ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసేలా

ABN , First Publish Date - 2022-12-15T00:35:48+05:30 IST

సాధారణ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారం జరిగితే మరో 10 నెలల సమయం మాత్రమే ఉండడంతో ఉమ్మడి జిల్లాకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల పై కార్యాచరణ ప్రారంభమైంది. నాగార్జునసాగర్‌, మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన సుమారు ఎనిమిది ఎత్తిపోతల పథకాలను రూ.1697 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారు.

ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసేలా

భూసేకరణ వేగవంతం చేయాలని ఆధికారులకు ఆదేశాలు

రూ.1,697కోట్లతో 2.40 లక్షల ఎకరాలకు సాగునీరు

సాగర్‌, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం

వాటి పూర్తికి కసరత్తు ప్రారంభించిన అధికారులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): సాధారణ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారం జరిగితే మరో 10 నెలల సమయం మాత్రమే ఉండడంతో ఉమ్మడి జిల్లాకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల పై కార్యాచరణ ప్రారంభమైంది. నాగార్జునసాగర్‌, మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన సుమారు ఎనిమిది ఎత్తిపోతల పథకాలను రూ.1697 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి నిధుల కేటాయిం పు, టెండర్లు ఖరారు కాగా, తాజాగా భూసేకరణ వేగవంతం చేయాలని జిల్లా అధికారులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.

నాగార్జునసాగర్‌ ఆయకట్టు ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సుమారు 6 లక్షలఎకరాలు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కింద సాగవుతున్నాయి. అయి తే ఎడమ కాల్వ చివరి భూములకు, ఆయకట్టులో ఎత్తయిన ప్రాంతాల కు సాగునీరు అందడం లేదు. కృష్ణాజలాలు అందుబాటులో ఉన్నా భూ ములు బీళ్లుగా మారుతున్నాయి. దీంతో రైతులు బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవరకొండ, నాగార్జునసాగర్‌,మిర్యాలగూడ, నకిరేకల్‌ ఎమ్మెల్యేలు పలు ఎత్తిపోతల పథ కాలకు ప్రతిపాదనలు తయారుచేయించి నిధుల కోసం గ తంలో పలుమార్లు సీఎం కేసీఆర్‌ను విజ్ఞప్తి చేశారు. కాగా, వరుసగా ఉప ఎన్నికలు రావడంతో ఆ సందర్భంలో సీఎం నిర్వహించిన ప్రచార సభల్లో ఎమ్మెల్యేలు కోరిన ఎత్తిపోతల పథకాలకు ఆయనహామీ ఇచ్చి నిధులు విడుదల చేశారు.

రూ.664.80కోట్లతో నెల్లికల్లు ఎత్తిపోతల

నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని తిరుమలగిరి, పెద్దవూర మండలాల పరిధిలో ఎగువ ప్రాంతాల్లో ఉన్న 4,175 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు గతంలో నెల్లికల్లు ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. అయితే నాగార్జునసాగర్‌ జలాశయం సమీపంలో ఉండడంతో ఈ పథకాన్ని రీడిజైన్‌ చేసి 24,886 ఎకరాలకు సాగు నీరు అందించేలా అధికారులు ప్రతిపాదించారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సమయంలో ఈ ప్రాజెక్టును ఏడాదిన్నరలోపు పూర్తిచేస్తామని సీఎం స్వయంగా హామీ ఇచ్చారు. రూ.664.80కోట్ల అంచనా వ్యయం తో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుమతి తెలిపింది. మెగా ఇంజనీరింగ్‌ సంస్థ ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఒప్పందం సైతం చేసుకుం ది. నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించి కాంట్రాక్టు సంస్థకు అప్పగించాలని తాజాగా ఆదేశాలు అందాయి. ఈ ప్రాజెక్టు పరిధి లో అటవీ, ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయి. కొద్ది మేర ప్రైవేటు వ్యక్తుల నుంచి భూ సేకరణ చేయాల్సి ఉంది. నల్లమల రిజర్వ్‌ ఫారెస్టు నుంచి భూసేకరణకు ఇబ్బందు లు ఎదురయ్యే పరిస్థితి ఉంది. దీం తో అటవీ భూమిని సేకరించినందుకు మరోచోట ప్రత్యామ్నాయంగా అటవీశాఖకు భూమి కేటాయించి మొక్కల పెంపకానికి నిధులు సైతం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. తాజాగా అధికారుల ఆదేశాల మేరకు ఈ పథకం పనులు వేగంగా ముందుకుసాగనున్నాయి.

దేవరకొండలో 2లక్షల ఎకరాలకు సాగునీరు

దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలం పొగిళ్ల సమీపంలో రూ.24.64కోట్లతో,నేరేడుగొ మ్ము మండలంలోని వైజాగ్‌ కాలనీ సమీపంలో అంబాభవాని ఎత్తిపోతల నిర్మాణానికి రూ.184.56కోట్లు, చందంపేట మండలం కంబాలపల్లి గ్రామ సమీపంలో రూ.202.15కోట్లతో కంభాలపల్లి ఎత్తిపోతల పథకం నిర్మాణాని కి ప్రభుత్వం ప్రాథమిక అనుమతులు మంజూరు చేసింది. పీఏపల్లి మండలం పెద్దగ ట్టు తండా వద్ద రూ.82.727కోట్లతో పెద్దగట్టు ఎత్తిపోతల, ఇదే మండలంలోని అంగడిపేట సమీపంలో రూ.90.96కోట్లతో ఏకేబీఆర్‌ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతు లు మంజూరు చేసింది. ఈ ఐదు ఎత్తిపోతల పథకాల ద్వారా 2లక్షల ఎకరాలు దేవరకొండ ని యోజకవర్గంలోని ఎగువ ప్రాంతంలోని భూములకు సాగునీరు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈప్రాజెక్టులు పూర్తిచేసేందుకు అవసరమైన భూ సేకరణ వెనువెంటనే ప్రారంభించాలని జిల్లా అ ధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీనికి ఎక్కువగా అటవీశాఖ భూములు సేకరించాల్సి ఉంది.

మిర్యాలగూడకు ఐదు ఎత్తిపోతల పథకాలు

మిర్యాలగూడ నియోజకవర్గంలో కేశవపురం-కొండ్రపోలు, బొత్తలపాలెం, వాడపల్లి-వీర్లపాలెం, తోపుచర్ల, దున్నపోతులగండి-బాల్నెపల్లి-చాంప్లాతండా మొత్తం ఐదు ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అందుకు సుమారు రూ.351కోట్ల నిధుల విడుదలకు అనుమతులు ఇచ్చింది. ఈ ఐదు ఎత్తిపోతల పథకాల ద్వారా నియోజకవర్గంలోని 30,110 ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా ప్రైవేటు భూములే ఉండగా, వాటిని అధికారులు సేకరించాల్సి ఉంది.

నకిరేకల్‌లో 10వేల ఎకరాలకు ప్రణాళిక

నకిరేకల్‌నియోజకవర్గంలోని కట్టంగూరు మండలం అయిటిపాముల వద్ద రూ.101.62కోట్లతో అయిటిపాముల ఎత్తిపోతల పథకానికి ప్రభు త్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ పథకం ద్వారా కట్టంగూరు, కేతేపల్లి,నకిరేకల్‌, శాలిగౌరారం మండలాల్లోని 10వేల ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ చేయాలని ప్రభుత్వం అధికారులను తాజాగా ఆదేశించింది.

ధర్మారెడ్డిపల్లి కాల్వకు భూసమస్య

భువనగిరి, నకిరేకల్‌ నియోజకవర్గాలకు సాగు నీరు అందించే ధర్మారెడ్డిపల్లి కాల్వ విస్తరణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 50 క్యూసెక్యుల సామర్థ్యం ఉన్న ఈ కాల్వను 208 క్యూసెక్యులకు పెం చుతూ అధికారులు రీడిజైన్‌ చేయగా ప్రభుత్వం ఆమోదించింది. కొత్త ప్రతిపాదనలతో 17,787ఎకరాలకు సాగు నీరు అందించాలి. గత ఏడాది డిసెంబరు నాటికే ఈ పనులు పూర్తికావాల్సి ఉంది. అయితే ఈ కాల్వ కు 238 ఎకరాలు రైతుల నుంచి సేకరించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 92 ఎకరాలు మాత్రమే అధికారులు సేకరించారు. మరో 146 ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉంది. ఈ పనులను వెంటనే పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలో ము క్యాల బ్రాంచ్‌ కెనాల్‌ సమీపంలో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.1,450కోట్లతో ప్రభుత్వం అనుమతి ఇవ్వగా భూసేకరణ పూర్తి కావాల్సి ఉంది.

హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని జాన్‌పాడ్‌ బ్రాంచ్‌ కెనాల్‌ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.447.27కోట్ల విడుదలకు ప్రభుత్వం అనుమతించింది. కాగా భూసేకరణ కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం చోటుచేసుకుంది.

భూసేకరణకు అధికారుల కసరత్తు

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశంతో అధికారులు భూసేకరణ ప్రక్రియకు కసరత్తు ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు ఎలా ఉన్నాయి, పరిహారం చెల్లింపు, అటవీశాఖ నుంచి ఎదురయ్యే ఆటంకాలు తదితర అంశాలను క్రోడీకరిస్తున్నారు. అనంతరం ప్రణాళిక ప్రకారం ప్రత్యక్షంగా భూసేకరణ చేపట్టేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. అంతా అనుకున్నట్టు జరిగితే భూసేకరణ ప్రక్రియను గడువులోగా ముగించి నీటిపారుదలశాఖ, కాంట్రాక్ట్‌ సంస్థలకు భూమిని అప్పగించనున్నారు. ఆ తరువాత ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనుల్లో వేగం పెరగనుంది.

Updated Date - 2022-12-15T00:35:53+05:30 IST