షర్మిల పాదయాత్రపై టీఆర్‌ఎస్‌ దాడి

ABN , First Publish Date - 2022-07-06T08:24:33+05:30 IST

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రపై టీఆర్‌ఎస్‌ నేతలు మంగళవారం దాడి చేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్నపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రెండు సార్లు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

షర్మిల పాదయాత్రపై టీఆర్‌ఎస్‌ దాడి

  • వైఎస్సార్‌టీపీ నేత సోమన్నపై టీఆర్‌ఎస్‌ నేతల అటాక్‌
  • పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నం.. లక్కవరంలో షర్మిల నిరసన
  • దాడికి పాల్పడిన వారి అరెస్టుకు డిమాండ్‌.. వర్షంలోనూ 4 గంటలు ధర్నా
  • బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో విరమణ 
  • పాదయాత్ర ఎలా చేస్తావో చూస్తామని పోలీసులు బెదిరించారు: షర్మిల


హుజూర్‌నగర్‌ , జూలై 5: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రపై టీఆర్‌ఎస్‌ నేతలు మంగళవారం దాడి చేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్నపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రెండు సార్లు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.  పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేయగా.. తమ నేతలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ షర్మిల ధర్నాకు దిగారు. జోరువాన కురుస్తున్నా నాలుగు గంటలకు పైగా ఆందోళన కొనసాగించారు. బా ధ్యులపై చర్యలు తీసుకుంటామని స్థానిక డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి స్వయంగా హామీ ఇవ్వడంతో రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఆమె నిరసన విరమించారు. 


115వ రోజు, మంగళవారం ప్రజాప్రస్థానం పాదయాత్రను సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నుంచి ప్రారంభించిన షర్మిల మధ్యాహ్నానికి లక్కవరం చేరుకుని నిరుద్యోగ నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే, ఈ దీక్షలో పాల్గొన్న ఏపూరి సోమన్నపై కొందరు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడికి యత్నించారు. దీంతో దీక్షా శిబిరం ఉద్రిక్తంగా మారగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు అక్కడి నుంచి వెనుదిరిగాయి. అనంతరం దీక్షా శిబిరంలో ప్రసంగించిన షర్మిల, సోమన్న.. ఎమ్మెల్యే సైదిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత దీక్షా శిబిరం నుంచి సాయంత్రం తిరిగి ప్రారంభమైన పాదయాత్ర కొద్ది దూరం చేరగానే.. టీఆర్‌ఎస్‌ నేతలు సోమన్నపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో ఇరువర్గాల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం వైఎస్సార్‌ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు. సోమన్నపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. దాడి చేసిన వారిని ఘటనా స్థలం నుంచి పంపిచేయడంపై సీఐ రామలింగారెడ్డి, ఎస్‌ఐలు వెంకటరెడ్డి, సైదులు, రవికుమార్‌తో వాగ్వాదానికి దిగారు. 


వర్షంలోనూ నిరసన..

సోమన్నపై దాడి చేసిన వారిని అరెస్టు చేసేదాకా ధర్నా విరమించేది లేదని షర్మిల పట్టుబట్టారు. సాయంత్రం ఐదు గంటలకు ధర్నాకు దిగిన ఆమె రాత్రి తొమ్మిది గంటల వరకు అక్కడి నుంచి కదలలేదు. ఈ సమయంలో భారీ వర్షం కురుస్తున్నా తడుస్తూనే ఆందోళన కొనసాగించారు. దీంతో అక్కడికి చేరుకున్న కోదాడ డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి ఆమెతో స్వయంగా మాట్లాడారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని, సోమన్నకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో  షర్మిల నిరసన విరమించారు.


పోలీసులు బెదిరించారు: షర్మిల 

తనతో ఘర్షణకు దిగిన పోలీసులు పాదయాత్ర ఎలా చేస్తావో చూస్తామంటూ తనను బెదిరించారని షర్మిల ఆరోపించారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ఎమ్మెల్యే సైదిరెడ్డి తమపై దాడి చేయించారని అన్నారు. టీఆర్‌ఎస్‌ మఠంపల్లి మండల అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య, స్థానిక సర్పంచ్‌ భర్త నూకపంగు నరేష్‌, వారి అనుచరులు సోమన్నపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసినా పోలీసులు వారిని పంపించేశారని మండిపడ్డారు. అంతేకాక తమ మహిళా నేత చైతన్యరెడ్డిపై పోలీసులే దాడి చేశారని ఆరోపించారు. ఈ విషయాలపై పోలీసుల అందరిపైనా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు గులాబీ కండువాలు వేసుకుని పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు.

Updated Date - 2022-07-06T08:24:33+05:30 IST