మద్దతు వెనుక మతలబు?
ABN , First Publish Date - 2022-06-28T09:26:14+05:30 IST
బీజేపీకి, కాంగ్రె్‌సకు సమాన దూరం అన్నారు. కాంగ్రె్‌సతో కలిసి వేదికను కూడా పంచుకోబోమన్నారు...

తొలుత తటస్థ వైఖరి అంటూ సంకేతాలు
కాంగ్రె్‌సతో వేదిక పంచుకోబోమని ప్రకటన
చివరికి యశ్వంత్ నామినేషన్‌కు కేటీఆర్
తటస్థంగా ఉంటే బీజేపీకి సహకరించిందనే.. ఆరోపణలు వస్తాయనే ఉద్దేశంతోనే నిర్ణయం!
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి..అభ్యర్థి యశ్వంత్‌కు జైకొట్టిన టీఆర్ఎస్
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): బీజేపీకి, కాంగ్రె్‌సకు సమాన దూరం అన్నారు. కాంగ్రె్‌సతో కలిసి వేదికను కూడా పంచుకోబోమన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిని నిర్ణయించేందుకు నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ హాజరైనందున.. తాము రాబోమన్నారు. కానీ, చివరికి కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థి తరఫున ఏకంగా నామినేషన్ దాఖలు కార్యక్రమంలోనే పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ వైఖరిలో వచ్చిన ఈ మార్పు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చే విషయాన్ని టీఆర్ఎస్ ఆదివారం వరకూ ప్రకటించకపోగా, సోమవారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఈ చర్చకు తెరతీసింది. ప్రస్తుత సమీకరణాలను బట్టి బీజేపీ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతున్నా.. సీఎం కేసీఆర్ ముందునుంచి చెబుతున్నట్లుగా తటస్థ వైఖరిని కూడా అవలంబించకపోవడం ఆసక్తి కలిగిస్తోంది. వాస్తవానికి రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించడం కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి రావాల్సిందిగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. సీఎం కేసీఆర్‌కు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి సహకరించాలని కేసీఆర్‌ను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కోరారు. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్యులతో చర్చలు జరిపిన సీఎం కేసీఆర్.. చివరికి కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉన్న విపక్షాల ఉమ్మడి సమావేశానికి వెళ్ల కూడదని నిర్ణయించడం తెలిసిందే. ఆ సమావేశంలో కాంగ్రెస్ భాగస్వామి కావడమే ప్రధాన కారణంగా టీఆర్ఎస్ ముఖ్యులు చూపారు.
చివరి వరకు వేచి చూసే ధోరణి..
టీఆర్ఎస్ మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీని కాదనుకునే పరిస్థితి మిగిలిన విపక్షాలకు లేకపోవడంతో ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తటస్థ వైఖరితో ఉండే అవకాశమే ఎక్కువన్న చర్చ జరిగింది. కానీ, కేసీఆర్ మాత్రం.. తన వైఖరి ప్రకటించకుండా వేచి చూసే ధోరణినే అవలంబించారు. రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి బీజేపీ ప్రయత్నాలు కొనసాగించడం, అదే సమయంలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబడేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా తదితరులు విముఖత ప్రకటించడమే ఇందుకు కారణమని పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హాను ఖరారు చేయడంతో తన వైఖరిని స్పష్టం చేయాల్సిన పరిస్థితి టీఆర్‌ఎ్‌సకు ఏర్పడింది. తాను కేసీఆర్‌తో మాట్లాడానని, టీఆర్ఎస్ మద్దతు తమకే ఉంటుందని పవార్ ప్రకటించినా.. ఆ విషయాన్ని ఆదివారం వరకూ టీఆర్ఎస్ అంగీకరించలేదు. దీంతో ఈ విషయంలో చివరి వరకూ కేసీఆర్ కుషన్ ఉంచుకున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ అనూహ్యంగా ఆదివాసీ వర్గానికి చెందిన ద్రౌపదీ ముర్మును తమ అభ్యర్థిగా తెరపైకి తేవడంతో ఆమె అభ్యర్థిత్వాన్ని కాదంటే రాష్ట్రంలోని ఎస్టీ వర్గాలు ఎలా స్పందిస్తాయోనన్న సంశయం టీఆర్ఎస్ వర్గాల్లో ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇవ్వబోతున్నట్లుగా సంకేతాలు పంపి.. ఆదివారం వరకూ ప్రకటన చేయకుండా ఉన్నారని చెబుతున్నారు.
విపక్షాల సహకారం కోసమే..!
వాస్తవానికి రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల తరువాత.. బీజేపీ, కాంగ్రెస్ విధానాలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ తెరపైకి తెచ్చారు. పైగా రాష్ట్రంలో బీజేపీని ప్రధాన శత్రువుగా చూపించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాలని చూస్తున్నారు. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చే అవకాశమే లేదన్న సంకేతాలనిచ్చారు. ఇక కాంగ్రెస్ భాగస్వామ్యం ఉందన్న పేరుతో తటస్థ వైఖరిని ఎంచుకుంటే.. పరోక్షంగా బీజేపీకి సహకరించిందన్న ఆరోపణల్ని విపక్షాల నుంచి టీఆర్ఎస్ ఎదుర్కొనాల్సివస్తుంది. జాతీయ పార్టీ ఏర్పాట్లలో ఉన్న కేసీఆర్‌కు ఈ విషయంలో విపక్ష ప్రాంతీయ పార్టీల సహకారం అవసరం ఉంటుందని, అందుకే విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఢిల్లీలో మాట్లాడుతూ.. యశ్వంత్‌కు మద్దతుగా సంతకం పెట్టినంత మాత్రాన తాము కూటమిలో ఉన్నట్లు కాదని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.