కార్యవర్గానికి ఇది కీలకమే!

ABN , First Publish Date - 2022-07-01T08:56:36+05:30 IST

హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆ పార్టీకి అత్యంత కీలకం కానుంది.

కార్యవర్గానికి ఇది కీలకమే!

  • బీజేపీ సమావేశానికి జంబో ప్రతినిధి వర్గం 
  • మొత్తం 352 మంతి ప్రతినిధుల హాజరు
  • తొలి రోజున రాష్ట్రాల నివేదికల సమర్పణ 
  • గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌.. తెలంగాణ ఎన్నికలపై చర్చించే అవకాశం
  • దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపైనా చర్చ
  • ప్రధాని సహా పాల్గొననున్న అతిరథ మహారధులు 


హైదరాబాద్‌, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆ పార్టీకి అత్యంత కీలకం కానుంది. హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది, ఈ తరుణంలో నాలుగు నెలలకు ఓసారి జరగాల్సిన ఈ సమావేశానికి..  ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌ వేదికైంది. జాతీయ కార్యవర్గ సభ్యులు 80 మందితో పాటుగా ఆహ్వానితులు, శాశ్వత ఆహ్వానితులు, ఆఫీస్‌ బేరర్లు, పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రకారం ఉన్న 40 రాష్ట్ర కమిటీ అధ్యక్షులు, 33 రాష్ట్రాల పార్టీ శాసనసభా పక్ష నేతలు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులు తదితర 352 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. తొలి రోజున 40 మంది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తమ రాష్ట్రాల్లోని రాజకీయ, ఇతర పరిస్థితులపైన నివేదికలను సమర్పించనున్నారు. 


నిర్ణయాలు చేసే అత్యున్నత కమిటీ

పార్టీకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అత్యున్నతమైన బాడీ జాతీయ కార్యవర్గమే. ఆ పార్టీ రాజ్యాంగం ప్రకారం జాతీయ కార్యవర్గంలోని సభ్యులందర్నీ పార్టీ జాతీయ అధ్యక్షుడే నామినేట్‌ చేస్తారు. మొత్తం 80 మందికి గాను 27 మంది మహిళలు, 8 మంది ఎస్సీ, ఎస్టీలను కార్యవర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆహ్వానితులుగా మరో 24 మందిని, శాశ్వత ఆహ్వానితులుగా మరి కొందరిని తీసుకోవచ్చు. ఈ కమిటీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా మోదీ, అమిత్‌షా, ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ, తదితర అతిరథ మహారధులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, గరికపాటి రామ్మోహన్‌రావులు ఉన్నారు. ఆపీస్‌ బేరర్లూ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాలో డీకే అరుణ పాల్గొననున్నారు. పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు సోము వీర్రాజు, బండి సంజయ్‌లు పాల్గొంటున్నారు. మరి కొందర్నీ ఆహ్వానితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాగా,   2020లో ఏర్పాటైన జాతీయ కార్యవర్గం.. 2023తో ముగుస్తుంది. దీంతో వచ్చే ఏడాది కొత్త కార్యవర్గం ఏర్పాటు కానుంది. అయితే ప్రస్తుతం జాతీయ కార్యవర్గ సమావేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టే అంశంపైనా చర్చించనున్నారు. సభ్యత్వ నమోదు చేపట్టకుంటే హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సమావేశమే ఈ కమిటీకి చివరిదవుతుందని అంటున్నారు. 


కీలకాంశాలు ఇవే..

హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలు, సంస్థాగత నిర్మాణంపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉందంటున్నారు. అయితే గుజరాత్‌తో పాటుగా ఎన్నికలు జరిగేందుకు వీలుగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ వెళ్లే అవకాశం ఉందని, బీజేపీకి పోటీగా జాతీయ స్థాయిలో బీఆర్‌ఎస్‌ పార్టీని ఏర్పాటు చేసే యోచనలో ఆయన ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఈ అంశంపైనా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉందంటున్నారు. 

Updated Date - 2022-07-01T08:56:36+05:30 IST