టీఆర్‌ఎస్‌ చీలిపోతోంది

ABN , First Publish Date - 2022-06-27T08:41:48+05:30 IST

టీఆర్‌ఎస్‌ చీలిపోయే పరిస్థితి ఏర్పడిందని, సీఎం ఆశావహులు, తమ ఎమ్మెల్యేలను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు...

టీఆర్‌ఎస్‌ చీలిపోతోంది

సీఎం కుర్చీ కోసం కేసీఆర్‌ కుటుంబంలో కొట్లాట

మా ఒత్తిడితోనే ‘టీచర్ల ఆస్తుల జీవో’ వెనక్కి

బీజేపీని కట్టడి చేసేందుకు సీఎంవోలో విభాగం

ప్రధాని సభకు టీఆర్‌ఎస్‌ ఆటంకాలు: సంజయ్‌

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రత్యేక పూజలు

సీఎం పదవి కోసం కేసీఆర్‌ కుటుంబంలో కొట్లాట: బండి సంజయ్‌


హైదరాబాద్‌/సిటీ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ చీలిపోయే పరిస్థితి ఏర్పడిందని, సీఎం ఆశావహులు, తమ ఎమ్మెల్యేలను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం కేసీఆర్‌ కుటుంబంలో కొట్లాట జరుగుతోందని చెప్పారు. ‘‘కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్‌ తాపత్రయపడుతున్నారు. ఒక్క నెల రోజులైనా సీఎంగా ఉండి మాజీ సీఎం అయినా అనిపించుకోవాలని కేటీఆర్‌ తహతహలాడుతుంటే, తనకే ఆ అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ కూతురు పట్టుబడుతున్నారు. అగ్గిపెట్టె దొరక్కున్నా పెట్రోలు పోసుకున్న తాను సీఎం కావాలని అల్లుడు అంటున్నారు. రోజూ మందులో సోడా పోసే తాను సీఎం కావాలని తోడల్లుడి కుమారుడు ఆశపడుతున్నారు. అసలు తమకు సీఎం ఎవరు..? అని.. మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తల పట్టుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ ఎప్పుడు ఏ పథకం ప్రవేశపెడతారో, ఎప్పుడు ఏ జీవో జారీకి ఆదేశిస్తారో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆస్తుల కొనుగోలుకు సంబంధించి వివాదాస్పద జీవో ఇచ్చి, బీజేపీ ఒత్తిడి తట్టుకోలేక వెనక్కి తీసుకున్నారని చెప్పారు. కాగా, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని గిరిజన తండాల్లో సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయాలను నిర్మిస్తామని సంజయ్‌ హామీ ఇచ్చారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అఖిల భారత బంజారా సంఘం నాయకులతోపాటు పలువురు గిరిజనులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడారు. కేసీఆర్‌ పాలనలో కనీస వేతనాల్లేక, వివక్షకు గురవుతున్న పూజారులకు న్యాయం చేస్తామని చెప్పారు. ఇక, పరేడ్‌ గ్రౌండ్‌లో వచ్చే నెల 3న నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను సంజయ్‌ పరిశీలించారు. మైదానంలో ప్రత్యేక పూజలు చేశారు.  


బీజేపీలో చేరిన టీఆర్‌ఎస్‌ నాయకులు..

సంజయ్‌ సమక్షంలో ఆదివారం పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీలో చేరారు. రాష్ట్ర కనీస వేతనాల సలహా సంఘం చైర్మన్‌ సామ వెంకటరెడ్డి, చందానగర్‌ నగర్‌ మాజీ కార్పొరేటర్‌ నవతా రెడ్డి, అఖిల భారత బంజారా సంఘం నాయకులు కృష్ణా నాయక్‌, మాలోతు చంద్రశేఖర్‌, సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ కౌన్సిలర్‌ డాక్టర్‌ రాజాగౌడ్‌, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర నాయకులు నాగేశ్వర్‌ రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి తదితరులు బీజేపీలో చేరారు.

Updated Date - 2022-06-27T08:41:48+05:30 IST