గిరిజన సంక్షేమమే మా లక్ష్యం

ABN , First Publish Date - 2022-02-19T06:57:45+05:30 IST

గిరిజన సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని

గిరిజన సంక్షేమమే మా లక్ష్యం

 కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి


ఓరుగల్లు, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గిరిజన సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని, అందుకే కేంద్ర కేబినెట్‌లో ఏడుగురు గిరిజనులకు ప్రధాన మంత్రి మోదీ అవకాశం కల్పించారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ దేవతలకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయమంత్రి రేణుకా సింగ్‌తో కలిసి కిషన్‌రెడ్డి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. కరోనా మహమ్మారిని తుదముట్టించి ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా చూడాలని సమ్మక్క- సారలమ్మలను వేడుకున్నట్లు తెలిపారు.


విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో రూ.45 కోట్లు కేటాయించామని, త్వరలోనే పనులు చేపట్టి పూర్తి చేస్తామన్నారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రసాద్‌ స్కీం ద్వారా రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. జాతర అభివృద్ధిపై దృష్టి సారించామని, ఈ ఏడాది రూ.2.50 కోట్లు మంజూరు చేశామన్నారు. 2016-2017లో స్వదేశీ దర్శన్‌ పథకంలో భాగంగా ములుగు ప్రాంతానికి రూ.80 కోట్లు కేటాయించామని, ఈ నిధులతోనే మేడారంలోని హరిత హోటల్‌, గిరిజన మ్యూజియం నిర్మించినట్లు చెప్పారు. 


Read more