ఇదేం నిర్లక్ష్యం!

ABN , First Publish Date - 2022-08-25T08:01:06+05:30 IST

ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారు విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

ఇదేం నిర్లక్ష్యం!

ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారుపై ప్రభుత్వ నాన్చుడు ధోరణి


మరోవైపు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం

ఎక్కడ ఎంత ఫీజు ఉంటుందో తెలియని పరిస్థితి

ఆప్షన్ల నమోదులో విద్యార్థుల అయోమయం

ఈసారికి గత ఏడాది ఫీజులేనన్న కమిటీ

ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురుచూపులు


హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ ఫీజుల ఖరారు విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఓవైపు రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ ప్రారంభమైనప్పటికీ... ప్రభుత్వం మాత్రం ఇంకా ఫీజులను ఖరారు చేయలేదు. దాంతో లక్ష మందికిపైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉందనే విషయంపై స్పష్టత వస్తే... అందుకు అనుగుణంగా కౌన్సెలింగ్‌లో ఆప్షన్లను నమోదు చేసుకునే అవకాశం విద్యార్థులకు ఉంటుంది. అయితే... ప్రభుత్వం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాకపోవడంతో విద్యార్థులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఫీజు తెలియకపోవటంతో... ఏ కాలేజీని ఎంచుకోవాలనే విషయంలో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ఫీజుల ఖరారుకు సంబంధించి తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎ్‌ఫఆర్‌సీ) తన నివేదికను సమర్పించి 20 రోజులు గడుస్తున్నా... ప్రభుత్వం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 


రాష్ట్రంలో మూడేళ్లకోసారి ఇంజనీరింగ్‌ ఫీజులను ఖరారు చేస్తున్నారు. గతంలో ఖరారు చేసిన ఫీజుల గడువు 2021-22తో ముగిసింది. దాంతో వచ్చే మూడేళ్ల (2022-23, 2023-24, 2024-25) కోసం ఈ ఏడాది కొత్త ఫీజులను నిర్ణయించాల్సి ఉంది. ఈ మేరకు నాలుగు నెలల కిందట టీఏఎ్‌ఫఆర్‌సీ ప్రత్యేక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఫీజులను ఎంత మేర పెంచాలనే అంశంపై పలుమార్లు సమావేశాలను నిర్వహించి, ఆయా కాలేజీలతో సంప్రదింపులను కూడా పూర్తి చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఫీజుల పెంపుపై కొన్ని ప్రతిపాదనలను ఆమోదించింది. దేశంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కనీస ఫీజును రూ.79,600గా, గరిష్ఠ ఫీజును రూ.1.89 లక్షలుగా నిర్థారిస్తూ...


బీఎన్‌ శ్రీకృష్ణ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ చేసిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇదే విషయాన్ని ఏఐసీటీఈ అధికారులు అన్ని రాష్ట్రాలకు తెలియజేశారు. అయితే... ఫీజులను సొంతంగానే ఖరారు చేయాలని రాష్ట్రం నిర్ణయించటంతో ఆ మేరకు టీఏఎ్‌ఫఆర్‌సీ అధికారులు తమ కసరత్తును పూర్తి చేశారు. ఇందులో భాగంగా కాలేజీలు సమర్పించిన ఆడిట్‌ నివేదికలను పరిశీలించారు. ఫీజుల పెంపుపై కాలేజీల అభ్యర్థనలను స్వీకరించారు. కాలేజీల ప్రతిపాదనలను పరిశీలించి... ఆదాయ, వ్యయాలకు అనుగుణంగా ఫీజులను ఏ మేరకు ఖరారు చేయవచ్చో ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీనికోసం... కరోనా కంటే ముందు (2019) ఏడాది వార్షిక ఆదాయ లెక్కలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో కనీస ఫీజును రూ.35వేల నుంచి రూ.45వేలకు,  అలాగే గరిష్ఠ ఫీజును రూ.1.40లక్షల నుంచి రూ.1.70లక్షల వరకు పెంచాలనే ఆలోచన కూడా చేశారు. అయితే... ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సూచనలతో టీఏఎ్‌ఫఆర్‌సీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. అందులో భాగంగా ఆగస్టు 1వ తేదీన ప్రత్యేకంగా సమావేశమైన కమిటీ... ఈ ఏడాది ఫీజులను పెంచకూడదని నిర్ణయించింది. ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలను కూడా సమర్పించింది. అయితే... కమిటీ ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఫీజులను పెంచాలా? లేక పాత ఫీజులనే కొనసాగించాలా? అనే విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయం. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయలేదు.


ఫీజులు తెలియకుండానే కౌన్సెలింగ్‌

రాష్ట్రంలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ నెల 21  నుంచి అభ్యర్థులు  స్లాట్‌లను నమోదు చేసుకుంటున్నారు. అయితే తాము ఆప్షన్‌గా పెట్టుకుంటున్న కాలేజీల్లో ఫీజులు ఎంత ఉంటాయో తెలియక విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. సాధారణంగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కావటానికి ముందే ఫీజుల ఖరారుపై ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవటంతో అధికారులు కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు.


కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లే ఎక్కువ

 ఇంజనీరింగ్‌లో ఈ ఏడాది కన్వీనర్‌ కోటాలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు సీట్లు మొత్తం 65,633 ఉన్నాయి. వీటికి అదనంగా మరో 30శాతం సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటా పరిధిలో ఉన్నాయి. అయితే... మొత్తం సీట్లలో సుమారు 50 శాతం కంప్యూటర్‌ సైన్స్‌, సంబంధిత కోర్సులకు చెందినవే ఉన్నాయి. అంటే... కన్వీనర్‌ కోటా పరిధిలో 32వేలకు పైగా కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు ఉన్నాయి. అలాగే సివిల్‌ ఇంజనీరింగ్‌లో 4,548 సీట్లు, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌లో 7,032, ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో 11,375, ఎలక్ర్టికల్‌ అండ్‌ ఎలక్ర్టానిక్స్‌లో 5,337, ఐటీలో 4,592, మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో 4,284 సీట్లు ఉన్నాయి.

Updated Date - 2022-08-25T08:01:06+05:30 IST