బీఆర్‌ఎస్‌గా టీఆర్‌ఎస్

ABN , First Publish Date - 2022-10-05T19:00:37+05:30 IST

21 ఏళ్ల టీఆర్‌ఎస్ ప్రస్థానం మరో కీలక మలుపు తిరిగింది. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

బీఆర్‌ఎస్‌గా టీఆర్‌ఎస్

హైదరాబాద్: 21 ఏళ్ల టీఆర్‌ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు తిరిగింది. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ  ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కేసీఆర్ ఆమోదించారు. కొత్త పార్టీ బీఆర్‌ఎస్‌ను కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించారు. పార్టీ జెండా, ఎజెండాపై టీఆర్ఎస్‌ నేతలకు కేసీఆర్ వివరించారు. అంతకుముందు టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సమావేశం ముందు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు బలపర్చారు. ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజరైనారు. టీఆర్ఎస్ పేరు మార్పుపై తీర్మానం చేశారు. అనంతరం సంతకాలు సేకరించారు.


తీర్మానాన్ని ఢిల్లీ తీసుకెళ్లనున్న వినోద్‌కుమార్‌

టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ చేసిన తీర్మానాన్ని పార్టీ సీనియర్‌ నేత, రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్‌ బృందం ఢిల్లీకి తీసుకెళ్లనుంది. కేసీఆర్‌ కొనుగోలు చేసిన చార్టర్డ్‌ విమానంలో ఈ నెల 6న వీరు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ తీర్మానాన్ని సమర్పిస్తారు. ఈసీఐ దీనిని పరిశీలించి ఆమోదం తెలపగానే బీఆర్‌ఎస్‌ ప్రస్థానం మొదలవుతుంది. కాగా, జాతీయ పార్టీగా మారిన అనంతరం అఖిల భారత స్థాయిలో కొన్ని అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా తొలుత కిసాన్‌ సంఘ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అనేకమంది రైతు సంఘాల ప్రతినిధులతో కేసీఆర్‌ చర్చలు జరిపారు. జాతీయ పార్టీ కార్యకలాపాల కోసం ఢిల్లీలో ఇప్పటికే ఒక కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నారు. ఈ నెల 9న ఈ కార్యాలయంలో ఒక సమావేశం కూడా టీఆర్‌ఎస్‌ నేతలు నిర్వహించనున్నారు.


టీఆర్‌ఎస్ ప్రస్థానం

2001 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్‌ను కేసీఆర్ ప్రకటించారు. ఆ రోజు ఆయన పెద్ద సంఖ్యలో తెలంగాణ ఉద్యమకారులతో తన సొంతూరు చింతమడక నుంచి హైదరాబాద్ వచ్చారు. పెద్ద సంఖ్యలో హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్.. నాంపల్లి దర్గా నుంచి తన ఉద్యమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అసెంబ్లీ ముందు ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అక్కడి నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసానికి కేసీఆర్ వెళ్లారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ను ప్రకటించారు. ఇదిగో ఇప్పుడు సరిగ్గా 21 ఏళ్ల టీఆర్‌ఎస్ ప్రస్థానం తర్వాత ఆ పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది. ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్‌ఎస్ ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది.Read more