సినీ ఫక్కీలో చోరీ

ABN , First Publish Date - 2022-04-24T06:06:23+05:30 IST

సినీ ఫక్కీలో చోరీ

సినీ ఫక్కీలో చోరీ
నగదు అపహరించి పరారవుతున్నముగ్గురు దుండగులు

పోచమ్మమైదాన్‌(వరంగల్‌), ఏప్రిల్‌ 23: నగరంలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్నవారిని అడ్డగించి కళ్లలో కారం చల్లి నగదు అపహరించారు ముగ్గురు దుండగులు. ఈ ఘటన వరంగల్‌ శాంతినగర్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం. వరంగల్‌ బ్యాంకు కాలనీ-2 శాంతినగర్‌కు చెందిన కూచన కన్నయ్య అనే వ్యక్తి వరంగల్‌ డీమార్ట్‌ సమీపంలో మహాలక్ష్మి ఐరన్‌ హార్డ్‌వేర్‌ షాపు నడుపుతున్నాడు. రోజులాగే శనివారం రాత్రి షాపు మూసివేసిన తరువాత బ్యాగులో డబ్బులు పెట్టుకొని స్కూటీపై తన కొడుకు వినయ్‌తో కలిసి ఇంటికి బయలుదేరాడు. శాంతినగర్‌ సమీపంలోకి రాగానే గుర్తుతెలియని ముసుగు ధరించిన వ్యక్తి.. వీరి ద్విచక్రవాహనాన్ని అడ్డగించి కన్నయ్య కళ్లలో కారం చల్లాడు. వారు కింద పడిపోగానే వినయ్‌ చేతిలో ఉన్న డబ్బుల బ్యాగు లాక్కొన్నాడు. ఆ తర్వాత అక్కడ పల్సర్‌ బైక్‌పై మరో ఇద్దరు ఉండగా.. పరుగెత్తి డబ్బుల బ్యాగ్‌తో బైక్‌ ఎక్కాడు.  అయితే బాధితులు తేరుకొని కేకలు వేయగా..  ఎదురుగా వస్తున్న ఓ బాటసారి దుండగులను అడ్డగించాడు. దీంతో వారు కిందపడిపోయారు. బైక్‌ను అక్కడే వదిలేసి ఆ ముగ్గురు దుండగులు పరారయ్యారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. బాధితుడి కొడుకు కూచన వినయ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  

కాగా, దుండగులు ఎత్తుకెళ్లిన బ్యాగులో సుమారు రూ.7లక్షల నగదు ఉన్నట్లు బాధితుడు కన్నయ్య తెలిపారు. ప్రతిరోజు షాపు మూసివేసిన తరువాత డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తానని, ముసుగు ధరించి ఉండటం తో వారిని ముఖం సరిగా కనబడలేదని వాపోయాడు. పక్కా పధకం ప్రకారమే ముగ్గురు దుండగులు దాడి చేశారని వాపోయాడు. ఇదిలావుండగా, నిందితుల కోసం పోలీసు బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగాయి. వరంగల్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఎస్‌.అశోక్‌కుమార్‌, సీసీఎస్‌ ఏసీపీ డేవిడ్‌రాజ్‌, మట్టెవాడ సీఐ సీహెచ్‌ రమేశ్‌, సీసీఎస్‌ సీఐ రమేశ్‌, ఇంతేజార్‌గంజ్‌ సీఐ మల్లేశ్‌యాదవ్‌, తమ బృందాలతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. నిందితులు వదిలివెళ్లిన నంబరులేని పల్సర్‌ ద్విచక్రవాహనాన్ని పోలీ స్‌స్టేషన్‌కు తరలించారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో నగరంలోని పలుచోట్ల గాలిస్తున్నారు. 



Updated Date - 2022-04-24T06:06:23+05:30 IST