నల్లమలలో పులి కూనల పరుగులు
ABN , First Publish Date - 2022-10-17T09:10:35+05:30 IST
దట్టమైన అటవీ ప్రాంతం.. సమృద్ధిగా ఆహారం.. వాహనాలు, ప్రజల సంచారం అతి తక్కువగా ఉండడం..
- 5 నుంచి 7 వరకు ఉన్నట్లు అంచనా
- క్రమంగా పెరుగుతున్న పులుల సంఖ్య
- సేఫ్ జోన్‌గా అమ్రాబాద్ అభయారణ్యం
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): దట్టమైన అటవీ ప్రాంతం.. సమృద్ధిగా ఆహారం.. వాహనాలు, ప్రజల సంచారం అతి తక్కువగా ఉండడం.. అటవీ శాఖ చర్యలు.. వెరసి అమ్రాబాద్ అభయారణ్యంలో పులి కూనలు సందడి చేస్తున్నాయి. ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా 5 నుంచి 7 వరకు పులి కూనలు ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) ఈ ఏడాది విడుదల చేసిన జాబితా ప్రకారం నల్లమల అటవీ ప్రాంతంలో 21 పులులు జీవిస్తున్నాయి. అయితే, రాష్ట్ర అధికారులు మాత్రం వీటి సంఖ్య 23 దాకా ఉంటుందని చెబుతున్నారు. తాజాగా వీటికి 7 కూనలు జన్మించినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. అడవిలో ఏర్పాటు చేసిన కెమెరాల ఫుటేజీని పరిశీలించిన అధికారులు.. ఓ తల్లి పులి వెంట రెండు కూనలు తిరుగుతుండడం గుర్తించారు. వీటితో పాటు మరో రెండు కూనలు తల్లి లేకుండా సంచరిస్తున్నట్లు తేల్చారు. ఇవి కాకుండా, అక్కడక్కడా ఓ పులి వెంట మరో కూన తిరుగుతూ కెమెరా కంటికి దొరికింది. పది రోజుల కిందట రాత్రి పూట అడవిలో పెట్రోలింగ్‌కు వెళ్లినప్పుడు ఓ పెద్ద పులి తారసపడిన వీడియోను నాగర్‌కర్నూల్ డీఎ్‌ఫవో రోహిత్ గోపిడి ట్విటర్లో అప్లోడ్ చేసి.. సంతోషం వ్యక్తం చేశారు.
సేఫ్ జోన్‌గా అమ్రాబాద్
అమ్రాబాద్ అభయారణ్యం పెద్దపులులకు సేఫ్‌జోన్‌గా మారింది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో 892.23 చదరపు కిలోమీటర్ల మేర కవ్వాల్ అభయారణ్యం విస్తరించి ఉంది. అయితే, అభయారణ్యం సమీపంలోనే జాతీ య రహదారులు ఉండడం, పెద్ద ఎత్తున పోడు సాగు జరుగుతుండడంతో అలజడి నెలకొంటోంది. ఇక, అమ్రాబాద్ విషయానికి వస్తే నల్లమల అటవీ ప్రాంతంలో 2,611.4 చదరపు కి.మీ.మేర విస్తరించి ఉంది. ఎలాంటి అలజడి లేకపోవడం, వేల సంఖ్యలో శాకాహార జంతువులు జీవిస్తుండడం వల్ల.. వాటిపై ఆధారపడ్డ పులుల సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.