ఇప్పటివరకు ఏ ఫ్రంటూ లేదు!
ABN , First Publish Date - 2022-03-05T06:39:36+05:30 IST
జాతీయ స్థాయిలో తాము ఏర్పాటు చేయబోయేది బీజేపీ
- బీజేపీకి, కాంగ్రెస్‌కు వ్యతిరేక ఫ్రంట్ కాదు
- ప్రత్యామ్నాయంపై త్వరలో నిర్ణయం
- కేంద్రంలోని సర్కార్ దేశాన్ని
- సరైన దిశలో నడిపించడంలేదు
- దేశం నవీన దిశగా పయనించే అంశంపై చర్చిస్తున్నాం: కేసీఆర్
- జార్ఖండ్ సీఎం సోరెన్, ఆయన తండ్రి శిబు సోరెన్‌తో రాంచీలో భేటీ
- ఇద్దరు ‘గల్వాన్ లోయ’ అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల సాయం
హైదరాబాద్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో తాము ఏర్పాటు చేయబోయేది బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కాదని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ కూడా కాదన్నారు. కొంత మంది థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ అంటూ మాట్లాడుతున్నారని, కానీ.. ఇప్పటివరకు ఏ ఫ్రంట్‌నూ ఏర్పాటు చేయలేదని తెలిపారు. భవిష్యత్తులో దీనిపై స్పష్టత వస్తుందన్నారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ శుక్రవారం అటునుంచి జార్ఖండ్ రాజధాని రాంచీకి వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో సమావేశమయ్యారు.
దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ఇద్దరు సీఎంలు చర్చించారు. హేమంత్ తండ్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్‌తోనూ భేటీ అ య్యారు. గల్వాన్ లోయలో చైనా సైనికులతో ఘర్షణలో అమరుడైన జవాను కుమార్ ఓఝా భార్య నమ్రత ఓఝాకు, మరో అమరుడు గణేశ్ కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొప్పున సీఎం కేసీఆర్ చెక్కులను అందించారు. హేమంత్ సోరెన్‌తో భేటీ అనంతరం ఆయనతో కలిసి కేసీఆర్ సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ మధ్య ఫలవంతమైన చర్చలు, రాజకీయపరమైన చర్చలు కూడా జరిగాయని అన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు నేతలతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
‘‘75 ఏళ్ల స్వాతంత్ర్యానంతరం కూడా దేశం అభివృద్ధి చెందాల్సినంతగా అభివృద్ధి చెందలేదు. ప్రపంచంతో పోలిస్తే చాలా విషయాల్లో మనం వెనకబడిపోయాం. పొరుగున ఉన్న చైనా అభివృద్ధి చెందింది. ఎన్నో ఆసియా దేశాలు అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దేశాన్ని సరైన దిశలో నడిపించడం లేదు. దేశం నవీన దిశగా పయనించాల్సి ఉంది. ఈ విషయంపై మా మధ్య చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే మేమంతా ఒకచోట కలుస్తాం. తర్వాత ఏ ఎజెండాతో ముందుకెళ్లాలన్న అంశంపై అందరం కలిసి చర్చిస్తాం. ఈ విషయాలను తర్వాత మీడియాకు స్పష్టంగా వివరిస్తాం’’ అని కేసీఆర్ అన్నారు. అయితే దేశాన్ని సరైన దిశలో తీసుకుపోవాల్సిన ఒక గట్టి ప్రయత్నం జరగాలని, అది ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు.
పురోగామి భారత్‌ను నిర్మించాలి..
రానున్న రోజుల్లో పురోగామి భారత్‌ను నిర్మించాల్సి ఉందని, అందులో జర్నలిస్టుల పాత్ర కూడా ఉండాలని ఆశిస్తున్నామని కేసీఆర్ అన్నారు. ‘‘కొందరు థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ అని మాట్లాడుతున్నారు. దీనికి ఇప్పుడే పేరు పెట్టకండి. నేను చెప్పదలుచుకున్న విషయాలను మంచి మనసుతో, అర్థవంతంగా చెబుతున్నాను. ప్రస్తుతమున్న భారత్ కంటే ఎన్నో రెట్లు మెరుగైన భారత్‌ను నిర్మించి, వాటి ఫలితాలను ప్రజలకు అందించాలన్నదే మా ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే మా ప్రయత్నాలు సాగుతున్నాయి. దేశంలో ఎన్నో పార్టీలను, పలు సంఘాల నేతలను, రైతు నాయకులను కలవడం జరుగుతోంది. ఏ విషయంలో ఎలా ముందుకు పోవాలనే విషయాన్ని ఒకటి రెండు రోజుల్లో నిర్ణయించలేం. అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఒక దారి దొరుకుతుంది. ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలా? లేదా మరొకటి ఏర్పాటు చేయాలా? అనే విషయాలను మీకు మున్ముందు తెలియజేస్తాం’’ అని కేసీఆర్ వివరించారు.
గల్వాన్ లోయలో చైనా సైనికులతో ఘర్షణలో ప్రాణా లు కోల్పోయిన 20మంది భారత జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామని ఆనాడే చెప్పామని కేసీఆర్ గుర్తు చేశారు. నాటి పోరాటానికి నేతృత్వం వహించి అసువులు బాసిన తెలంగాణ వాసి కల్నల్ సంతో్‌షబాబు కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు వీర సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తామన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వద్ద ప్రస్తావించగా.. తమను రావాల్సిందిగా ఆహ్వానించారని చెప్పారు.
ఉద్యమంలో శిబు సోరెన్ అండగా నిలిచారు..
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంలో హేమంత్ తండ్రి శిబు సోరెన్ తమ వెన్నంటే ఉన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. 2001లో ఉద్యమాన్ని ప్రారంభించిన సమయంలో ప్రథమ ప్రత్యేక అతిథిగా శిబు సోరెన్ హాజరయ్యారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రతి దశలో అండగా నిలిచారన్నారు. కాగా, శిబు సోరెన్‌తో భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్‌తోపాటు ఎంపీ సంతో్‌షకుమార్, ఎమ్మెల్సీ కవిత ఆయనకు పాదాభివందనం చేశారు.
బిర్సా ముండాకు నివాళి
రాంచీలోఎ కేసీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. ముందు గా విమానాశ్రయం నుంచి బిర్సా ముండా చౌక్‌కు చేరుకున్న కేసీఆర్.. అక్కడ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, జార్ఖండ్ ప్రజ ల ఆరాధ్య నాయకుడు భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి హేమంత్ సోరెన్ అధికార నివాసానికి వెళ్లారు. కేసీఆర్ వెంట బి.వినోద్‌కుమార్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సీఎస్ సోమేశ్‌కుమార్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. అనంతరం కేసీఆర్ బృందం రాంచీ నుంచి తిరుగు ప్రయాణమై సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది.

మోదీ దయ వల్ల బయటపడ్డారా?
విద్యార్థుల తరలింపుపై కేటీఆర్ ప్రశ్న
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థుల తరలింపుపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రధాని మోదీ దయ వల్లే బతికి బయటపడ్డామంటూ ఉక్రెయిన్ నుంచి వస్తున్న విద్యార్థులతో నినాదాలు చేయించడం దారుణమన్నారు. విద్యార్థులతో వైమానిక సిబ్బంది నినాదాలు చేయిస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ టీఆర్‌ఎస్ నాయకుడు జగన్ చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. అర్థంలేనితననానికి ఈ చర్యలు పరాకాష్ట అని విమర్శించారు.
అయితే ఉక్రెయిన్ నుంచి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు చేరుకున్న విద్యార్థులు.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల చలవ వల్ల తమను ఇక్కడ చక్కగా చూసుకుంటున్నారంటూ ట్వీట్ చేయడాన్ని ప్రస్తావిస్తూ కొందరు.. ‘మరి ఇదేంటి కేటీఆర్ గారూ?’ అని ట్విటర్‌లో ప్రశ్నించారు.