వాషింగ్‌ మిషన్‌ దారికి అడ్డంగా పెట్టారని!

ABN , First Publish Date - 2022-12-07T03:37:30+05:30 IST

రెండిళ్ల వసారా(వరండా)లో దారికి అడ్డంగా వాషింగ్‌ మిషన్‌ పెట్టిందన్న కారణంతో ఓ మహిళను పొరిగింటి తండ్రీకొడుకులు బండరాయితో మోది, కొడవలితో నరికి హత్య చేశారు.

వాషింగ్‌ మిషన్‌ దారికి అడ్డంగా పెట్టారని!

కదిరిలో మహిళ దారుణ హత్య

బండరాయితో మోది.. కొడవలితో నరికి పరార్‌

పొరుగింటి తండ్రీకొడుల ఘాతుకం

నిందితుల కోసం పోలీసుల గాలింపు

కదిరి, డిసెంబరు 6: రెండిళ్ల వసారా(వరండా)లో దారికి అడ్డంగా వాషింగ్‌ మిషన్‌ పెట్టిందన్న కారణంతో ఓ మహిళను పొరిగింటి తండ్రీకొడుకులు బండరాయితో మోది, కొడవలితో నరికి హత్య చేశారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని మశానం పేటలో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానికులు, పట్టణ సీఐ మధు తెలిపిన మేరకు, మశానం పేటలో డాన్స్‌ మాస్టర్‌ తేపల్లి మనోహర్‌, ఆయన భార్య పద్మావతి(30), ముగ్గురు కూతుళ్లతో ఉంటున్నారు. వీరి ఇంటి పక్కనే వేమానాయక్‌, ఆయన కుమారుడు ప్రకాశ్‌ నాయక్‌ ఉంటున్నారు. వేమానాయక్‌ ఇంటికి వెళ్లేందుకు మనోహర్‌ ఇల్లు దాటాల్సి ఉంటుంది. ఈ దారిలో పద్మావతి తరచూ వాషింగ్‌ మిషన్‌ పెట్టి బట్టలుతికేవారు. కేవలం వేమానాయక్‌ తన ఇంటికి వెళ్లే దారిలో వాషింగ్‌ మిషన్‌ అడ్డుగా ఉందన్న కారణంగా రెండు కుటుంబాల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం మనోహర్‌ తన పెద్ద కూతురితో కలిసి డాన్స్‌ క్లాస్‌కు వెళ్లాడు. ఆ తరువాత పద్మావతి బట్టలు ఉతకడానికి వాషింగ్‌ మిషన్‌ బయట పెట్టింది. దీంతో ఆగ్రహించిన వేమనాయక్‌,

ప్రకా్‌షనాయక్‌ ఆమెతో గొడవపడ్డారు. వివాదం ముదిరి.. ఆమెపై తండ్రీకొడుకులు బండరాయితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన పద్మావతి రక్తపుమడుగులో పడి కొట్టుకుంటుండగా, ఆమె చిన్న కూతుళ్లు తండ్రికి ఫోన్‌ చేసి ‘అమ్మను కొడుతున్నారు..’ అని సమాచారం ఇచ్చింది. దీంతో మనోహర్‌ వెంటనే ఇంటికి వచ్చి, రక్తపు మడుగులో ఉన్న భార్యను కదిరి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథ మ చికిత్స అనంతరం బెంగళూరు తరలిస్తుండగా ఆమె మృతిచెందారు. పద్మావతిపై తండ్రీకొడుకులు బండరాయితో మోదడంతోపాటు కొడవలితో దాడి చేశారని, ఆ తరువాత ఇంటికి తాళం వేసి పరారయ్యారని స్థానికులు తెలిపారు. మనోహర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2022-12-07T03:37:31+05:30 IST