నేడు జైలు నుంచి ఆ ముగ్గురి విడుదల

ABN , First Publish Date - 2022-12-07T02:38:45+05:30 IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న సింహయాజి బుధవారం విడుదల కానున్నారు.

నేడు జైలు నుంచి   ఆ ముగ్గురి విడుదల

బుధవారం ఉదయానికి సింహయాజి

రామచంద్ర భారతి, నందు సాయంత్రానికి

వీరిద్దరినీ మళ్లీ అరెస్టు చేసే అవకాశం?

హైదరాబాద్‌, సైదాబాద్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న సింహయాజి బుధవారం విడుదల కానున్నారు. పూచీకత్తు, ష్యూరిటీల సమర్పణ పూర్తి కావడంతో ఏసీబీ ప్రత్యేక కోర్టు నుంచి మంగళవారం సాయంత్రం 5.30 తర్వాత జైలు అధికారులకు రిలీజ్‌ ఆర్డర్‌ అందింది. నిబంధనల ప్రకారం సాయంత్రం 5.30 లోపు ఈ ఉత్తర్వులు అంది ఉంటే వెంటనే విడుదల చేసేవారు. ఆలస్యం కావడంతో సింహయాజి విడుదలకు వాయిదా పడింది. బుధవారం ఉదయం 7 గంటలకు ఆయన బయటకు రానున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్‌కు కూడా బుధవారం పూచీకత్తు, ష్యూరిటీల సమర్పణ పూర్తికానున్నాయి. వీరు సాయంత్రంలోగా విడుదలయ్యే వీలుంది. నందకుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు జారీ చేసిన పీటీ వారెంట్‌ కేసులోనూ నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదలకు ఎలాంటి ఆటంకం లేకుండా పోయింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎ-1గా ఉన్న రామచంద్ర భారతిపై వేర్వేరు కేసులు నమోదైనా.. దేంట్లోనూ పోలీసులు కోర్టును ఆశ్రయించలేదు. ఈ నేపథ్యంలో ఆయన విడుదలకూ ఎలాంటి అడ్డంకి లేదు. కాగా, ఈ ముగ్గురికీ హైకోర్టు గత గురువారం షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది.

రూ.3 క్షల చొప్పున వ్యక్తిగత బాండ్లు, ఒక్కొక్కరు ఇద్దరు వ్యక్తులతో అంతే మొత్తానికి ష్యూరిటీలు సమర్పించాలని, ప్రతి సోమవారం సిట్‌ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, ఎమ్మెల్యేల కొనుగోలుకు వందల కోట్ల డీల్‌ నెరిపిన వీరు.. ష్యూరిటీ డబ్బు సర్దుబాటుకు ఇబ్బంది పడ్డారు. మరోవైపు అక్టోబరు 26న మొయినాబాద్‌ ఫాంహౌ్‌సలో నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతూ పట్టుబడి అదే నెల 28 నుంచి చంచల్‌గూడ జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్న ముగ్గురు నిందితులను ఒకరితో మరొకరు కలిసే అవకాశం లేకుండా వేర్వేరు బ్యారెక్‌లలో ఉంచారు. రామచంద్ర భారతి, నందకుమార్‌ను వేరే కేసులలో పోలీసులు తిరిగి అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న కేసులలో వీరిని పీటీ వారెంట్‌పై కస్టడీకి తీసుకుని విచారించాల్సి ఉంది. జైలు నుంచి విడుదలైతే న్యాయపరంగా తిరిగి అదుపులోకి తీసుకునే అవకాశం ఉండదు. ఈ క్రమంలో పోలీసులు జైలు వద్ద కాచుకుని ఉన్నారని సమాచారం.

Updated Date - 2022-12-07T02:38:46+05:30 IST