యంత్రాంగమూ లేదు. ఇప్పుడు జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తే.. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల్లో పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఎన్నికల్లో పోటీ చేసి గణనీయంగా సీట్లను సాధించాల్సి ఉంటుంది.


అప్పుడు మాత్రమే ఇతర రాష్ట్రాల నేతలు కేసీఆర్‌ వైపు కాస్త దృష్టి సారించే అవకాశం ఉంటుంది. కానీ, వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసి గణనీయంగా సీట్లను సాధించడం కేసీఆర్‌కు సాధ్యమేనా? అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎన్సీపీని శరద్‌ పవార్‌ దాదాపు 23 ఏళ్ల కిందట ఏర్పాటు చేశారు. తొలి రోజుల్లో వివిధ రాష్ట్రాల్లో ఉనికిని చాటారు. కానీ, చివరకు మహారాష్ట్రకే పరిమితమయ్యారు. తృణమూల్‌ కాంగ్రె్‌సను మమతా బెనర్జీ 24 ఏళ్ల కిందట ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే వివిధ రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు. ఇక, కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు వెళుతున్న పార్టీగా ఆమ్‌ ఆద్మీకి పేరుంది. సాక్షాత్తూ దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీనే ఢీ కొట్టారన్న పేరు తెచ్చుకున్న కేజ్రీవాల్‌కే తన పార్టీని ఇతర రాష్ట్రాలకు  బలంగా విస్తరించడానికి దాదాపు పదేళ్ల సమయం పట్టింది. కేంద్రంలో ప్రధానిగా మోదీ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో సామదానభేద దండోపాయాలన్నింటినీ ప్రయోగించినా ఆప్‌ విజయాన్ని బీజేపీ ఆపలేకపోయింది.


రెండోసారి సాక్షాత్తూ అమిత్‌ షా రంగంలోకి దిగి శక్తియుక్తులన్నీ ప్రయోగించినా ఆ ఎన్నికల్లో బీజేపీ సింగిల్‌ డిజిట్‌ను దాటలేదు. ఇటీవలే ఆప్‌ పంజాబ్‌లో అధికారాన్ని దక్కించుకుంది. రాబోయే ఎన్నికల్లో గోవా, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో అధికారం దిశగా అడుగులు వేస్తోంది. నిజానికి, ఢిల్లీనే తన కార్యక్షేత్రమని కేజ్రీవాల్‌ ఎన్నడూ ప్రకటించలేదు. మినీ భారతదేశాన్ని తలపించే, మధ్యతరగతి వర్గం అధికంగా ఉండే ఢిల్లీలో తన ప్రయోగాన్ని అమలు చేశారు. అక్కడ విజయం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. అటువంటిది.. ఇప్పుడు అత్యంత శక్తిమంతమైన నేతగా పేరున్న మోదీని ఢీకొని దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ఉనికిని చాటడం తెలంగాణ వంటి చిన్న రాష్ట్రం నుంచి వెళుతున్న కేసీఆర్‌కు సాధ్యమేనా అన్న సందేహాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘‘ఉత్తరాది రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కేసీఆర్‌ గురించి ఏమీ తెలియదు.


ఈశాన్య రాష్ట్రాల పార్టీలు, ఆ రాష్ట్రాల సీఎంల గురించి దక్షిణాది రాష్ట్రాల గ్రామీణ ఓటర్లకు ఎంత తెలుసునో.. టీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ గురించీ ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు అంతే తెలుసు. ఒకరోజు ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన అక్కడి ప్రజలకు కేసీఆర్‌, ఆయన పెట్టబోయే రాజకీయ పార్టీపై అవగాహన ఏర్పడదు. ఈ నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ విస్తరణ ఎంతవరకు సాధ్యం!?’’ అని రాజకీయ విశ్లేషకుడు ఒకరు ప్రశ్నించారు.

Updated Date - 2022-06-12T08:22:20+05:30 IST